చేనేత సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా.. : ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మెన్ అనిల్ కుమార్
‘చేనేతకు టెండర్ గండం-ప్రభుత్వ నిరంకుశ నిర్ణయం’పై రౌండ్‌టేబుల్ సమావేశం
నవతెలంగాణ – ముషీరాబాద్
చేనేతకు నూతన టెండర్ విధానాన్ని రద్దు చేయించి పాత టెండర్ విధానాన్ని అమలు చేయించేందుకు తమవంతు కృషి చేస్తామని ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మెన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ అన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం చేనేత వర్గాల చైతన్య వేదిక, బీసీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో ‘చేనేతకు టెండర్ గండం- ప్రభుత్వ నిరంకుశ నిర్ణయంపై ఉద్యమ కార్యాచరణ’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేంద్రంలో తమ ప్రభుత్వం వస్తే 5 శాతం జీఎస్టీని రద్దు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రికి చేనేత వర్గాల పట్ల మంచి అభిప్రాయం ఉందని, ఆయనకు అన్ని సమస్యలు వివరించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడ్డాక చేనేత సామాజిక తరగతికి చెందిన ఒక్కరు కూడా మంత్రి కాలేదని తెలిపారు.
పోరాటం ద్వారానే హక్కులను సాధించుకోవాలని సూచించారు. బీసీ మేధావుల ఫోరం చైర్మెన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు మాట్లాడుతూ.. చేనేత రంగం అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించడానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదని విమర్శించారు. చేనేత రంగానికి రావాల్సిన నిధులను సాధించుకోవడానికి పెద్దఎత్తున ఉద్యమాలు అవసరమన్నారు. సభకు అధ్యక్షత వహించిన చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చిక్కా దేవదాసు మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాల వల్ల చేనేత సహకార రంగాలు 70 శాతం వరకు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కళను పరిరక్షించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మెన్ బాలగౌని బాలరాజ్ గౌడ్, కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, బైరు శేఖర్, అంబాల నారాయణ గౌడ్, ఆప్ కో మాజీ చైర్మెన్ కర్ణాటి వెంకటేష్, ఎయిర్టెల్ రాజు, గుజ్జ సత్యం, కూరపాటి రమేష్, ఎర్రమల్ల వెంకన్న, అవ్వారి భాస్కర్, సరస్వతి, లక్ష్మీ నరసయ్య, వనం శాంతి కుమార్, గట్టు వీరన్న, మనోహర్, బిక్షపతి తదితరులు మాట్లాడారు.
చేనేతకు పాత టెండర్ అమలు చేసేలా కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



