స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కేసులో హైకోర్టు
ఎలక్షన్ నోటిఫికేషన్‌పై స్టే లేదన్న ధర్మాసనం
రిజర్వేషన్ల పెంపుపై మాత్రమే స్టే విధింపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీసీ రిజర్వేషన్లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పంచాయతీ రాజ్ చట్టం-2018లో రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ సెప్టెంబర్ 26న జారీ చేసిన జీవోలు 41, 42లపై మాత్రమే స్టే ఇస్తున్నట్టు హైకోర్టు స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వలేదని చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యాక కోర్టుల జోక్యానికి వీల్లేదనీ, అందుకే ఎన్నికల నోటిఫికేషన్‌లో జోక్యం చేసుకోలేదని వివరించింది. జీవో 9 ప్రకారం బీసీ రిజర్వేషన్లు 25 నుంచి 42 శాతానికి పెంచడం వల్ల మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి పెరిగిన నేపథ్యంలో జీవోలు మూడింటిపైనా స్టే విధిస్తున్నట్టు చెప్పింది.
ప్రధాన కేసుల్లోని మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. వికాస్ కిషన్‌రావ్ గవాలీ కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దని నిర్ధేశించిందని గుర్తు చేసింది. ఈ మేరకు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలిపింది. అందుకే 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన జీవోపై స్టే విధిస్తున్నామని పేర్కొంది. జీవో వల్ల 50 శాతానికి మించిన 17 శాతం సీట్లను ఓపెన్ కేటగిరీ సీట్లుగా నోటిఫై చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవచ్చని స్పష్టం చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినందున ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దన్న వాదనలు తమ ముందుకు వచ్చాయనీ, వాదనలు ప్రాథమిక దశలోనే ఉన్నందున సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన రాహుల్ రమేశ్‌వాఘ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆధారపడి మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నట్టు వెల్లడించింది.
రిజర్వేషన్లను పెంచకుండా పాత విధానంలో అంటే 50 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేసింది. ఓపెన్ క్యాటగిరీలో ఎన్నికలు జరపొచ్చునని వెల్లడించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు వల్ల మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి పెరగడం సుప్రీంకోర్టుకు వ్యతిరేకమనీ, అందుకే స్టే ఇస్తున్నట్టు చెప్పింది. 50 శాతానికి మించి ఉన్న 17 శాతం రిజర్వేషన్లను జనరల్ క్యాటగిరీగా పరిగణించి పాత పద్ధతిలో అంటే 50 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం పాత విధానంలో అంటే బీసీలకు 25 శాతం, ఎస్సీలకు 15, ఎస్టీలకు 10 శాతం చొప్పున కేటాయిస్తూ ఎన్నికలు నిర్వహించవచ్చునని చెప్పింది. పాత పద్ధతిలో సీట్ల రిజర్వేషన్ల ప్రక్రియను సవరించి ఆ మేరకు సీట్లను, రిజర్వేషన్లను ప్రకటించి ఎన్నికల ప్రక్రియ కొనసాగించవచ్చని వివరించింది.
ఈ మేరకు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మోహిద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ గతంలో జారీ చేసిన స్టే ఆదేశాల ప్రతి శుక్రవారం అర్ధరాత్రి తర్వాత అందుబాటులోకి వచ్చింది. బీసీ రిజర్వేషన్లు 42 శాతంతో అమలు చేస్తే తిరిగి సరిదిద్దలేని పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయని పేర్కొంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26న జారీ చేసిన బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన జీవో 9, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు రిజర్వేషన్లను స్థీరీకరిస్తూ పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన జీవోలు 41, 42 అమలును నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఆదేశాలిస్తున్నట్టు చెప్పింది. కేశవ్ కిషన్‌రావు గవాలి కేసును పరిగణనలోకి తీసుకుని జీవోలపై స్టే ఇస్తున్నట్టు తెలిపింది.
రాహుల్ రమేష్ వాగ్-మహారాష్ట్ర మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు 2022లో ఇచ్చిన తీర్పులో ట్రిప్యుల్ టెస్ట్ చేయాలని ఆదేశించిందనీ, స్థానిక స్థాయిలో ఓబీసీలపై సమగ్ర డేటా సేకరించేందుకు ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయాలనీ, కమిషన్ అధ్యయనం చేసిన డేటా ఆధారంగా రిజర్వేషన్ శాతాన్ని నిర్ణయించాలని, మొత్తం (ఎస్సీ, ఎస్టీ, బీసీ) రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొందని, ఈ నేపథ్యంలో స్టే ఇస్తున్నట్టు వెల్లడించింది. ఇలా చేయకపోవడం వల్లే మహారాష్ట్రలో రిజర్వేషన్ల పరిధి 50 శాతానికి మించడాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసిందని కూడా వివరించింది. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసే పరిస్థితులు లేకపోతే పెంచిన 17 శాతం రిజర్వేషన్లను జనరల్ క్యాటగిరీగా పరిగణించాలనీ, ఆ మేరకు నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించాలని స్టే ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఇదే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యాక కోర్టుల జోక్యానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నందున రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఎలక్షన్ నోటిఫికేషన్ విషయంలో జోక్యం చేసుకోవడం లేదని తెలిపింది. ప్రతివాదులు లేవనెత్తిన అంశాలపై ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదని చెప్పింది. తదుపరి విచారణను డిసెంబర్ 3కి వాయిదా వేసింది.ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) చర్చలు చేపట్టింది. వారి సూచన మేరకు తదుపరి నిర్ణయం తీసుకోనుంది.