వనపర్తి పట్టణంలో ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ -వనపర్తి / వనపర్తి రూరల్
నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థులను ఓటర్లు ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ కోరారు. సీపీఐ(ఎం) వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం లో భాగంగా.. శుక్రవారం 18వ వార్డు అభ్యర్థి గంధం మధన్, 21వ వార్డు అభ్యర్థి పుట్ట ఆంజనేయులు గెలుపు కోసం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కర్రెమ్మ గుడి దగ్గర జరిగిన సభలో జాన్‌వెస్లీ ప్రసంగించారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కులాల మధ్య.. మతాల మధ్య చిచ్చు పెట్టి కార్మికులు, కర్షకుల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు యత్నిస్తోందన్నారు.
కష్టజీవులందరూ ఐక్యంగా ఉద్యమిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. మీ వార్డులో సమస్యలు పరిష్కారం కావాలంటే పేద ప్రజల గురించి తెలిసిన కమ్యూనిస్టు నాయకులను గెలిపించే విధంగా కృషి చేయాలని కోరారు. 21వ వార్డు అభ్యర్థి పుట్ట ఆంజనేయులు, 18వ వార్డు అభ్యర్థి గంధం మదన్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జబ్బార్, డి.బాల్‌రెడ్డి, ఎం.రాజు, బీఆర్‌ఎస్ నాయకులు గంధం బాలపేరు, గంధం విజయ్, డాక్టర్ దానేలు, విజయ్, పరంజ్యోతి, మంద రాము, డి.తిరుపతయ్య, డి.వెంకటయ్య, సరస్వతి, నాయకులు వెంకట్‌రాములు, బాలయ్యనాయక్, మేకల ఆంజనేయులు, జీవెంకటయ్య, సాయిలీల, సీపీఐ(ఎం) సర్పంచులు కవిత, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.



