ప్రధాని నరేంద్ర మోడీ చేసే వాగ్దానాల్లో, ప్రకటనల్లో ఎంతటి గాంభీర్యం ఉంటుందో ఆచరణలో మాత్రం అందుకు విరుద్దమైన పరిస్థితి ఉంటుంది. ఇది బీజేపీ రాజకీయాలను గమనించిన ప్రతి ఒక్కరకి బాగా తెలుసు. తాజాగా కేంద్రంలోని మోడీ సర్కార్ జీఎస్టీలో మార్పులు తీసుకొచ్చి తమది సామన్యుడి, మధ్యతరగతి ప్రభుత్వమని చెప్పుకొనే ప్రయత్నం చేస్తోంది. దాదాపు పదకొండేళ్ల మోడీ పాలనలో జీఎస్టీ నిర్ణయాలతో పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు నష్టపోయింది ఎంతో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రజల కడుపు మాడ్చి ఎన్నికలకు ముందు బిర్యానీ ఫ్రీ అని ప్రకటించి పబ్బం గడుపుకోవడం కొన్ని రాజకీయ పార్టీల నైజం. ఈ విషయంలో బీజేపీ అన్ని పార్టీల కంటే పది ఆకులు ఎక్కువే చదివింది. ఈ కోవాలోనిదే తాజాగా చేసిన జీఎస్టీ శ్లాబు మార్పుల నిర్ణయం. పేదలపై, సామాన్య, మధ్య తరగతి ప్రజలపై కేంద్రంలోని మోడీ సర్కార్‌కు ఆమాంతంగా ప్రేమ కలగడానికి కారణాలు లేకపోలేదు. ఈ ఏడాది నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వచ్చే ఏడాది చూస్తే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి. ఇక 2027లో ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని కీలక రాష్ట్రాలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల ఎన్నికలు ముందుంటే.. మరోవైపు ఇండియా కూటమి తరఫున ప్రారంభమైన ఓట్ చోర్.. గద్ది చోడ్ ఉద్యమం బీజేపీకి పెనుసవాళ్లు విసురుతోంది. రాహుల్ గాంధీ నాయకత్వంలో కూటమి నేతలు చేస్తున్న ఈ ఉద్యమానికి ప్రజా మద్దతు అనూహ్యంగా వస్తోంది. దీంతో త్వరలో జరిగే వివిధ రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ విజయ అవకాశాలకు దారులు మూసుకుపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో పేద, సామాన్య, మధ్య తరగతి వర్గాలకు ఊరాటనిచ్చే పేరుతో జీఎస్టీ శ్లాబులలో మార్పులకు కేంద్రంలోని మోడీ సర్కార్ నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయంతో తాము సామాన్య, పేద ప్రజలకు ఎంతో మేలు చేశామని ప్రధాని నరేంద్ర మోడీ గాంభీర స్వరంలో చెప్పారు. కొత్త జీఎస్టీ శ్లాబ్‌లు ఈ సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమలులోనికి రానున్నాయి. అయితే స్వాతంత్య్ర వేడుకల్లో చెప్పినట్లుగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ శ్లాబ్‌లు మార్చి దసరా, దీపావళి గిఫ్ట్ ఇచ్చారా, ఇప్పటికీ అమలులోనున్న జీఎస్టీ విధానంతో ఇన్నాళ్లు దగా చేశారా అన్నది ఆలోచించాలి. ఇప్పటి వరకు అమలులోనున్న జీఎస్టీ విధానంతో ప్రజలు భారం మోశారు కాబట్టే ఇపుడు వచ్చే కొత్త విధానంతో పేద, సామాన్య, మధ్య తరగతికి ఊరాట ఇచ్చినట్లు చెప్పుకోవాల్సి వస్తోంది. ఇప్పుడు అమలులోనున్న జీఎస్టీ విధానం తీసుకొచ్చింది నరేంద్ర మోడీ సర్కార్ అన్న విషయం గమనంలోకి తీసుకోవాలి. ఇదిలావుంటే వస్తు సేవల పన్ను విధానంలో ప్రస్తుతం 0, 5, 12, 18, 28 శాతం శ్లాబులు ఉన్న సంగతి తెలిసిందే. కొత్తగా తీసుకొన్న నిర్ణయంతో ఇప్పుడున్న 12, 28 శాతం శ్లాబుల్ని ఎత్తివేసే యోచనలో ఉండగా ఇక 5, 18 శాతం శ్లాబులే ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పటికీ అమలులోనున్న జీఎస్టీ విధానంతో మోడీ సర్కార్ సామాన్యుల నుంచి అధిక మొత్తంలో పన్నులు వసూలు చేసింది. పదకొండేండ్ల ఎన్డీయే సర్కారు పాలనలో సామాన్యుడి జీతంలోని సింహభాగమంతా పన్నులకే పోయింది. 2014లో మోడీ ప్రధానిగా పగ్గాలు చేపట్టినప్పుడు కేంద్రానికి పన్నుల రూపంలో రూ.17.94 లక్షల కోట్ల మేర ఆదాయం వస్తే, 2025నాటికి అది రూ.50 లక్షల కోట్లు దాటింది. మొత్తంగా 11 ఏండ్లలో పన్నుల పేరిట రూ. 329 లక్షల కోట్లను మోడీ ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసింది. ఇక, 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ వసూళ్లు మూడు రెట్లు పెరిగాయి. 2017-18లో రూ.7.41 లక్షల కోట్లుగా ఉన్న జీఎస్టీ వసూళ్లు 2024-25 నాటికి రూ. 22.08 లక్షల కోట్లకు చేరుకొన్నాయి. ఇన్నిరోజులూ ప్రజల నుంచి పన్నులను పిండుకొన్న మోడీ ప్రభుత్వం ఇప్పుడు తీరిగ్గా జీఎస్టీలో సంస్కరణలు తీసుకొస్తామని ప్రకటించడంతో మోసం చేశారని స్పష్టమవుతోంది. మోడీ సర్కార్ ఇప్పటికే అమలు చేస్తున్న జీఎస్టీ విధానంలో వ్యక్తిగత లైఫ్, హెల్త్, టర్మ్ బీమా పాలసీలపై 18శాతం అమలు చేస్తున్నారు. కానీ కొత్తగా అమలులోకి వచ్చే విధానంలో వీటిని జీఎస్టీ నుంచి తొలగిస్తున్నారు. వ్యక్తుల బీమా పాలసీల పట్ల ఉదారంగా వ్యవహరించాల్సిన మోడీ సర్కార్ ఇప్పటి వరకు 18శాతం జీఎస్టీ వసూలు చేసి ప్రజలను బీమా పాలసీలకు దూరం చేసిందని గుర్తించాలి. అలాగే 33 రకాల ప్రాణాధార ఔషధాలపై 12 శాతం జీఎస్టీ వేసింది. కొత్త విధానంలో వీటికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. అంటే ఇంతకాలం సామాన్య ప్రజల ప్రాణాధార ఔషదాలపై 12శాతం జీఎస్టీ విధించి మోడీ సర్కార్ ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడిందనే చెప్పాలి. విద్య, వైద్యం, ఆహార భద్రత కల్పన ప్రభుత్వాల బాధ్యత. ఈ రకంగా చూసుకొంటే జీఎస్టీ పాత విధానంతో మోడీ సర్కార్ ఇన్నాళ్లపాటు దోపిడి చేస్తూ వస్తోందని భావించాలి. త్వరలో వివిధ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు చేరువయ్యే ఎత్తుగడ్డలో భాగంగానే జీఎస్టీ శ్లాబుల మార్పుతో మోడీ సర్కార్ జిమ్మిక్కులు ప్రారంభించింది. ఎందుకంటే ‘ఓట్ చోర్ గద్ది చోడ్’ అన్న ఇండియా కూటమి ఉద్యమంతో ఎన్నికల్లో గెలిచే మరో మార్గం లేకపోవడంతోనే మోడీ జీఎస్టీ శ్లాబులను మార్చి పేద, సామాన్య ప్రజలకు ఉద్దరిస్తున్నట్లు ప్రకటించుకొంటోంది. కొత్త జీఎస్టీ విధానంతో ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న ఉద్దేశంతోనే వీటిని పెద్ద ఎత్తున్న ప్రచారం చేసుకొనేందుకు బీజేపీ, మోడీ సర్కార్ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు.
సయ్యద్ నిసార్ అహ్మద్
780 101 9343