సిటీ ట్రైనింగ్ సెంటర్‌తో పోలీస్ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు
మహిళల భద్రత కోసమే భరోసా కేంద్రాలు : డిజిపి బి.శివధర్ రెడ్డి
రాచకొండలో సిటీ ట్రైనింగ్ సెంటర్‌కు శంకుస్థాపన
భరోసా, కమాండ్ కంట్రోల్ సెంటర్‌ల ప్రారంభం
నవతెలంగాణ-సిటీబ్యూరో
సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీస్‌శాఖ కృషి చేస్తోందని, ఇందులో భాగంగానే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను మరింత బలోపేతం చేసి, వారికి అవసరమైన సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని డిజిపి బి.శివధర్ రెడ్డి తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లిలో నిర్మించనున్న సిటీ ట్రైనింగ్ సెంటర్ (సీటీసీ)కు సోమవారం రాచకొండ పోలీస్ కమిషనర్ జి.సుధీర్ బాబుతో కలిసి డిజిపి శంకుస్థాపన చేశారు. కమిషనరేట్ పరిధిలోని సరూర్‌నగర్‌లో భరోసా సెంటర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ.. దివిస్ లేబరేటరీస్ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధులతో సిటీ ట్రైనింగ్ సెంటర్‌ను నిర్మించడానికి ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
దీంతోపాటు, పోలీసు సిబ్బంది పిల్లల కోసం ముఖ్యమంత్రి మంజూరు చేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిర్మాణానికి సీిఎస్‌ఆర్ పథకం ద్వారా సహాయం చేస్తామని హామీ ఇవ్వడం ప్రశంసనీయమన్నారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో సిబ్బంది పిల్లలతోపాటు ఇతరులకు కూడా 50శాతం సీట్లను కేటాయించాలని సీఎం ఆదేశించినట్టు తెలిపారు. సిటీ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణంతో పోలీస్ సిబ్బంది కోసం వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉందన్నారు. నేరస్థులు సాంకేతికతో కూడిన వివిధ రకాల నేరాలకు పాల్పడుతున్నందున తదనుగుణంగా పోలీసు సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందని అభిప్రా యపడ్డారు. దీనికోసం, జిల్లాల్లోనూ శిక్షణ కేంద్రా లను నిర్మిస్తున్నామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తీవ్రమైన విషయంగా పరిగణించాలన్నారు.
డిఫెన్సివ్ డ్రైవింగ్ వంటి బాధ్యతాయుతమైన డ్రైవింగ్ చేయాలని, దానికి అవసరమైన కనీస పద్ధతులను పాటించాలని వాహనదారులకు సూచించారు. ‘అర్రైవ్, అలైవ్’ పేరుతో డిసెంబర్‌లో వాహనదారులకు, డ్రైవర్లకు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించ నున్నామని, దాని కోసం అన్ని వర్గాలవారు ముందుకు రావాలని కోరారు. మహిళల భద్రత కోసం భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు డిజిపి తెలిపారు. మహిళా బాధితులకు పూర్తి రక్షణ కల్పించడంతోపాటు, చట్టం ప్రకారం అన్ని రకాల కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడతాయన్నారు. సమస్యలు ఎదుర్కొం టున్న మహిళలు భరోసా కేంద్రాలను సంప్రదించొచ్చని చెప్పారు.
మంచి వాతావరణంలో పోలీస్ సిబ్బందికి శిక్షణ : సీపీ
మేడిపల్లిలో సిటీ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణానికి దివీస్ లేబరేటరీస్ లిమిటెడ్ ఎండీ డాక్టర్ డివి.మురళి కృష్ణప్రసాద్ ముందుకు రావడం ఎంతో సంతోషకరమని రాచకొండ సీపీ సుధీర్‌బాబు అన్నారు. మంచి వాతావరణంలో పోలీస్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు అందించేందుకు సీటీసీ ఉపయోగపడుతుందన్నారు. దివీస్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ డి.మధుబాబు, సంస్థ జీఎం సుబ్బారావు మాట్లాడుతూ.. పోలీస్ శాఖకు అవసరమైన సహాయం చేసేందుకు సీఎస్‌ఆర్ పథకంతో సంబంధం లేకుండా చేయూత అందిస్తామని వెల్లడించారు. రాచకొండ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి గగన్ దీప్, రాచకొండ సిపి జి.సుధీర్‌బాబు, తెలంగాణ పోలీస్ హౌసింగ్ ఇన్‌ఫ్రాటిక్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్ప్ లిమిటెడ్ ఎండి ఎం.రమేష్, రాచకొండ ఉమెన్స్ సేఫ్టీ వింగ్ డిసిపి టి.ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
సైబర్ క్రైమ్ నేరాలను అరికట్టేందుకు కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



