Tuesday, November 18, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుగ్రామపంచాయతీలకే ఎన్నికలు

గ్రామపంచాయతీలకే ఎన్నికలు

- Advertisement -

కోర్టు తీర్పు తర్వాతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ ఎన్నికలు
పార్టీ తరఫున బీసీలకు 42 శాతం టిక్కెట్లు
డిసెంబర్‌ రెండోవారంలో నోటిఫికేషన్‌
ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం
ఉమ్రా యాత్రికుల మృతికి క్యాబినెట్‌ సంతాపం
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
మంత్రి అజహరుద్దీన్‌, ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్‌హుస్సేన్‌తో కూడిన ప్రతినిధి బృందం సౌదీకి వెళ్లాలని సీఎం ఆదేశం
మృతులకు చెందిన ఒక్కో కుటుంబం నుంచి ఇద్దర్ని తీసుకెళ్ళాలని నిర్ణయం
గిగ్‌వర్కర్ల బిల్లుకూ ఆమోదం
కొత్త విద్యుత్కేంద్రాల ఏర్పాటుపై మరోసారి అధ్యయనం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో వెంటనే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అయితే జెడ్‌పీటీసీ, ఎమ్‌పీటీసీ, ఎంపీపీ ఎన్నికలను బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తుది తీర్పు తర్వాతే చేపట్టాలని నిర్ణయించారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహించాలని పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామపంచాయితీలకు 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదన మేరకు దాదాపు రూ.3వేల కోట్ల నిధులు రావల్సి ఉందనీ, 2026 మార్చి నాటికి ఆ నిధులు మురిగిపోతాయనీ, అందువల్లే మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రెవెన్యూ, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

అయితే కాంగ్రెస్‌పార్టీ తరఫున పంచాయతీ ఎన్నికల్లో 42 శాతం టిక్కెట్లను బీసీలకు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయం లో మంత్రివర్గ సమావేశం జరిగింది. సౌదీ అరేబియాలో బస్సు ప్రమా దంలో మరణించిన బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షలు పరిహారం అందించాలనే ప్రతిపాదనకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే మంత్రి అజహరుద్దీన్‌తో పాటు నాంపల్లి నియోజకవర్గం ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్‌ హుస్సేన్‌, మైనారిటీ విభాగానికి చెందిన ఒక ఉన్నఅధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని నిర్ణయించారు. చనిపోయినవారి మృతదేహాలను వారి మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు చేయాలనీ, బాధిత కుటుంబ సభ్యుల్లో ఒక్కో కుటుంబానికి ఇద్దరిని ప్రభుత్వ ఖర్చుతో సౌదీకి తీసుకెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

అందెశ్రీ కుమారుడికి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగం
ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ మరణించడంతో ఆయన కుమారుడు ఎ. దత్త సాయికి డిగ్రీ కాలేజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం కల్పించేందుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పాత్రను భావి తరాలకు తెలియజేసేలా ఆయన అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలో స్మృతివనం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని పాఠశాల పాఠ్యపుస్తకాల్లో మొదటి పేజీలో ముద్రించాలనే నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఎస్సారెస్పీకి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేరు
ఎస్సారెస్పీ స్టేజ్‌-2 మెయిన్‌ కెనాల్‌కు మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేరు పెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీన్ని ఇకపై ఆర్‌డీఆర్‌ (రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి) ఎస్సారెస్పీ స్టేజ్‌ – 2 కెనాల్‌ అని పేరు మారుస్తారు.

ఓఆర్‌ఆర్‌ లోపలి భూములు ఇకపై మల్టీ యూజ్‌ జోన్స్‌
ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) లోపల ఉన్న ఇండిస్టియల్‌ ల్యాండ్‌ను మల్టీ యూజ్‌ జోన్స్‌గా మార్చేందుకు రూపొందించిన ”హైదరాబాద్‌ ఇండిస్టియల్‌ ల్యాండ్స్‌ ట్రాన్సర్మేషన్‌ పాలసీకి క్యాబినెట్‌ ఆమోదించింది.

ఫూచర్‌ సిటీలో గ్లోబల్‌ సమ్మిట్‌
ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్‌ 8, 9 తేదీల్లో ఫ్యూచర్‌ సిటీలో తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2025 నిర్వహించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిలో రెండేండ్లలో ప్రజా ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, సాధించిన విజయాలను ఈ వేదిక ద్వారా వివరిస్తారు. అలాగే ఇదే వేదికపై నుంచి డిసెంబర్‌ 9న తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరించేందుకూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త విద్యుత్కేంద్రాల ఏర్పాటుపై మరోసారి అధ్యయనం చేయాలని క్యాబినెట్‌ సూచించింది.

గిగ్‌ వర్కర్ల చట్టానికి ఆమోదం
గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ కార్మికుల సంక్షేమం, భద్రత కోసం తెలంగాణ ప్లాట్‌ఫామ్‌ బేస్‌డ్‌ గిగ్‌ వర్కర్స్‌ రిజిస్ట్రేషన్‌, సోషల్‌ సెక్యూరిటీ అండ్‌ వెల్ఫేర్‌ యాక్ట్‌ – 2025 బిల్లును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. దీనివల్ల రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది గిగ్‌ వర్కర్స్‌, ప్లాట్‌ఫాం బేస్డ్‌ వర్కర్స్‌కు ప్రయోజనం కలుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మొబిలిటీ, ఫుడ్‌ డెలివరీ బాయ్స్, ఈ కామర్స్‌, లాజిస్టిక్స్‌ ఇతర రంగాల్లో గిగ్‌ వర్కర్లు, ఇండ్లలో పనిచేసేవారు తమపేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. త్వరలోనే అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టి చట్టరూపంలోకి తెస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -