ఇజ్రాయిల్ రెండేండ్లుగా జరిపిన యుద్ధోన్మాద చర్యలతో 69 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. వేలాది మంది అదృశ్యమయ్యారు. ఇండ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. మరెందరో నిరాశ్రయులయ్యారు. ఎంతో మంది శిథిలాల కింద చిక్కుకుపోయిన దృశ్యాలు కనిపించాయి. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. నవంబర్ 29న ‘పాలస్తీనా ప్రజలతో అంతర్జాతీయ సంఘీభావ దినం’ సందర్భంగా ఆ దేశం తన ఉనికికై దశాబ్దాల పాటు సాగిస్తున్న పోరాటం గురించి…
ఇజ్రాయిల్ యుద్ధోన్మాద చర్యలతో పాలస్తీనా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రాజ్యహోదా కోసం ఎనిమిది దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది. ఇప్పటికీ పలు దేశాలు గుర్తించినా.. అమెరికా, ఇజ్రాయిల్ చర్యలు మాత్రం ఆటంకంగా మారుతున్నాయి. ఇక కొన్ని రోజుల కిందట అమెరికా.. గాజా శాంతి ప్రణాళిక తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో ఆమోదింపజేసుకున్నది. అనేక నాటకీయ పరిణామాల నడుమ ఈ ముసాయిదా తీర్మానానికి రష్యా, చైనా మినహా మిగిలిన దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. అయితే యూఎస్ తీసుకొచ్చిన ఈ తీర్మానం.. పాలస్తీనా హక్కులను పూర్తిగా విస్మరించి ‘పీస్ కౌన్సిల్’ అనే కొత్త వ్యవస్థను తీసుకొస్తుంది. ఇది పాలనలో పాలస్తీనియన్లను పూర్తిగా విస్మరిస్తుంది. యూఎన్ పాత్రను పరిమితం చేస్తుంది. పాలస్తీనాపై ఒక విధమైన ట్రస్టీషిప్ వంటి పాలన అమలవుతుంది. గాజా పునర్నిర్మాణం, సహాయం ఇలా అన్నీ అమెరికా కోరిన విధంగానే జరుగుతాయి. వెస్ట్‌బ్యాంక్, గాజా మధ్య ఉన్న విభజనను ఇంకా పెంచుతుంది. అంటే రెండు ప్రాంతాలను మరింతగా వేరు చేస్తుంది. మొత్తానికి ఈ తీర్మానం ద్వారా అన్నీ తాను కోరుకున్న విధంగానే జరగాలన్న కాంక్షను అమెరికా నెరవేర్చుకున్నది.
వాస్తవానికి గాజా పరిపాలన పూర్తిగా పాలస్తీనియులదే కావాలి. గాజాలో ఇతర ఏ అంతర్జాతీయ శక్తి ప్రవేశించినా.. అది యూఎన్ స్పష్టమైన ఆదేశాల ప్రకారం పని చేయాలి. పౌరులు, భద్రతా విభజనలను కాపాడటం, సాయం అందించే మార్గాలను సురక్షితంగా ఉంచాలి. అయితే ఇజ్రాయిల్ ఆక్రమణ దళాలు, యూఎస్ ప్రాయోజిత శక్తులు ఉండటాన్ని బట్టి చూస్తే ఇవేవి జరగవని స్పష్టంగా అర్థమవుతున్నది.

గాజాలో కాల్పుల విరమణ.. ఇజ్రాయిల్ ఉల్లంఘనలు
గాజాలో అక్టోబర్‌లో కాల్పుల విరమణ ప్రారంభమైంది. ఇజ్రాయిల్ బాంబుదాడులు, యుద్ధోన్మాద చర్యలతో ఎన్నో ఏండ్లుగా బాధపడుతూ వస్తోన్న గాజా ప్రజలకు కొంత వరకు ఉపశమనం లభించినట్టయ్యింది. అయితే ఇజ్రాయిల్ రెండుండ్లుగా జరిపిన యుద్ధోన్మాద చర్యలతో 69వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. వేలాది మంది అదృశ్యమయ్యారు. ఇండ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. మరెందరో నిరాశ్రయులయ్యారు. ఎంతో మంది శిథిలాల కింద చిక్కుకుపోయిన దృశ్యాలు కనిపించాయి. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. హమాస్ కొంత మంది ఇజ్రాయిలీ బందీలను, ఇజ్రాయిల్ కూడా పాలస్తీనా ఖైదీలను విడుదల చేశాయి. మార్చి నుంచి ఇజ్రాయిల్ విధించిన నిర్బంధాన్ని కొంత సడలించడంతో తీవ్ర ఆకలి, కరువు వంటి పరిస్థితులకు గురైన గాజాలో ఇప్పుడు కొంతమేర ఆహారం, ఇంధనం, ఇతర అత్యవసర వస్తువులు ప్రవేశిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ సెప్టెంబర్ 29న ట్రంప్ ప్రకటించిన 20-పాయింట్ల శాంతి ప్రణాళికలోని మొదటి దశగా అంతా భావిస్తున్నారు. అయితే ఇజ్రాయిల్, హమాస్‌లు కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ.. ఇజ్రాయిల్ ఈ ఒప్పందానికి పలుమార్లు తూట్లు పొడుస్తూ దాడులకు దిగింది.
విధ్వంసాన్ని వారి లాభం కోసం
అమెరికా మధ్యవర్తిత్వంతో వచ్చిన 20-పాయింట్ల శాంతి ప్రణాళిక గాజాను పునర్నిర్మించడానికి, పునర్‌వ్యవస్థీకరించడానికి ఒక సమగ్ర బ్లూప్రింట్‌గా వివరిస్తున్నది. అయితే ఇది పాలస్తీనియులపై కఠినమైన షరతులను పెట్టింది. దీని ప్రకారం హమాస్ పూర్తిగా నిరాయుధీకరణ జరపాలి. హమాస్‌ను శాశ్వతంగా పాలన నుంచి తప్పించాలి. అలాగే గాజాలో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ (ఐఎస్‌ఎఫ్) ను మోహరింపజేసి నిరాయుధీకరణను అమలు చేస్తారు. ఇది పూర్తయ్యే వరకు ఇజ్రాయిల్ గాజా భౌగోళిక సరిహద్దుల లోపలే తన ప్రస్తుత ఉనికిని కొనసాగించడానికి అనుమతి ఉంటుంది. ఈ ప్రణాళిక అన్ని న్యాయబద్ధమైన పాలస్తీనా రాజకీయ వ్యవస్థలను పక్కనబెడుతూ.. అంతర్జాతీయ పర్యవేక్షణలో ఒక టెక్నోక్రాటిక్ పరిపాలనను ప్రతిపాదిస్తోంది. ప్రతిపాదిత ‘బోర్డ్ ఆఫ్ పీస్’ అనే సంస్థకు డోనాల్డ్ ట్రంప్, టోనీ బ్లేర్‌లు నాయకత్వం వహిస్తూ గాజా పునర్నిర్మాణాన్ని పర్యవేక్షిస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇరాక్ యుద్ధానికి ఈ ఇద్దరూ బలమైన మద్దతుదారులు కావటం. ప్రతిపాదించిన ‘రీడెవలప్‌మెంట్’ ప్రాజెక్టులు, ‘స్పెషల్ ఎకనామిక్ జోన్’లు అనేవి గాజాను తిరిగి నిర్మించడానికి కాకుండా.. ఇక్కడి విధ్వంసాన్ని తమ లాభం కోసం ఉపయోగించుకోవడానికే రూపొందించినట్టుగా కనిపిస్తున్నాయని విమర్శలూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ ప్రణాళిక పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయిల్ ఆక్రమణ ఎప్పుడు ముగుస్తుందో స్పష్టంగా చెప్పలేదు.
అమెరికా-ఇజ్రాయిల్ ఆధిపత్య ప్రాజెక్టు
ఇక టర్కీ, యూఏఈ, ఈజిప్ట్, పాకిస్తాన్ వంటి దేశాలను ఈ ప్రణాళికలో చేర్చటం ద్వారా దీనికి చట్టబద్ధత ఉన్నట్టు కనిపించేలా చేస్తున్నా.. వాస్తవానికి ఇది అమెరికా-ఇజ్రాయిల్ ఆధిపత్య ప్రాజెక్టు. అయితే ఈ దేశాలు ఇందులో భాగం కావడానికి కారణం.. అమెరికాతో వారి భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకే. ఇక ఈజిప్ట్, సౌదీ అరేబియా, యూఏఈ, జోర్డాన్ వంటి ప్రధాన అరబ్ దేశాలు చాలా కాలంగా పాలస్తీనాకు మద్దతుగా ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో అమెరికా, ఇజ్రాయిల్ వైపు అవి మొగ్గుచూపడం పాలస్తీనా ప్రజలకు శాపంగా పరిణమించింది. పాలస్తీనాలో ఇజ్రాయిల్ చేసిన మానవ హక్కుల ఉల్లంఘనలు, ఐక్యరాజ్యసమితి ఒప్పందాలు, ఒప్పందాలకు జరిగిన తూట్లు, చట్టాల నిర్లక్ష్యంపై చారిత్రక అవగాహన అవసరం. ఇది ఇజ్రాయిల్‌ను ఎత్తిచూపడానికి, ప్రతిఘటనను నిర్మించడానికి అవసరం. పాలస్తీనియుల స్వాతంత్య్ర పోరాటాన్ని, వారు అనుభవిస్తున్న కష్టాలను అర్థం చేసుకోవాలంటే.. పాలస్తీనా చరిత్ర, ప్రస్తుత దాని ఆక్రమణ ఎలా జరిగింది, దాని వెనుక ఉన్న సామ్రాజ్యవాదం (ఇంపీరియలిజం) పాత్రను తెలుసుకోవాలి.

సంక్షిప్త చరిత్ర
జెరూసలేం, దాని పరిసర ప్రాంతాలను క్రైస్తవులు, ముస్లింలు, యూదులు పవిత్రంగా భావిస్తారు. కారణం.. తమ తమ మతాల పుట్టుక ఈ నేలతో సంబంధం ఉన్నదని వారి విశ్వసిస్తారు. ఈ మతాలు ఎలా పుట్టాయి, ఎలా విస్తరించాయి అనే పురాణకథలు ఈ ప్రాంతంలోని భూములు, పవిత్ర స్థలాలపై ప్రత్యేక హక్కులను క్లెయిమ్ చేసుకోవడానికి తరచూ ఉపయోగిస్తారు. ఇజ్రాయిల్ భూగోళ శాస్త్రవేత్త ఒరెన్ యిఫ్టాచెల్ ”ఇజ్రాయిల్ ఏర్పడిన ప్రారంభ దశలోనే భూమిని పునర్‌వ్యవస్థీకరించడం అనేది ఒక సమగ్ర, విస్తరణవాద జుడైజేషన్ (అరబ్ లక్షణాల తొలగింపు) కార్యక్రమం చుట్టూనే సాగింది. ఈ జుడైజేషన్ కార్యక్రమం భూమి పూర్తిగా యూదులదే అనే భావనపై ఆధారపడింది. ఈ భావన ‘సయానిజం’ ఎదుగుదల నాటి నుంచే పెంపొందించబడింది” అంటారు. ఇకపురాణాల ఆధారంగా చరిత్రను తిరిగి రాసి, పాలస్తీనా భూభాగం.. ప్రత్యేకించి జెరూసలేంపై యూదులకు మాత్రమే హక్కు (ఓనర్‌షిప్) ఉంది అని చెప్పే ప్రయత్నానికి పురాతత్వ సాక్ష్యాలు సహకరించటం లేదు. అంతేకాదు ఈ పురాతత్వ నివేదికలను అందిస్తున్న వారు కూడా ప్రముఖ ఇజ్రాయిలీ పురావస్తు శాస్త్రవేత్తలే కావటం గమనార్హం.
స్పష్టమైన ఆధారాలున్నా…
టెల్ అవీవ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ సి.జీవ్ హెరోగ్ గత శతాబ్దం మొత్తం నిర్వహించిన పురాతత్వ పరిశోధనలను సమీక్షించి ”ఇజ్రాయిల్ భూమిలో చేసిన తవ్వకాల ద్వారా పురావస్తు శాస్త్రవేత్తలు తెలుసుకున్నది ఏమిటంటే : ఇజ్రాయిలీలు ఎప్పుడూ ఈజిప్టులో నివసించలేదు, వారు ఎడారిలో తిరుగుతూ గడపలేదు, వారు యుద్ధం ద్వారా ఈ భూమిని జయించలేదు, దానిని ఇజ్రాయిల్ పన్నెండు తెగలకు అందజేయలేదు. ఇంకా అంతకంటే కఠినంగా అంగీకరించాల్సిన విషయం ఏమిటంటే.. బైబిల్‌లో ప్రాంతీయ శక్తిగా వర్ణించబడిన దావీదు, సోలమన్‌ల ఏకీకృత రాజ్యం… చిన్న తెగల రాజ్యం మాత్రమే” అని రాశారు. ఇంత స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ ఇజ్రాయిల్ ఈ వాస్తవాలను స్వీకరించడం లేదని ఆయన అంటారు.
ఒక స్వదేశం కావాలనే డిమాండ్
తాజా చారిత్రక వివరాలు చెబుతున్నది ఏమిటంటే.. మొదటి యూదుల పునరావాసం (సెటిల్‌మెంట్) 19వ శతాబ్దం రెండో అర్థభాగంలోనే స్థాపించబడింది. ఆ సమయంలో యూదులు మొత్తం జనాభాలో మూడు శాతమే ఉండగా, పాలస్తీనా అరబ్‌లు 97 శాతం ఉండేవారు. ఈ భూభాగాల్లో యూదులకు ఒక స్వదేశం కావాలనే డిమాండ్ ఇదే కాలంలో బలంగా మొదలైంది. ప్రభావశీల యూదులు అప్పటి వలసరాజ్యమైన బ్రిటన్‌ను ప్రభావితం చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో ఈ ప్రాంతంలోని సింహభాగం భూమిపై అధికారం కలిగిన ఒట్టోమన్ సామ్రాజ్యానికి ఎదురుతిరిగారు. ఇక మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, ఒట్టోమన్‌లు వ్యతిరేక పక్షాల్లో నిలిచాయి. చివరకు ఒట్టోమన్ సామ్రాజ్యం ఈ యుద్ధంలో పరాజయం చెందింది.

సైక్స్-పికో ఒప్పందం-మొదటి ప్రపంచ యుద్ధం
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, బ్రిటన్, ఫ్రాన్స్ ప్రసిద్ధమైన సైక్స్-పికో ఒప్పందం (రాజకీయంగా ‘ఆసియా మైనర్ ఒప్పందం’ అని కూడా పిలవబడేది) కుదిరింది. ఈ రహస్య ఒప్పందం పశ్చిమ ఆసియాలోని ప్రభావ, నియంత్రణ ప్రాంతాలను నిర్వచించింది. ఒట్టోమన్ సామ్రాజ్యంలోని అరేబియన్ ద్వీపాన్ని తప్పించి మిగతా అరబ్ ప్రాంతాలను భవిష్యత్తులో బ్రిటన్, ఫ్రాన్స్ ప్రభావ లేదా నియంత్రణ ప్రాంతాలుగా విభజించింది. రష్యా సామాజ్య్ర ప్రభుత్వం కూడా సైక్స్-పికో ఒప్పందంలో భాగంగా ఉండేది. కానీ 1917లో జరిగిన గ్రేట్ అక్టోబర్ సోషలిస్ట్ విప్లవం విజయవంతమైన తర్వాత, లెనిన్ నేతృత్వంలోని బోల్ష్‌విక్ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని, వలసవాద లక్ష్యాలను బయటపెట్టింది. ఇది ఆ సమయంలో వచ్చిన ప్రమాదకర బల్ఫోర్ ప్రకటన కొద్ది వారాల తర్వాత జరిగింది. ”హిజ్ మాజెస్టీ ప్రభుత్వం పాలస్తీనాలో యూదుల జాతీయ స్వదేశం ఏర్పాటుకు మద్దతిస్తుంది, దీని సాకారం కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తుంది…” అని ఆ ప్రకటనలో ఉన్నది.
ఈ ప్రకటన వెనుక ఉన్న ఉద్దేశాలను బల్ఫోర్ స్వయంగా వివరించారు. ”సయోనిస్టు ఆశయాలకు అనుకూలంగా ఒక ప్రకటన వెలువడితే.. రష్యా, అమెరికాలో అత్యంత ఉపయోగకరమైన ప్రచారాన్ని బ్రిటన్ కొనసాగించగలదు” అని చెప్పారు. యుద్ధం గెలవాలంటే ఈ రెండు దేశాలు సహాయకులుగా అవసరమయ్యే స్థితిలో ఉన్నాయి. అప్పటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ లాయిడ్ జార్జ్ ఇంకా స్పష్టంగా చెప్పారు. ”ఈ సంక్లిష్ట పరిస్థితిలో యూదుల అనుకూలత లేదా ప్రతికూలత మిత్రదేశాల (అలైడ్) లక్ష్యాలపై పెద్ద ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా యూదుల అనుకూలత అమెరికా యూదుల మద్దతును ధృవీకరిస్తుంది. ఇక జర్మనీకి తూర్పు సరిహద్దులలో తన సైనిక బాధ్యతలను తగ్గించడం, ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చటం కష్టతరమవుతుంది” అని వివరించారు. దీని ద్వారా అర్థమయ్యేదేమిటంటే.. ఈ భూభాగాల విభజనను ఆధిపత్య వలస, సామ్రాజ్యపర ప్రయోజనాలు మాత్రమే నడిపించాయి. అక్కడ నివసించే ప్రజల అభిప్రాయాలను, కష్టాలను పరిగణలోకి తీసుకోలేదు. ఈరోజు పాలస్తీనియులపై జరుగుతున్న జనసంహారం అనేది వందల ఏండ్ల కిందటే విత్తిన విత్తనాల ఫలితం.
రెండు విరుద్ధ దేశాలుగా
1930లలో నాజీలు పెరగడం, యూదులపై వ్యతిరేక పరపీడనాలు అధికం కావడంతో.. యూరోప్ నుంచి యూదులు పెద్ద ఎత్తున వలసవెళ్లారు. వారిలో కొంత మంది పాలస్తీనా భూభాగాలకు చేరి అక్కడ పునరావాసం మొదలు పెట్టారు. స్థానిక అరబ్బులు వారి భూభాగంలో వలసదారుల సంఖ్యను పరిమితం చేయాలని కోరుకున్నా అది సాధ్యం కాలేదు. హిట్లర్ నాజీ దళాల పరాజయంతో ముగిసిన రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వారి నేరాలపై, ముఖ్యంగా యూదులపై జరిగినవాటిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత వలసవాద శక్తులు బలహీనపడ్డాయి. అరబ్ భూభాగాల మీద నియంత్రణను కలిగిన బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. సంపదలతో నిండిన ఈ భూభాగాలను స్వతంత్ర, సార్వభౌమ దేశాలుగా ఉండకూడదని భావించిన ఈ దేశాలు.. ఆ సమయంలో కొత్తగా ఏర్పడిన ఐక్యరాజ్యసమితిని ఉపయోగించి పాలస్తీనా భూమిని అన్యాయంగా రెండు విరుద్ధ దేశాలుగా విభజించారు. అవే.. ఇజ్రాయిల్, పాలస్తీనా.
స్వదేశం నుంచి బహిష్కరణ
1947 నవంబర్ 29న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ పాలస్తీనాను అరబ్ స్టేట్, యూదు ప్రాంతం, జెరూసలేం ప్రత్యేక నగరంగా మూడు భాగాలుగా విభజించే తీర్మానం 181(2)ను ఆమోదించింది. పాలస్తీనీయులు ఈ ప్రతిపాదనను నిరసించారు. డేవిడ్ బెన్-గురియన్ నేతృత్వంలోని యూదులు మాత్రం ఈ నిర్ణయాన్ని సంతోషంగా స్వీకరించారు. ఎందుకంటే వారికి 58 శాతం భూమి కేటాయింపు జరిగింది. దీంతో మే 15, 1948న బెన్-గురియన్ ఇజ్రాయిల్ స్టేట్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఇజ్రాయిల్ ఏర్పాటుతో పాలస్తీనియులను వారి స్వదేశం నుంచి బహిష్కరించటం ప్రారంభమైంది. లక్షల సంఖ్యలో ప్రజలు శరణార్థులుగా మారారు. సుమారు 7,50,000 మంది (పాలస్తీనా జనాభాలో దాదాపు సగం) గాజా, వెస్ట్‌బ్యాంక్ వంటి కేంద్రిత ప్రాంతాలకు తరలించబడ్డారు. ఇజ్రాయిల్ చర్యలు అంతటితో ఆగలేదు.. యూఎన్ కేటాయించిన పాలస్తీనీయుల భూభాగాలను కూడా ఆక్రమిస్తోంది. పాలస్తీనియులను ఈ ప్రాంతం నుంచి దూరం చేయటం ద్వారా వారికి చెందిన మంచి మంచి భూములు, నీరు, వనరులను దోచుకోవటం దీని ప్రధాన లక్ష్యం.
నియంత్రణను స్థిరపర్చడానికి
ఇజ్రాయిల్ ఏర్పడిన వెంటనే పాలస్తీనాకు అనుకూలంగా ఉన్న ఈజిప్ట్, సిరియా, లెబనాన్, జోర్డాన్‌పై దాడి చేసింది. కానీ ఓటమిపాలైంది. నాడు మొదలైన ఇజ్రాయిల్ విస్తరణ నేటికీ కొనసాగుతోంది. ప్రారంభం నుంచీ ఈ ప్రాంతంలో ఇజ్రాయిల్ ఉనికిని సామ్రాజ్యవాద శక్తులు పశ్చిమాసియాపై తమ నియంత్రణను స్థిరపర్చడానికి ఉపయోగించాయి. 1956లో నాజర్ ఈజిప్ట్‌లో సుయాజ్ కాలువను జాతీయీకరించినప్పుడు.. బ్రిటన్, ఫ్రాన్స్ ఇజ్రాయిల్‌తో కలిసి సినారు ద్వీపంపై సైనిక దాడిని ప్రారంభించాయి. తర్వాత వారు సినారు నుంచి వెనక్కి తగ్గాల్సి వచ్చినప్పటికీ.. ఈ ప్రాంతంలో సామ్రాజ్యవాదం అనుసరించిన మార్గాన్ని ముందే చూపించింది. ఇక 1964లో పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్‌ఓ) స్థాపితమైంది. దీని ఉద్దేశ్యం.. ఇజ్రాయిల్ ఆక్రమణ నుంచి పాలస్తీనా భూభాగాలను యాసర్ అరాఫాత్ నేతృత్వంలో విముక్తం చేయడం.
ఇప్పటికీ ఆధిపత్యం
1967లో ఇజ్రాయిల్-పాలస్తీనా సంక్షోభ చరిత్రలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. అప్పట్లో అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ పొరుగుదేశాలపై మరో సైనిక దాడిని ప్రారంభి.. ఈజిప్ట్ నుంచి సినారుని, సిరియా నుంచి గోలాన్ హైట్స్‌ను, జోర్డాన్ నుంచి వెస్ట్ బ్యాంక్, పురాతన జెరూసలేంను ఆక్రమించింది. ఆ సమయంలో అమెరికా.. నాజర్ నేతృత్వంలోని ఈజిప్ట్, ఇజ్రాయిల్ మధ్య తుది శాంతి ఒప్పందాన్ని మధ్యస్థంగా ఏర్పర్చింది. సినారుని తిరిగి ఈజిప్ట్‌కు ఇచ్చేలా చేసింది. అయితే ఇజ్రాయిల్ తన ఆక్రమణలో పొందిన మిగతా భూభాగాలన్నింటిపై ఇప్పటికీ ఆధిపత్యం చలాయిస్తున్నది. 1980లలో యినోస్ ప్లాన్ అనే ఒక పథకం బయటకు వచ్చింది. ఈ పథకం ఇజ్రాయిల్ ఎలా ప్రాంతీయ అత్యంత శక్తివంతమైన దేశంగా మారవచ్చో సూచించింది. అలాగే ఇరాక్ వంటి బలమైన పొరుగు అరబ్ దేశాలను అస్థిరపర్చి, బలహీనం చేసేందుకు తీసుకోవాల్సిన వ్యూహాలను కూడా వివరించింది. అయితే ఈ సమయంలో ఇజ్రాయిల్ పాలస్తీనా భూభాగంలోని మిగిలిన ప్రాంతాలను క్రమంగా ఆక్రమించడం ప్రారంభించింది. ఇందుకు యూదుల నివాసాలను పెంచింది. ఇజ్రాయిల్ ఈ చర్యలతో కోపంలో ఉన్న పీఎల్‌ఓ.. తన మొదటి ఇంటిఫాడా (జనతా తిరుగుబాటు)ను ప్రారంభించింది.
అనేక చర్చలు
సోవియట్ యూనియన్ పతనం తర్వాత పీఎల్‌ఓ సాయుధ పోరాటాన్ని వదలి 1990ల ప్రారంభంలో ఇజ్రాయిల్‌తో శాంతి చర్చలకు వెళ్లింది. ఈ చర్చలు చివరకు 1993లో ఓస్లో శాంతి ఒప్పందం వరకు చేరుకున్నాయి. 1993-1999 మధ్య ఓస్లో నుంచి క్యాంప్ డేవిడ్ వరకు అనేక చర్చలు జరిగాయి. ఈ చర్చల ఆశయం.. రెండు పక్షాలు పరస్పర నమ్మకాన్ని పెంచుకొని, కఠినమైన ప్రధాన సమస్యలను తరువాత పరిష్కరించుకోవడం. కానీ ఇజ్రాయిల్ మాత్రం ఈ ఒప్పందాలు, నిబంధనలను ఉల్లంఘించింది. పాలస్తీనీయుల హక్కులను హరించింది.
21వ శతాబ్దం ప్రారంభంతో ఇజ్రాయిల్ దాడులు మరింతగా పెరిగాయి. ఈ కాలంలో ఒక అనైతిక, అక్రమమైన గోడను నిర్మించింది. ఈ గోడ వల్ల పాలస్తీనియన్లు తమ భూభాగంలో 12 శాతానికే పరిమితమయ్యారు. ఈ గోడ పొడవు 663 కిలోమీటర్లు. అంటే 1967 సరిహద్దు 320 కిలోమీటర్ల కంటే రెండింతలు ఎక్కువ. ఈ గోడ నిర్మాణంతో ఇజ్రాయిల్ వెస్ట్‌బ్యాంక్‌లో 60 శాతం భూమిని, అలాగే నీటి వనరులలో 60 శాతంను ఆక్రమించుకుంది. మిగిలిన 40 శాతం పాలస్తీనా భూమి చిన్న చిన్న విభాగాలుగా విడిపోగా.. పరస్పరం సంబంధం లేకుండా పోయింది. ఈ రోజుకీ ఇజ్రాయిల్ సైనిక చర్యల వల్ల మొత్తం పాలస్తీనియన్లలో సుమారు 70 శాతం మంది శరణార్థులుగా జీవిస్తున్నారు.
జైలులా మారిన గాజా
గాజా నేడు కేవలం 146 చదరపు కిలోమీటర్ల చిన్న భూభాగంగా మాత్రమే మిగిలిపోయింది. ఇంత చిన్న ప్రాంతంలో దాదాపు 15 లక్షల పాలస్తీనా ప్రజలు నివసిస్తున్నారు. మూడు వైపులా ఇజ్రాయిల్ చుట్టుముట్టి ఉండగా, మరోవైపు భూభాగం మెడిటరేనియన్ సముద్రం ఉన్నది. దక్షిణ దిశలో ఈజిప్ట్‌తో చిన్న సరిహద్దు తప్ప గాజా పూర్తిగా ఒక జైలు వంటి ప్రాంతంగా మారిపోయింది. ఎందుకంటే.. ఇజ్రాయిల్ అనుమతి లేకుండా గాజాలోకి ఏదీ ప్రవేశించదు, బయటకూ వెళ్లదు. 2006 పాలస్తీనా ఎన్నికల్లో హమాజ్ విజయం తర్వాత ఇజ్రాయిల్ గాజాపై ముట్టడి ఇంకా కఠినతరం చేసింది. ఈ విధానాలను ఇజ్రాయిల్ నిర్దయగా సమర్థించుకుంటూ వచ్చింది.
అంతర్జాతీయంగా కోరుతున్నా…
ఇక 1967 నుంచి ఆక్రమించిన అన్ని ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లాలనీ, పాలస్తీనా శరణార్థి సమస్యకు ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశం తీర్మానం 194 ప్రకారం న్యాయమైన పరిష్కారం కోసం పని చేయాలని అంతర్జాతీయ సమాజం పదేపదే కోరుతున్నా.. ఇజ్రాయిల్ వాటిని నిర్లక్ష్యం చేస్తూనే ఉంది. 1967 సరిహద్దుల ఆధారంగా తూర్పు జెరూసలెమ్ రాజధానిగా ఒక సార్వభౌమ స్వతంత్రమైన పాలస్తీనా దేశాన్ని ఏర్పర్చే ప్రతిపాదనను కూడా ఇజ్రాయిల్ అంగీకరించటం లేదు. ఇది వాస్తవంగా చారిత్రక పాలస్తీనా భూభాగంలో 22 శాతం మాత్రమే. అయితే దీనికి కూడా ఇజ్రాయిల్ ఒప్పుకోకుండా తన విస్తరణ విధానాలను కొనసాగిస్తున్నది. నేడు చారిత్రక పాలస్తీనా భూమిలో 88 శాతం తన ప్రత్యక్ష నియంత్రణలో ఉంచుకున్నది.
ఇజ్రాయిల్ నియంత్రణలోనే…
ఇజ్రాయిల్ నియంత్రణలో పాలస్తీనా పరిస్థితి చాలా తీవ్రమైంది. 1967 సరిహద్దు రెండు వైపులా నియంత్రణలో ఉన్న పాలస్తీనియన్లు చిన్న చిన్న ప్రాంతాలకు పరిమితమయ్యారు. వారు మౌలిక మానవ హక్కులు, పౌర హక్కులకు నోచుకోవటం లేదు. వారి ప్రయాణం కూడా పాస్‌బుక్స్ ద్వారా కఠినంగా నియంత్రించబడుతోంది. 1967 నుంచి పాలస్తీనియుల నీటి వనరులన్నీ దాదాపు పూర్తిగా ఇజ్రాయిల్ నియంత్రణలోనే ఉన్నాయి. అందులోబాటులో ఉన్న ఉమ్మడి నీటి వనరులలో 89 శాతం ఇజ్రాయిల్ తీసుకుంటోంది. ఇక గాజాలో పరిస్థితి మరింత కఠినం. ఇక్కడ నివసించే ప్రజల్లో 40 శాతం మందికి సరైన తాగునీరు అందడం లేదు. ఈ కారణంగా 60 శాతం వ్యాధులు కలుషిత నీటి ద్వారానే వస్తున్నాయి. ఇజ్రాయిల్ విధించిన ఆంక్షలతో పాలస్తీనియులు తమ వ్యవసాయ వనరులను పూర్తిగా వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోయారు. 1990ల వరకు పాలస్తీనా జీడీపీలో వ్యవసాయం 30 శాతానికి పైగా ఉండేది. కానీ నిరంతర ఆంక్షల కారణంగా అది ఇప్పుడు 10 శాతానికి పడిపోయింది. అలాగే పాలస్తీనాలో సొంత ఇంధన వనరుల అభివృద్ధిని ఇజ్రాయిల్ నిరోధిస్తోంది. దీంతో పాలస్తీనియులు వారు వినియోగించే విద్యుత్‌లో 93 శాతం కంటే ఎక్కువ ఇజ్రాయిల్ సరఫరా మీదే ఆధారపడాల్సిన పరిస్థితి. దీంతో పాలస్తీనా ప్రజలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విద్యుత్ ధరలు చెల్లించాల్సి వస్తోంది.
నిధులు పూర్తిగా ఆపేసింది
2001 నుంచి ఇజ్రాయిల్.. గాజా పట్టణంలో సంక్రమణ వ్యాధుల కోసం అవసరమైన అనేక టీకాల అనుమతిని నిరాకరిస్తోంది. ఇవి తమకు బయోలాజికల్ ప్రమాదంగా ఇజ్రాయిల్ చెప్తోంది. అలాగే రేడియేషన్ థెరపీకి అవసరమైన పరికరాలను కూడా పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగించవచ్చని చెప్పి.. పాలస్తీనా నేషనల్ అథారిటీకి దిగుమతి అయ్యేలా అనమతించటం లేదు. 1994లో పీఎల్‌ఓ, ఇజ్రాయిల్ ప్రభుత్వాలు కలిసి ‘పారిస్ ప్రోటోకాల్’ అనే ఆర్థిక ఒప్పందంపై సంతకం చేశాయి. దీని ప్రకారం.. పాలస్తీనా దిగుమతులపై విధించే సుంకాలు, ఆదాయ పన్నులు, ఆరోగ్య బీమా చందాలు వంటి పన్నులను ఇజ్రాయిల్ సేకరించి ప్రతినెలా పీఎన్‌ఏకి పంపించాల్సి ఉంటుంది. కానీ 2006లో హమాస్ నాయకత్వంలోని పాలస్తీనా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత.. ఇజ్రాయిల్ ఈ నిధులను పంపడం పూర్తిగా ఆపేసింది. ఈ మొత్తం నెలకు సుమారు 65 మిలియన్ డాలర్లు కావటం గమనార్హం. ఇజ్రాయిల్ పాలస్తీనాకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే సరుకు రవాణాపై పూర్తి నియంత్రణ కలిగి ఉంది. అన్ని దిగుమతులు, ఎగుమతులు ఇజ్రాయిల్ భద్రతా తనిఖీలను తప్పనిసరిగా ఎదుర్కోవాలి. ఈ పరిస్థితి పాలస్తీనా వాణిజ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ప్రపంచబ్యాంకు ప్రకారం సెప్టెంబర్, 2000 నుంచి ఇజ్రాయిల్ విధించిన మూసివేతలు ఆర్థిక కార్యకలాపాల్లో భారీ తగ్గుదల, నిరుద్యోగం పెరుగుదల, పేదరికం పెరుగుదలకు నేరుగా కారణమయ్యాయి.
అబద్ధాలను బహిర్గతం చేయాలి
ఇలాంటి పేదరికం, నిర్బంధంలో ఉన్న ప్రజలపై ఇజ్రాయిల్ మళ్లీ సైనికదాడులు చేసింది. అమెరికా ఈ చర్యలకు పూర్తి మద్దతు ఇచ్చింది. 2023లో గాజాపై ఇజ్రాయిల్ దాడుల తర్వాత అమెరికా ఇచ్చే సైనిక సహాయం ఆరు బిలియన్ డాలర్ల నుంచి 23 బిలియన్ డాలర్లకు పెరిగింది. మానవత్వం, గౌరవం, స్వతంత్రతను విశ్వసించే మనమందరం.. ఐక్యరాజ్యసమితి చార్టర్, తీర్మానాలు ఉల్లంఘిస్తూ ఇజ్రాయిల్ ప్రచారం చేసే అబద్ధాలను బహిర్గతం చేయాల్సిన బాధ్యత ఉన్నది. ప్రజలకు నిజం తెలుసుకునే హక్కు ఉంది. వాస్తవాలను చెప్పాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనం పాలస్తీనాకు సంఘీభావంగా నిలబడగలం.
ఆర్.అరుణ్‌కుమార్
అనువాదం : ఎస్. గోవర్థన్



