Monday, February 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎలక్ట్రిక్‌ బస్సులు భారం ఆర్టీసీకి పెనుశాపం

ఎలక్ట్రిక్‌ బస్సులు భారం ఆర్టీసీకి పెనుశాపం

- Advertisement -

ప్రయివేటుకే లాభం
ఆదాయం తక్కువ..ఖర్చెక్కువ
నిర్వహణలో అనేక సవాళ్లు
బస్సులు అవసరమే..
జీసీసీ విధానంలో మార్పులు తప్పనిసరి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ఎలక్ట్రిక్‌ బస్సులు..ఇప్పుడు రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థలో వస్తున్న కీలకమార్పు. పర్యావరణ హితంగా రవాణాను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ బస్సులు విధానానికి శ్రీకారం చుట్టింది. అయితే ఇది మంచిదే అయినా ఆర్థిక తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులకు కారణమవుతున్నది. ప్రస్తుత కేంద్ర విధానంలో ఎలక్ట్రిక్‌ బస్సుల కొనుగోలు, నిర్వహణ, ఇతర అంశాల విషయంలో స్థానిక ఆర్టీసీలకు ఎలాంటి పాత్ర లేదు. కేవలం ప్రయివేటు సంస్థలు, అపరేటర్లకు పెద్దపీట వేస్తున్నారు. ఇందులో మూడు రకాలుగా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆదాయం కంటే ఖర్చెక్కువ కావడం, ఆర్టీసీల్లో కార్మికులకు ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమ వుతుండటం, కార్పొరేషన్‌ ప్రయివేటు పరమయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. దీంతో ఆర్టీసీ కార్మిక సంఘాల నుంచి ఆందోళన, ఆవేదన వ్యక్తమవుతున్నది. హరిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టే క్రమంలో ఆర్టీసీలను నిర్వీర్యం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాయి. వేలాది మంది కార్మికులు తెలంగాణ ఆర్టీసీ ద్వారానే ఎలక్ట్రిక్‌ బస్సుల విధానాన్ని అమలుచేయాలని కోరుతున్నాయి.

ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం దాదాపు 1.14 లక్షల కోట్లు ఖర్చుపెట్టింది. ఈ నిధులు మొత్తం ప్రయివేటు సంస్థలకే వెళ్లాయి. బస్సుల కొనుగోలు నుంచి నిర్వహణ, ఇతర అవసరాల కోసం వినియోగించారు. ఇందులోనుంచి ఒక్కపైసా కూడా ఆయా రాష్ట్రాల్లోని ఆర్టీసీలకు చేరలేదు. ఎలక్ట్రిక్‌ బస్సుల కోనుగోలును ఆయా రాష్ట్రాల్లోని ఆర్టీసీలకే అప్పగిస్తే సంస్థలతోపాటు అందులో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు, ఇతరులకు ఉద్యోగ భద్రత సమస్యలు రావు. లేనిపక్షంలో ప్రభుత్వాలు, ఆర్టీసీలకు ఆర్థిక, పరిపాలనపరమైన ఇబ్బం దులు తప్పవని ఆర్టీసీ కార్మిక సంఘాలు అంటున్నాయి.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ బస్సుల వినియోగాన్ని పెంచుతున్నారు. అలాగే ఆర్టీసీకి చెందిన డీజిల్‌ బస్సులను రెట్రో ఫిట్మెంట్‌ ప్రక్రియ ద్వారా ఎలక్ట్రిక్‌ బస్సులుగా మార్చేందుకు టెండర్లు పిలిచారు. ఇప్పటికే అవుటర్‌ రింగు రోడ్డు పరిధిలో 2800 ఎలక్ట్రిక్‌ బస్సులు తిప్పాలని ప్రభుత్వం భావిస్తున్నది. వాయు కాలుష్యాన్ని నివారించడం ద్వారా శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చంటూ ప్రభుత్వం ముందడుగువేసింది. 2027 చివరి నాటికి భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్‌ బస్సులను రోడ్ల మీదకు తేవాలనే లక్ష్యంతో చర్యలు తీసుకుం టున్నది. దీనికి సంబంధించిన విధానం, ఇతర అంశాలు ఈన్నీ కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షి స్తున్నది. ఇప్పటికే హైదరా బాద్‌లో 325 బస్సులు నడుస్తున్నాయి. ఈ ఏడాదిలో మరో175 బస్సులను కొనుగోలు చేయనున్నారు. 19 ఆర్టీసీ డిపో ల్లో ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. వీటన్నింటి కోసం రూ. 325 కోట్లు ఖర్చవు తుందని సర్కారు అంచనా వేసింది.

కొనుగోలు..నిర్వహణ
ఎలక్ట్రిక్‌ బస్సులను కొనుగోలు చేయడానికి, ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ఆర్టీసీ కార్మికులు, సంఘాలు స్వాగస్తున్నాయి. ఈ ప్రక్రియ మొత్తం ప్రయివేటు సంస్థల ద్వారా కాకుండా ఆర్టీసీ ద్వారా చేయాలని కోరుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ కార్పొరేషన్‌ నష్టాల్లో ఉంది. మళ్లీ ప్రయివేటు ద్వారా ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపితే సంస్థ మరింత ఇబ్బందుల్లో పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఎలక్ట్రిక్‌ బస్సుల విధానంలో ప్రభుత్వ పాత్ర ఉండదు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రయివేటుకు ప్రోత్సహిస్తున్నది. కొనుగోళ్ల నుంచి మొదలెడితే నిర్వహణ వరకూ ప్రయివేటు సంస్థలే చేస్తాయి. అయితే వాస్తవంగా ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆర్టీసీ సంఘాలు అంటున్నాయి. వాస్తవంగా ఎలక్ట్రిక్‌ బస్సుల కొనుగోలు మూలంగా తలెత్తే సమస్యలను అధ్యయనం చేయకుండా, గుర్తించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అద్దె బస్సుల అనుభవాలను విస్మరిస్తున్నారనే వ్యాఖ్యానాలూ ఉన్నాయి.

జీసీసీ విధానం
ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రస్తుతం గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌(జీసీసీ) విధానంలో కొనుగోలు చేస్తున్నారు. టెండర్ల ద్వారా దీన్ని అమలు చేస్తున్నారు. ప్రయివేటు అపరేటర్లే బస్సులను కొనుగోలు చేయడం, వాటికి డ్రైవర్లను సమకూర్చడం, నిర్వహణ చేయడం, ఛార్జింగ్‌ స్టేషన్ల వంటి మౌళిక సదుపాయాలను ఏర్పరచుకోవడం తదితర చర్యలు తీసుకోవడం చేయాలి. ఆయా రాష్ట్రాల ఆర్టీసీలు కిలోమీటర్‌కు ఇంత అని రేటు ఫిక్స్‌ చేసి ఎలక్ట్రిక్‌ బస్సులను వాడుకోవడమే కేంద్ర ప్రభుత్వ విధానం. దీని ద్వారా స్థానిక ఆర్టీసీలకు ఎలాంటి లాభం ఉండదు.

ఆదాయం తక్కువ..ఖర్చెక్కువ
ఓఆర్‌ఆర్‌ పరిధిలో ఎలక్ట్రిక్‌ బస్సులు తిరుగుతున్నాయి. వీటి ద్వారా కొన్ని అనుభవాలు వచ్చాయి. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ అవుతోందని తేలింది. ఎలక్ట్రిక్‌ బస్సులకు తాజా లెక్కల ప్రకారం రోజుకు కిలో మీటర్‌కు వచ్చే ఆదాయం రూ. 58 నుంచి రూ.60గా ఉంటున్నది. కానీ ప్రయివేటు అపరేటర్‌కు రోజుకు కిలోమీటర్‌కు రూ. 63 చెల్లించాలి. రోజువారీగావచ్చే ఆదాయంతో సంబంధం లేదు. 2019లో వచ్చిన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు బస్సులకు రోజుకు కిలోమీటర్‌కు రూ. 38 మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు దాదాపు రూ.25 పెరిగింది. అలాగే ఓఆర్‌ఆర్‌ పరిధిలో కిలోమీటర్‌కు రూ. 26 ఇస్తున్నారు. నగరంలో ఉదయం ఒక కండక్టర్‌, సాయంత్రం ఒక కండక్టర్‌ అవసరం అవుతారు. అప్పుడు ఇద్దరికి రూ. 13 చొప్పున అదనంగా చెల్లించాలి. దీంతో మొత్తం రూ. 63కు కండక్టర్ల ఖర్చు రూ. 26 కలిపితే రూ. 89 అవుతుంది. దానికి ఓవర్‌వెయిట్‌ కింద రూ. ఏడు చెల్లించాలి. అది కాస్త మొత్తం రూ. 96కు చేరుతుంది. కాగా వస్తున్న ఆదాయం రూ. 60 అయితే , అదనంగా రూ. 36 చెల్లించాల్సి వస్తుంది. రూ. 36ను ఎవరు, ఎక్కడి నుంచి తెస్తారనే ప్రశ్నలు కార్మిక సంఘాల నుంచి వస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. కార్పొరేషన్లకు మళ్లీ అప్పుల తిప్పలు తప్పకపోవచ్చని కార్మికుల అభిప్రాయం. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం కీలోమీటర్‌కు రూ. 70 ఖర్చయితే, వచ్చేది రూ. 60మాత్రమే. మిగతా రూ. 10 ఎవరు చెల్లిస్తారనేది ప్రశ్న.

ప్రస్తుతం..భవిష్యత్తు
ఆర్టీసీ ద్వారా ప్రతిరోజు బస్సులు రాష్ట్రవ్యాప్తంగా 36 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. ఇది హైదరాబాద్‌లో 11 లక్షలు కిలోమీటర్లుగా ఉంది. 2027 నాటికి 2800 ఎలక్ట్రిక్‌ బస్సులను రోడ్డుమీదకు తెస్తే 11 లక్షల కిలోమీటర్లకు రూ.30 చెల్లించినా రోజుకు రూ. 3 కోట్లు అవుతుందని అంచనా. ఈ లెక్కన ఏడాదిలో రూ. 1000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారనేది ఆర్టీసీ సంఘాలు ప్రశ్నిస్తు న్నాయి. ఎలక్ట్రిక్‌ బస్సుల మూలంగా డీజిల్‌ ఖర్చు తగ్గినా, నిర్వహణ ఖర్చు భారీగా పెరుగుతున్నదని అంటున్నారు. ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తోపాటు ఆర్టీసీ యాజమాన్యం గుర్తించాలని సంఘాలు కోరుతున్నాయి.

ఇప్పటికే అనేక సమస్యలు
ఆర్టీసీలో ఇప్పటికే అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం పాత వేతన బకాయిలే చెల్లించలేదు.ఎలక్ట్రిక్‌ బస్సుల మూలంగా ఉద్యోగ భద్రత ప్రశ్నార్థమవుతున్నది. ఆర్టీసీలో 7000 మంది నిర్వహణా కార్మికులు ఉన్నారు. డ్రైవర్లు, ఇతరులు 17 వేల మంది విధుల్లో ఉన్నారు. ఎలక్ట్రిక్‌ బస్సుల్లో స్వైపింగ్‌ పద్దతి ప్రవేశపెడితే రేపు కండక్టర్లను ఇంటికి పంపాల్సి ఉంటుంది. అప్పుడు పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది. వీళ్లందరిని ఇంటికి పంపుతారా ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఆర్టీసీకే ఇవ్వాలి : ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్‌ రావు
ఎలక్ట్రిక్‌ బస్సుల కొనుగోలు విధానంలో మార్పులు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను సమకూర్చి కొనుగోలు, నిర్వహణ స్థానిక ఆర్టీసీలకు అప్పగించాలి. ప్రయివేటు సంస్థలు, అపరేటర్లకు ఇచ్చే సబ్సీడీలు, నిధులు, వయబులిటి గ్యాప్‌ ఫండ్‌ అంతా ఆర్టీసీకే ఇవ్వాలి. ఆర్టీసీ ద్వారా ఆ బస్సుల నడపాలి. అసెంబ్లీలో తీర్మానం చేయడంగానీ లేదా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపాలి జీసీసీ విధానాన్ని రద్దు చేసి ఆర్టీసీ ద్వారా కొత్త విధానం అమలుచేయాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -