– వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి
– ఎర్రబెల్లిలో బత్తాయి తోటల పరిశీలన
నవతెలంగాణ -నిడమనూరు
బత్తాయి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మెన్ ముదిరెడ్డి కోదండరెడ్డి చెప్పారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలోని గుంటుపల్లి, ఎర్రబెల్లి గ్రామాల్లో సాగు చేస్తున్న బత్తాయి తోటలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బత్తాయి రైతులు మన్నెం వెంకన్న తాము ఎదుర్కొంటున్న సమస్యలను చైర్మెన్ దృష్టికి తీసుకొచ్చారు. ఆంధ్ర ప్రాంతం నుంచి మొక్కలను కొనుగోలు చేసి.. అనేక జాగ్రత్తలు తీసుకొని పంట సాగు చేస్తున్నామని అన్నారు. బత్తాయి రైతులకు హార్టికల్చర్ నుంచి ఎలాంటి మద్దదూ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి బత్తాయి పంటను సాగుచేస్తే.. దళారులు సిండికేట్‌గా మారి తగినంత ధర ఇవ్వడం లేదని తెలిపారు. మొక్కలు పెరిగినప్పటికీ సరిగా పూత, దిగుబడి లేక నష్టపోతున్నామని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం కోదండరెడ్డి మాట్లాడుతూ.. సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రైతులకు న్యాయం చేసేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం బత్తాయి రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. రైతులు బత్తాయి పంటను నిల్వ ఉంచుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అధిక ఆదాయాన్ని పొందొచ్చని చెప్పారు. బత్తాయి రైతుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందజే స్తామన్నారు. ఈ పర్యటనలో బత్తాయి రైతు కమిటీ సభ్యులు సురుగురు శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ జంగాల కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు యడవల్లి వల్లబ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ అంకతి సత్యం, నూకల వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింగ్ విజరు కుమార్, ఉద్యానవన శాఖ అధికారులు రిషిత ఉన్నారు.