ప్రకటించిన కేంద్రమంత్రి ఖట్టర్
నవతెలంగాణ- హైదరాబాద్‌బ్యూరో
సంస్కరణల పేరుతో విద్యుత్ పంపిణీ సంస్థల్ని (డిస్కంలు) పూర్తిగా ప్రయివేటీ కరించే విద్యుత్ సవరణ బిల్లు-2025ను వచ్చే బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని సోమవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ స్వయంగా వెల్లడించారు. డిస్కంలను అప్పుల ఊబి నుంచి బయటపడేయడం కోసమే ఈ బిల్లును అమల్లోకి తెస్తున్నామని చెప్పుకొచ్చారు. కొన్నేండ్లుగా నష్టాల్లో కూరుకుపోయిన డిస్కంలు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2,701 కోట్ల లాభాలను అర్జించాయనీ, అయితే ఇంకా 50 డిస్కమ్‌లు నష్టాల్లోనే ఉన్నాయని వివరించారు. అన్ని డిస్కమ్‌లను లాభాల బాట పట్టించడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని తెలిపారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదించుకొని, వెంటనే అమల్లోకి తెస్తామనీ, తద్వారా డిస్కమ్‌లకు బిల్లుల చెల్లింపులు ఎప్పటికప్పుడు జరిగిపోతాయని చెప్పుకొచ్చారు.
అయితే ఈ ప్రతిపాదనపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ఈ బిల్లును దేశంలోని అన్ని విద్యుత్ సంస్థల ఉద్యోగ, కార్మిక, ఇంజినీర్ల సంఘాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇది అమల్లోకి వస్తే దేశంలోని కరెంటు స్తంబాలు మొదలు సబ్‌స్టేషన్లు, లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు సహా అన్నీ ప్రయివేటుపరం అవుతాయి. డిస్కంలు కేవలం ఆయా ఆస్తులకు చెందిన అద్దెలను వసూలు చేసుకొనే ఏజేన్సీలుగా మాత్రమే పరిమితమవుతాయి. ఇప్పటికే దేశంలో విద్యుదుత్పత్తిని ప్రయివేటీకరించిన విషయం తెలిసిందే. ఈ సవరణ బిల్లుతో డిస్కంలతో పాటు ట్రాన్స్‌కో కార్యకలాపాలు కూడా ప్రయివేటీకరించబడతాయి. ఈ బిల్లును ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) పూర్తిగా వ్యతిరేకిస్తుందని ఆ సంఘం చైర్మెన్ శైలేంద్ర దుబే తెలిపారు.



