టూరిజంతో కలిసి పని చేయనున్న పోలీసుశాఖ
త్వరలో పోలీసు సిబ్బంది కేటాయింపు : రాష్ట్ర డీజీపీ జితేందర్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిది
రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి పోలీసు శాఖ కూడా సంయుక్తంగా కృషి చేస్తున్నదని రాష్ట్ర డీజీపీ జితేందర్ అన్నారు. అందుకు తగినంత మంది సిబ్బందిని త్వరలో కేటాయిస్తామని చెప్పారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో పోలీసు, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి శాఖ, సినిమా రంగాలకు చెందిన అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడారు. ”పర్యాటకాభివృద్ధికి ఆ శాఖ తీసుకునే కార్యాచరణకు పోలీసుశాఖ కూడా భుజం కలిపి నడుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలోని కీలకమైన పర్యాటక ప్రదేశాల్లో విదేశీటూరిస్టులకు అవసరమైన భద్రతను కూడా తమ శాఖ కల్పిస్తుంది. తొలి దశలో టూరిజం శాఖకు అవసరమైన 80 మంది పోలీసు సిబ్బందిని త్వరలో కేటాయిస్తాం. సెప్టెంబర్ 27న జరగనున్న వరల్డ్ టూరిజం డే సందర్భంగా టూరిస్ట్ పోలీసుల వ్యవస్థ సిద్ధం చేయాలని భావిస్తున్నాం. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలైన అనంతగిరి, సోమశిల, రామప్ప, యాదగిరిగుట్ట, పోచంపల్లి, నాగార్జునసాగర్, బుద్ధవనం, భద్రాచలం, అమ్రాబాద్ తదితర ప్రాంతాల్లో టూరిస్ట్ పోలీసులు పని చేస్తారు. షూటింగ్ పర్మిషన్లు, ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ కోసం పర్యాటక శాఖ విధి విధానాలను రూపొందించాలి” అని డీజీపీ సూచించారు. తెలంగాణలో టూరిజం అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టనున్నామని పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ అన్నారు. ”ఇక్కడి పర్యాటకులతో పాటు విదేశీ టూరిస్టులకు భద్రత కల్పించేందుకు టూరిస్ట్ పోలీసు అవసరం ఉన్నది. ఆధ్యాత్మిక, మెడికల్, వినోదాత్మక పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చేవారి భద్రత కోసం టూరిస్ట్ పోలీసులను కేటాయించాల్సి ఉన్నది” అని ఆయన అన్నారు. ఈ సమావేశంలో శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్, టూరిజం శాఖ ఎండీ వి.క్రాంతి, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ సి.హెచ్ ప్రియాంక, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పర్యాటకాభివృద్ధికి కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES