139 ప్రాంతాలు, 407పోలింగ్ కేంద్రాలు
క్రిటికల్ పోలింగ్ స్టేషన్‌లలో పారా మిలిటరీ ఫోర్స్
నవతెలంగాణ-సిటీబ్యూరో
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో జీహెచ్‌ఎంసీ, పోలీస్, ఎన్నికల అధికారులు ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లలో నిగమ్నమయ్యారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలు చేసేందుకు మానిటరింగ్ టీములను అదనంగా రంగంలోకి దించుతున్నారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్‌లలో పారా మిలిటరీ ఫోర్స్‌ను మోహరిస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 4,01,365 మంది కాగా, అందులో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు, ఇతరులు 25 మంది ఉన్నారు. 139 వివిధ ప్రాంతాల్లోని 407 పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ యావరేజ్‌గా 986 ఓటర్లు ఉండే విధంగా సౌకర్యాలు కల్పించారు. ఉప ఎన్నిక పోలింగ్ కోసం 600 ప్రిసైడింగ్ అధికారులు, 600 సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 1200 మంది ఓపీఓలు పోలింగ్ విధుల్లో ఉంటారు.
బరిలో 59మంది
ఉప ఎన్నికలో బరిలో నిలిచే 58 మంది అభ్యర్థులు ఫైనల్ కాగా, ‘నోటా’తో కలిపి మొత్తం 59 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈవీఎం ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు 4 బ్యాలెట్ యూనిట్లను ఉపయోగిస్తున్నారు. ఓటింగ్ కంపార్ట్‌మెంట్ సాధారణ సైజు కంటే పెద్దగా ఉండనుంది. ఓటర్ ఇన్‌ఫర్మేషన్ స్లిప్పులు ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తింపు కార్డుగా అనుమతించరు. అవి ఓటర్ల సౌలభ్యం, సమాచారం కోసం మాత్రమే ఉపయోగించుకోవాలి. ఎన్నికలకు సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తే బాధ్యులపై చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి హెచ్చరించారు.
మహిళల కోసం ప్రత్యేక లైన్
నవంబర్ 11న జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఓటర్ల సౌకర్యార్థం కేంద్ర ఎన్నికల సంఘం పలు నూతన విధానాలు అమలు చేస్తోంది. ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలా.. పోటీలో ఉన్న అభ్యర్థులను సరిగ్గా గుర్తించేందుకు వీలుగా బ్యాలెట్ యూనిట్లలో ఉంచే పేపర్‌లో అభ్యర్థుల ఫొటోలను కలర్‌లో ముద్రించనున్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ ఓటర్ అసిస్టెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ సమయంలో మహిళల కోసం ప్రత్యేక లైన్లు ఉంటాయి. వికలాంగ ఓటర్ల కోసం రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఓటరు జాబితాలో పేరుండి, ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు) కాకుండా 12 ప్రత్యామ్నాయ ఫొటో ఐడీలలో దేన్నైనా ఒకటి పోలింగ్ సిబ్బందికి చూపి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
12 ప్రత్యామ్నాయ ఫొటో ఐడీలు
ఆధార్, ఉపాధిహామీ జాబ్ కార్డు, బ్యాంక్, తపాల కార్యాలయం జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్ బుక్, కేంద్ర కార్మికశాఖ జారీ చేసిన ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు లేదా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్‌ఎఐ) కింద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఇండియా జారీ చేసిన స్మార్ట్ కార్డు, భారతీయ పాస్ పోర్ట్, ఫొటోతో కూడిన పెన్షన్ పత్రాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్‌యూలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజేబుల్ గుర్తింపు కార్డు (యూడీఐడీ)లుంటే ఓటు వేయొచ్చునని జీహెచ్‌ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వి.కర్ణన్ తెలిపారు.



