No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeఎడిట్ పేజిఎన్నికల కమిషన్‌ విశ్వాస సంక్షోభం

ఎన్నికల కమిషన్‌ విశ్వాస సంక్షోభం

- Advertisement -

ఇలా జరుగుతుందని చాలా కాలంగా అనుకుంటున్నదే. గత పక్షం రోజుల్లో వరుసగా సాగిన కల్లోల భరితమైన ఘటనలు ప్రజాస్వామ్యంపై పథకం ప్రకారం జరుగుతున్న తీవ్రదాడిని ముందుకు తెచ్చాయి. ఈదాడి అనేక స్థాయిల్లో జరుగుతున్నది. అట్టడుగున చూస్తే (ప్రజాస్వామ్యం పునాదుల పైన, ప్రాతినిధ్య ప్రభుత్వ వ్యవస్థ పైన) రాజ్యాంగ హక్కుగా వచ్చిన పౌరుల ఓటు హక్కుకే తీవ్ర ప్రమాదం. బీహార్‌లో ప్రత్యేక సమగ్ర పరిశీలన ఎస్‌.ఐ.ఆర్‌ (సర్‌) రూపంలో ఎదురైంది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన భారత ఎన్నికల కమిషన్‌ (ఇ.సి.ఐ)నీ దెబ్బ తీయడం దీనికి మరో కోణం. ఆ ప్రకారం అది స్వతంత్రంగా పనిచేయడం, అందరి పట్ల ఒకేలా వ్యవహరించటం జరగాలి. ఇక మూడో దాడి అసలు జవాబుదారీతనం అన్నదాన్నే మోసపూరితంగా దెబ్బతీయడం జరుగుతున్నది.

ఎస్‌.ఐ.ఆర్‌ గురించి జూన్‌ 24వ తేదీన ఇ.సి.ఐ చేసిన బహిరంగ ప్రకటనతోనే సార్వత్రిక వయోజన ఓటింగ్‌ హక్కు సూత్రంపై దాడి మొదలైంది. ఎస్‌.ఐ.ఆర్‌ కు సంబంధించిన వివిధ అంశాలను ఇప్పటికే పాఠకులతో పంచుకుంటూనే వుస్తున్నాము. కొంచెం సంతోషకరమైన విషయం ఏమంటే ప్రజాస్వామ్య, లౌకిక, ప్రతిపక్ష పార్టీలు బీహార్‌లోనూ, జాతీయంగాను కూడా ఒక్కతాటిపై నిలబడి దీని గురించి ప్రతిస్పందించడం. ఉమ్మడి ప్రతిపక్ష కార్యాచరణలో చాలాకాలం పాటు స్తబ్దత నెలకొన్న తర్వాత ఎస్‌.ఐ.ఆర్‌ ప్రక్రియ ఆ ఐక్యతకు కొత్త ఊపు తీసుకొచ్చింది. ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేయడానికి నిర్ణయించిన కాలవ్యవధి చాలా అల్పంగా ఉండింది. ఎలాంటి అర్థవంతమైన, సమగ్రమైన పరిశీలనకు అది ఏ విధంగానూ సరిపోయేది కాదు. అందువల్ల దాని నిజమైన ఉద్దేశాన్ని గ్రహించటం, తగువిధంగా స్పందించటం సులభమైపోయింది. జూన్‌ 25నే బీహార్‌లో నిరసనలు ప్రారంభమై దేశమంతటికి విస్తరించాయంటే అదే కారణం.

ఆది నుంచి అదే తీరు
ఇ.సి.ఐ స్వతంత్ర పని విధానం కొడిగట్టిపోవడం అన్నది మొదటి నుంచి కనిపిస్తూనే ఉంది. ఈ విస్తార ప్రక్రియను ప్రారంభించడానికి ముందు ఎన్నికల కమిషన్‌ రాజకీయ పార్టీలను విడివిడిగాగాని, ఒక్కటిగాగాని కలుసుకునే ప్రయత్నమేది చేయలేదు. ఇది దీర్ఘకాలంగా అమలవుతున్న సంప్రదాయానికి పచ్చి ఉల్లంఘనే. ఈ మినహాయింపు ఏదో యథాలాపమైంది కాదని, పక్షపాతంతో కూడిందని భావించటం అనివార్యమైంది. ప్రతిపక్ష పార్టీలు తమ నిరసనలు ప్రత్యక్షంగా ఇ.సి.ఐ కి తెలియజేస్తుంటే కమిషన్‌ నిర్ణయాన్ని బలపరచడం కోసం బీజేపీ ఉబలాటపడింది.

పౌరుల దరఖాస్తు పత్రాలతో ఇ.సి.ఐ కోరిన పదకొండు పత్రాలలో ఏదైనా ఇవ్వడమనేది పేద పౌరులకు, ప్రత్యేకించి వలస కార్మి కులకు చాలా క్లిష్టమైన విషయమని అర్థమైపోయింది. ఎందుకంటే వలస కార్మికులు తరచూ జీవనోపాధి కోసం తిరుగుతూ ఉంటారు. రేషన్‌ కార్డు, ఓటర్‌ కార్డు ఆధార్‌ను సాధారణంగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే పత్రాలుగా పరిగణిస్తారు. అయితే వాటిని ఆమోదించడానికి ఇ.సి.ఐ నిరాకరించడంతో ఎస్‌.ఐ.ఆర్‌ కసరత్తు నిజంగా అర్థవంతమైన పరిశీలన కోసం కాదనీ, సామూహిక ఓట్ల తొలగింపునకు మాత్రమే ఉద్దేశించబడిందని స్పష్టంగా తెలిసిపోయింది.

ఎన్నికల కమిషన్‌ ఏర్పడినప్పటి నుంచి ఓటరు నమోదు కోసం అనుసరిస్తున్న పద్ధతుల నుంచి మౌలికంగా వైదొలగే విధంగా ఎస్‌.ఐ.ఆర్‌ కొలబద్దలున్నాయి. ఓటు హక్కు ఎల్లప్పుడూ వయోజనులకు సార్వత్రికమైందిగా ఉండింది. యంత్రాంగమే దానికి వాస్తవ రూపం కల్పిస్తుండేది. అంతేకానీ పౌరులపై తమ పౌరసత్వం నిరూపించు కోవలసిన భారం మోపేదికాదు. దీనిపై ప్రశ్నించినప్పుడు ఎన్నికల సంఘం 326వ అధికరణను ప్రస్తావించింది. ఈ అధికరణం ప్రధాన లక్ష్యం ఓటు వేయడానికిగల సార్వత్రిక హక్కును రక్షించడమే తప్ప పౌరసత్వం ప్రస్తావన ఈ నిబంధనకు కీలకమేమి కాదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా రాజ్యాంగంలోని ఈ నిబంధన పౌరసత్వాన్ని నిర్ధారించే అధికారం ఇ.సి.ఐ కే ఉంటుందని చెప్పడం లేదు. సంవత్సరాల తరబడి అమలవుతూ వచ్చిన పద్ధతి అందుకు పూర్తి భిన్నమైంది. నిర్దిష్టమైన అభ్యంతరాలతో, హోంశాఖ నుంచి తనిఖీలతో మాత్రమే ఓట్ల తొలగింపు జరుగుతూ వచ్చింది. ఈ తనిఖీపై హోంశాఖ పూర్తి సాధికారత కలిగి ఉండేది.

అనివార్యంగా కోర్టుకు
జులై మొదటి వారంలో ప్రతిపక్షాలు ఇ.సి.ఐని కలుసుకొని తమ ఆందోళన తెలియజేశాయి. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు పరిస్థితిని చక్కదిద్దడానికి చేసిన ప్రయత్నాలను పట్టించుకోవడానికే ఎన్నికల కమిషన్‌ నిరాకరించింది. దాంతో ఆ పార్టీలకు చివరి ప్రయత్నంగా ఎస్‌.ఐ.ఆర్‌ ప్రక్రియ రాజ్యాంగ బద్ధతను సవాల్‌ చేయటానికి సుప్రీంకోర్టును ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. అలాగే ముసాయిదా ప్రతి (డి.ఇ.ఆర్‌) ప్రచురణ తర్వాత ఈ అంశం మరింత తక్షణాంశంగా ముందుకు వచ్చింది. దాన్ని ప్రారంభించడానికి ముందున్న వాటిలో 65 లక్షల ఓట్లు తొలగించబడినట్టు డి.ఇ.ఆర్‌ చెప్పింది. ఇందులో అధికమైన తొలగింపులు ఓటర్ల మరణం వల్ల లేక ఆచూకీ తెలియక పోవడం వల్ల జరిగినట్టు పేర్కొనబడింది. మామూలు భాషలో చెప్పాలంటే ఇవన్నీ వలస కార్మికులకు ప్రస్తావనలే.

ఇప్పుడు మన ముందున్న అతి పెద్ద ప్రశ్న తక్షణ పరిశీలన తర్వాత భారీ సంఖ్యలో తొలగింపులకు సంబంధించిన ఆందోళన. 2025 జనవరిలో జరిగిన ఈ ప్రక్రియ తర్వాత ఏప్రిల్‌, మేలో జాబితా ప్రకటించబడింది. అది నిజానికి పరిశీలన కానే కాదు. కొత్త తరహాలో సృష్టించబడిన సరికొత్త జాబితా మాత్రమే. సామూహిక తొలగింపు అనే లక్ష్యంతోనే జరిగింది. ఓటర్ల జాబితాలో ఒక్క ఓటు కూడా కొత్తగా చేర్చబడలేదు. దీంతో ఇ.సి.ఐ అసలు ఉద్దేశం నగంగా బయటపడింది. ఈ క్రమంలో కమిషన్‌ కేవలం 65 లక్షల మంది ఓట్లను తొలగించడమే కాదు అలా తొలగించబడిన వారి పేర్లను అందుకు గల నిర్దిష్ట కారణాలను ప్రచురించడానికి కూడా నిరాకరించింది. ఈ కసరత్తు వక్రబుద్ధి ఏమిటో అర్థమైన తర్వాత సుప్రీంకోర్టు తాత్కాలిక ఉత్తర్వుతో కమిషన్‌ను తొలగించిన వారి పేర్లను అందుకు కారణాలను యాంత్రిక రూపంలో చదువుకునే విధంగా విడుదల చేయాలని ఆదేశించింది. ఆధార్‌ను నివాసానికి సాధికార సాక్ష్యంగా ఆమోదించాలని కూడా ఆదేశించింది. అయినా ఒక తీవ్రమైన సమస్య మిగిలింది. అసలు ఇ.సి.ఐకి పౌరసత్వ నిర్ధారణ ప్రక్రియను ప్రారంభించేందుకు రాజ్యాంగబద్ధంగా అధికారం ఉన్నదా అన్నదే ఆ ప్రశ్న.

దొడ్డిదోవన ఎన్‌.ఆర్‌.సి
ఎస్‌.ఐ.ఆర్‌ పేరుతో ఎన్నికల కమిషన్‌ ఎన్‌.ఆర్‌.సి (పౌరసత్వ నమోదు చిట్టా)ని తీసుకువచ్చే ప్రయత్నం చేసినట్టు విస్తృతమైన అభిప్రా యం నెలకొన్నది. భారతీయ పౌరసత్వాన్ని మతపరమైన గుర్తింపుతో ముందుకు తేవాలన్న హిందుత్వ ప్రేరిత నూతన నిర్వచనంతో ఇది ముడిపడి ఉందని స్పష్టంగానే తెలుస్తుంది. రాబోయే ఎన్నికల్లో ఇది కేంద్ర ప్రచార నినాదంగా ఉండబోతుందన్నది… స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట నుంచి చేసిన తన స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో నొక్కిచెప్పారు. చొరబాటుదారులనబడే వారికి వ్యతిరేకంగా ఆయన ప్రారంభించిన తాజా మత దాడి సారాంశం అదే.
ప్రధాన మీడియాలో వచ్చిన సర్వేలు, డేటా అంశాలను చూసినా ఎస్‌.ఐ.ఆర్‌ ప్రక్రియ లోలోపలి లక్ష్యం ఏంటో బట్టబయలవుతుంది. బీహార్‌ జనాభాలో ఈ 11 నిర్దేశిత పత్రాల లభ్యత అత్యంత తక్కువగా ఉంటుందని లోక్‌నీతి-సి.ఎస్‌.డి.ఎస్‌ అధ్యయనం నిరూపించింది. రాష్ట్రంలో అలాంటి సర్టిఫికెట్లు ఇచ్చే మౌలిక వ్యవస్థ అరకొరగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. మరో అధ్యయనం ప్రకారం ముస్లింలు, మహిళలు ఈ తొలగింపులకు గురైన వారిలో అధిక నిష్పత్తిలో ఉన్నారని తేలింది. లోతుగా పాతుకుపోయిన సామాజిక అసమానతలు, సాధికారతలో తీవ్రమైన హెచ్చుతగ్గులను ప్రతిబింబించే పరిస్థితి ఇది.

దొరికిపోయిన ఘరానా
ఈలోగా మరో విధ్వంసకరమైన అంశం బయటపడింది. సేకరించిన అధికార సాక్ష్యాధారాల ఆధారంగానే ఇది బయట పెట్టబడింది. బెంగళూరులోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో మున్నెన్నడూ లేని స్థాయిలో మోసపూరిత ఓట్ల నమోదు బయటపడింది. ఇది ఇ.సి.ఐ విశ్వసనీయతకు చివరి చావుదెబ్బగా పరిణమించింది. ఆ తర్వాత లోక్‌నీతి-సి.ఎస్‌.డి.ఎస్‌ అధ్యయనం కూడా దీన్ని ధ్రువపరిచింది. ఫలి తంగా ప్రజల దృష్టిలో ఇ.సి.ఐ పట్ల నమ్మకం ప్రమాదకరంగా హరించుకుపోయింది.
ఇ.సి.ఐ వ్యవస్థాగత విశ్వసనీయత ఇంకా ఏమైనా మిగిలిఉంటే ఆగస్టు 17న దాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సి.ఇ.సి జ్ఞానేశ్‌ కుమార్‌ చేతులారా ఆఖరి దెబ్బకొట్టారు. పతిపక్షాలపై తీవ్ర దాడి చేసే విధంగా పక్షపాత పూరిమైన జోక్యానికి పాల్పడుతూ వచ్చి అబద్ధాలను గుమ్మరించారు. కమిషన్‌కు, బీజేపీకి మధ్యలో కుమ్మక్కు ఏమిటో ఇంత తేలిగ్గా మరెవరూ బయట పెట్టలేదేమో.

ఇప్పుడు ఇక పోరాటం ప్రజా ప్రాంగణంలోనే ఉంది. బీహార్‌ పౌరుల ఓటు హక్కులను కాపాడటం కోసం ఆగస్టు 17న ప్రారంభించిన ‘ఓట్‌ అధికార యాత్ర’ సెప్టెంబర్‌ ఒకటిన పాట్నాలో ముగుస్తుంది. ఈ మధ్యకాలంలో…స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థను ధ్వంసం చేయడానికి, పౌరుల అతి విలువైన రాజ్యాంగ హక్కుగా ఉన్న ఓటు హక్కును హరించడానికి జరుగుతున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ప్రజలు దేశవ్యాప్తంగా ఐక్య పోరాటం చేయాలి.
(ఆగస్టు 20 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad