Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఎలక్షన్‌ జీఎస్టీ

ఎలక్షన్‌ జీఎస్టీ

- Advertisement -

మళ్ళీ బీజేపీ మార్క్‌ రాజకీయం
జీఎస్టీ సవరణలు దానిలో భాగమే!
ఈ ఏడాదే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు
వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్‌, కేరళ, తమిళనాడులకు…
గతంలోనూ ఎన్నికలకు ముందు పెట్రోల్‌,డీజిల్‌ రేట్ల తగ్గింపు..ఆ తర్వాత ప్రజలపై రెట్టింపు భారాలు.. మోడీనా…మజాకా!

కేంద్రంలోని మోడీ సర్కార్‌ హఠాత్తుగా వస్తు సేవల పన్ను(జీఎస్టీ)పై కీలక నిర్ణయాలు తీసుకుంది. నాలుగు శ్లాబుల్ని రెండు శ్లాబులుగా కుదించింది. ఉన్నట్టుండి బీజేపీ నేతలకు ప్రజలపై ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందా అని ఆశ్చర్యపోయేలోపు అసలు వాస్తవాలు తెలిసిపోతున్నాయి. ఇంకొద్ది రోజుల్లో దేశంలోని కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటికి సన్నాహకంగా మోడీ మార్క్‌ జిమ్మిక్కులు మొదలయ్యాయి. 2014లో ‘హిందుత్వ’ పేరుతో సెంటిమెంట్‌ రాజకీయాలు నడిపిన బీజేపీ, 2019 నాటికి ఆ సెంటిమెంట్‌ పనిచేయదని అర్థమై, దేశభక్తిని భుజానికెత్తుకుంది. పాకిస్తాన్‌ను బూచిగా చూపి, నోట్ల రద్దుతో ఆ దేశం మట్టికొట్టుకుపోతుందని ఢంకా బజాయించింది. ఇక 2024లో పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, పెరిగిన నిత్యవసరవస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం మోడీ సర్కార్‌పై ప్రభావాన్ని చూపాయి. అప్పటికీ ఆ ముప్పునుంచి బయటపడేందుకు ఎన్నికలకు ముందు తాత్కాలికంగా పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను తగ్గించి, మోడీ మార్క్‌ రాజకీయానికి పాల్పడ్డారు. అయినా ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో ఓట్లు, సీట్లు రాలేదు. అత్తెసరు మెజార్టీతో మళ్లీ అధికారంలోకి రాగలిగారు. ఇప్పుడు ఇది కూడా వర్క్‌అవుట్‌ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు. ఉత్తరాదిన బీజేపీపై ఉన్న భ్రమలు ప్రజల్లో క్రమంగా తగ్గుతున్నాయి. అందుకు దక్షిణాదిపై దృష్టి కేంద్రీకరించారు. ఎన్నికలప్పుడు ‘సంస్కరణలు’ తెస్తే, జనం నమ్మరని ప్రధాని మోడీకి తెలుసు! అందుకే ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందునుంచి ‘సంస్కరణలు’ తెస్తే, బయటపడొచ్చనే రాజకీయ తంత్రం కనిపిస్తూనే ఉంది. తాజాగా జీఎస్టీలో మార్పులు దానిలో భాగమే. ఈ ఏడాది బీహార్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది కేరళ, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్‌ ఉన్నాయి. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి తాజాగా జరిగింది మూడో మార్పు. గతంలో జరిగిన రెండు మార్పులు కూడా పలు రాష్ట్రాల అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలకు ముందు తీసుకొచ్చినవేకావడం గమనార్హం.

న్యూఢిల్లీ : ఇటీవల జీఎస్టీలో తీసుకొచ్చిన మార్పులు దేశవ్యాప్తంగా వాణిజ్య, వ్యాపార, సేవా రంగాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపెట్టనున్నా యి. 450 వస్తువులపై ఈనెల 22 నుంచి వీటి ప్రభావం కనిపించనుంది. 2017 జులైలో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ-2 సర్కారు తీసుకొచ్చిన జీఎస్టీ, దాదాపు ఎనిమిదేండ్ల మూడుసార్లు మార్పులకు గురైంది. ఈనెల 3న జీఎస్టీ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయం అతి పెద్ద మార్పు. పన్నుకు సంబంధించిన దృక్కోణంలో చూస్తే, జీఎస్టీ రాకముందు ఉన్న కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌ల కంటే ప్రస్తుత మార్పు ఎక్కువగా ప్రభావాన్ని చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎన్నికలే టార్గెట్‌
జీఎస్టీ అమల్లోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నవంబర్‌ 2017లో 94 విభాగాల్లోని వస్తువుల రేట్లను జీఎస్టీ కౌన్సిల్‌ మార్చింది. ఆ తర్వాత రెండో మార్పు డిసెంబర్‌ 2018లో వచ్చింది. దాదాపు 17 విభాగాల్లోని వస్తువులు వాటి రేట్లలో మార్పుల్ని చూశాయి. తాజాగా మూడో మార్పుతో పోలిస్తే, మొదటి రెండు మార్పులు చిన్నవే. కానీ ఈ నిర్ణయాలు తీసుకున్న సమయం మాత్రం అందరిలోనూ అనుమానాలు రేకెత్తిస్తోంది. కేంద్రం మూడు సార్లు చేసిన జీఎస్టీ రేట్ల మార్పులన్నీ పలు రాష్ట్రాల అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జరిగినవేననే విషయం అర్థమవుతోంది.
ప్రస్తుతం తీసుకొచ్చిన జీఎస్టీ శ్లాబుల మార్పు కూడా ఈ ఏడాది జరగబోయే కీలకమైన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు, అలాగే వచ్చే ఏడాది షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించబోయే పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే తీసుకొచ్చారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. జీఎస్టీలో తొలిసారి తీసుకొచ్చిన మార్పులు 2017 డిసెంబర్‌లో జరగనున్న గుజరాత్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు చేశారు. అలాగే 2018 తొలి అర్ధభాగంలో నిర్వహించాల్సిన త్రిపుర, కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ మార్పులు చేపట్టారు. ఇక జీఎస్టీలో రెండో మార్పు 2019లో సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందే తీసుకురావడం గమనార్హం.

జీఎస్టీ వసూళ్లపై ప్రభావం
తొలి రెండు మార్పులు జీఎస్టీ అమల్లోకి వచ్చిన కొంత కాలానికే వచ్చాయి. అలాగే కొత్త వ్యవస్థ కింద పన్ను వసూళ్లు కావల్సిన స్థిరత్వాన్ని సాధించటానికి ముందే జరిగాయి. అయితే ఈ రెండు మార్పుల తర్వాత పన్ను వసూళ్ల వేగం తగ్గటం గమనార్హం. అయితే మూడో మార్పు మాత్రం ఎనిమిదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరిగింది. ఈ మార్పులపై ఒక ఏడాదికి పైగా చర్చలు జరిగాయి. వసూళ్ల రేటు కూడా కావల్సిన స్థాయిలో లేనప్పటికీ, స్థిరీకరించారు. గతేడాది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో నికర జీఎస్టీ వసూళ్లు, జీఎస్టీకి ముందు కాలం కంటే కొంచెం తక్కువగా ఉన్నాయి. తొలి రెండు మార్పులు రేట్లకు సంబంధించినవయితే, ప్రస్తుత మార్పు రేట్లతో పాటు శ్లాబులకు సంబంధించింది కావటం గమనార్హం.

లోటు బడ్జెట్‌ భర్తీకి ఎన్నికల తర్వాతే నిర్ణయాలు?
ఈసారి రేటు హేతుబద్ధీకరణ ఆహారం, పొగాకు, వ్యవసాయం, ఎరువులు, బొగ్గు, పునరుత్పాదక ఇంధనం, వస్త్ర, ఆరోగ్యం, విద్య, కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, పేపర్‌, రవాణా, క్రీడా వస్తువులు, బొమ్మలు, తోలు, కలప, రక్షణ, పాదరక్షలు, నిర్మాణం, హస్తకళలు, యంత్రాలు వంటి విస్తృత శ్రేణి రంగాలను కలిగి ఉన్న 420కి పైగా వస్తువులపై ప్రభావం చూపనున్నాయి. అదనంగా రవాణా, జాబ్‌వర్క్‌, నిర్మాణం, స్థానిక డెలివరీ, బీమా వంటి రంగాల్లోని 34 వస్తువులపై వాటి రేట్లు మారనున్నాయి. అయితే 50 వస్తువుల రేట్లను పెంచాలని నిర్ణయించారు. రేటు కోతలతో ప్రభావితమయ్యే ఆదాయాన్ని ఇవి అరికట్టగలవనే విశ్వాసంలో కేంద్రం ఉన్నది. 2023-24లో వచ్చిన వసూళ్లను బట్టి చూస్తే, రేటు తగ్గింపు ద్వారా ప్రస్తుత సంవత్సరంలో రూ.93వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయే అవకాశాలున్నాయన్నది ప్రభుత్వం అంచనా. అయితే పైన చెప్పినట్టు రేట్ల పెంపుదల ద్వారా రూ.45వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశముంది. అంటే ఇంకా రూ.48వేల కోట్ల లోటు నమోదు కానున్నది. అయితే ఈ మొత్తాన్ని కూడా మరిన్ని వస్తువులు, సేవలపై రేట్ల పెంపు ద్వారా పూడ్చాలని మోడీ సర్కారు భావిస్తోంది. అయితే వాటిని ఇప్పటికిప్పుడే కాకుండా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత ఇలాంటి మార్పులు చేసినా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గతంలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను ఇలాగే తగ్గించి, పోలింగ్‌ ముగిసి, ఫలితాలు వెలువడకముందే మళ్లీ భారీగా రేట్లను పెంచిన విషయం తెలిసిందే. కొద్దిరోజులు తగ్గింపు ఫలాలు అనుభవించి, ఆ తర్వాత భారాలు మోసేందుకు సిద్ధంగా ఉండాలని రాజకీయ, ఆర్థిక రంగాల విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad