రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపు..యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎన్నికల ప్రచారం
నవతెలంగాణ-భూదాన్‌పోచంపల్లి
వ్యవసాయ కూలీలు, కార్మికులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం, మున్సిపల్ పట్టణాల అభివృద్ధి కోసం ప్రజల పక్షాన పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ కోరారు. యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ శనివారం ర్యాలీలు, రోడ్‌షోల్లో పాల్గొన్నారు. భూదాన్‌పోచంపల్లి 4వ వార్డు సీపీఐ(ఎం) అభ్యర్థి వడ్డేపల్లి యాదగిరిని గెలిపించాలని కోరుతూ నిర్వహించిన సభలో జాన్‌వెస్లీ ప్రసంగించారు. ఎర్రజెండా నిరంతరం ప్రజల హక్కుల కోసం, పాలకుల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతుందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తూ దేశ సంపదను దోచిపెడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. 4వ వార్డులో పోటీ చేస్తున్న వడ్డేపల్లి యాదగిరి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి. జహంగీర్ మాట్లాడుతూ.. పోచంపల్లి పట్టణంలో మురుగునీటి సమస్య పరిష్కారం కావాలన్నా, ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలు రావాలన్నా, అన్ని వార్డుల్లోనూ రోడ్లు, విద్యుత్, వీధిలైట్లు రావాలన్నా, అందరికీ ఇండ్లు, ఇండ్ల్ల స్థలాలు కావాలన్నా, కార్మికులకు సమగ్ర చట్టం కావాలన్నా ప్రజల పక్షాన నిరంతరం పోరాడేది ఒక సీపీఐ(ఎం) అని అన్నారు. అందుకు 4వ వార్డులో సీపీఐ(ఎం) అభ్యర్థి వడ్డేపల్లి యాదగిరిని గెలిపించాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కోట రామచంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, అభ్యర్థి వడ్డేపల్లి యాదగిరి, నాయకులు గడ్డం వెంకటేష్, గూడూరు అంజిరెడ్డి, బొమ్మలరామారం, ర్యాకల శ్రీశైలం, పోతరాజు జహంగీర్, మంచాల మధు, ప్రసాదం విష్ణు, గూడూరు బుచ్చిరెడ్డి, అందెల జ్యోతి, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, పట్టణ కార్యదర్శి దుబ్బాక జగన్ తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రాల్లో ప్రచారం
భువనగిరి మున్సిపాలిటీలో పోటీచేస్తున్న 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కొలుపుల వివేకానందను ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. భువనగిరి పట్టణంలో 6వ వార్డు హనుమాన్‌వాడ, జగ్గయ్యనగర్‌లో సీపీఐ(ఎం) అభ్యర్థి కొలుపుల వివేకానందను గెలిపించాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఆలేరు పట్టణంలోని 4వ వార్డు సీపీఐ(ఎం) అభ్యర్ధి మొరిగాడి భాగ్యలక్ష్మి గెలుపు కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం కాటమయ్య బజార్‌లో జరిగిన కార్నర్ మీటింగ్‌లో జాన్‌వెస్లీ మాట్లాడారు.
చౌటుప్పల్ మున్సిపాల్టీ 9వ వార్డు సీపీఐ(ఎం) అభ్యర్థి దండ అరుణకుమార్, 10వ వార్డు అభ్యర్థి గోశికసుమతి కరుణాకర్, 19వ వార్డు అభ్యర్థి బత్తుల శ్రీశైలం, 16వ వార్డు అభ్యర్థి బత్తుల జయమ్మ దాస్, 20వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి అత్తార్ పాషాకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, బూర్గు కృష్ణారెడ్డి, జెల్లెల పెంటయ్య, గుంటోజు శ్రీనివాసచారీ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు, చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి చింతల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.



