నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్రంలో తరచూ వాయిదా పడుతూ వస్తున్న ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక నేడు జరగనుంది. అందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ మూడు మున్సిపాలిటీల్లో శనివారం ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం 12:30 గంటలకు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
గత అనుభవాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెక్షన్-163 ప్రకారం నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని పోలీస్ అధికారులు ప్రకటించారు. ఈ మూడుచోట్లా బీఆర్‌ఎస్‌కే స్పష్టమైన మెజారిటీ ఉన్నది. అయితే, గతంలో కాంగ్రెస్ నాయకులు సృష్టించిన ఆటంకాలు, కోర్టు కేసుల కారణంగా ఈ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. హైకోర్టు జోక్యంతో ఎన్నికల సంఘం ఎట్టకేలకు శనివారం ముహూర్తం ఖరారు చేసింది.



