Sunday, November 16, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపాలమూరు ప్రాజెక్టుల విద్యుత్‌ బకాయిలు రూ.4,564కోట్లు

పాలమూరు ప్రాజెక్టుల విద్యుత్‌ బకాయిలు రూ.4,564కోట్లు

- Advertisement -

ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించని ప్రభుత్వం
ప్రాజెక్టుల కోసం ఇచ్చిన నిధులే దిక్కు
కేఎల్‌ఐ, ఎస్‌ఎల్‌బీసీ, మిషన్‌ భగీరథ కరెంటు బిల్లులు పెండింగ్‌
ఎల్లూరులో ఒక్క సర్వీసుకే రూ.2,160 కోట్ల బకాయి
ప్రతినెలా రూ.23 కోట్ల పెనాల్టీలు చెల్లిస్తున్న సర్కారు

నవతెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
పాలమూరు ప్రాజెక్టులకు నిధులు లేక పనులు సాగుతా ఉంటే.. విద్యుత్‌ ఖర్చుల బకాయిలూ భారీగా పేరుకుపోయాయి. వార్షిక బడ్జెట్లో విద్యుత్‌ వినియోగానికి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయింపులు ఉండవు. ప్రాజెక్టుల నిర్వహణ, పునరావాసం, యంత్రాల కోసం ప్రభుత్వం ఏడాదికోసారి బడ్జెట్‌ విడుదల చేస్తుంది. పాలకుల వైఫల్యం వల్ల ప్రాజెక్టులు 20 ఏండ్ల కిందట మొదలు పెట్టినవి నేటికీ పూర్తి కాలేదు. ప్రాజెక్టుల నిర్వహణలో అత్యంత కీలకమైన విద్యుత్‌కు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం లేదు. ఫలితంగా విద్యుత్‌ బిల్లులు చెల్లించకపోవడంతో వేల కోట్ల బకాయిలు పేరుకుపోతున్నాయి. ఆ బకాయిలకు ప్రతినెలా ప్రభుత్వం రూ.23 కోట్లు పెనాల్టీ చెల్లిస్తోంది.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సాధారణంగా అత్యల్ప వర్షపాతం నమోదవుతుంది. ఈ పరిస్థితుల్లో గత పాలకులు ఎత్తిపోతల ద్వారా కృష్ణానది నుంచి నీటిని మళ్లించొచ్చని భారీ ప్రాజెక్టులు మొదలుపెట్టారు. పాలమూరు- రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల, భీమా, నెట్టెంపాడు వంటి సాగునీటి ప్రాజెక్టులున్నాయి. ఇవన్నీ ఎత్తిపోతల పథకాలే. వీటి నిర్వహణకు విద్యుత్‌ అవసరం. ఏటా ప్రాజెక్టుల నిర్వహణతోపాటు విద్యుత్‌ బిల్లుల చెల్లింపులకు నిధుల్లో కోతలు విధించడం వల్ల గుట్టల్లా బకాయిలు పేరుకుపోయాయి. ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని మళ్లించడానికి భారీ మోటార్లను బిగించారు. ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్లు పాలమూరు- రంగారెడ్డిలో ఉన్నాయి.

ఒక మోటార్‌ నెలలో 620 మెగావాట్ల విద్యుత్‌ను తీసుకుంటుంది. మిగతా ప్రాజెక్టుల వద్ద కూడా భారీ మోటార్లు ఉండటంతో విద్యుత్‌ వినియోగం పెరుగుతోంది. దీంతో బిల్లు బకాయిలు సైతం పేరుకుపోతున్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో మొత్తం 15 మోటార్లుండగా.. ఒక్కో మోటార్‌ 30 మెగావాట్ల విద్యుత్‌ వినియోగంతో నడుస్తుంది. నెట్టెంపాడులో ఏడు మోటార్లకు ఒక్కో మోటార్‌ 17 మెగావాట్లతో నడుస్తుంది. భీమా ఫేస్‌ 1, ఫేస్‌ 2 ఎత్తిపోతల్లో ఒక్కో మోటార్‌ 12 మెగావాట్లతో మూడు నడుస్తాయి. కోయిల్‌సాగర్‌ లిఫ్ట్‌కు 5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు మోటార్లు నడుస్తాయి. వీటి ద్వారా మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా కూడా జరుగుతోంది.

కోట్లలో విద్యుత్‌ బకాయిలు
ప్రతినెలా వాడకాన్ని బట్టి రూ.50 లక్షల నుంచి 50 కోట్ల వరకు విద్యుత్‌ బకాయిలు అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేటా కేటాయిస్తున్న నిధులు ప్రాజెక్టుల నిర్వహణ పనులకే సరిపోవడం లేదు. పెరుగుతున్న ధరలు, యంత్రాల కొనుగోలు, డ్రిల్లింగ్‌ తదితర పనుల కోసం కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి. టన్నెల్‌ పనులు మందకొడిగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్‌ పెండింగ్‌ పనులకే సరిపోతున్నాయి తాజా నిర్వహణ భారం గా మారింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ బకాయి లు చెల్లించి ప్రాజెక్టు నిర్వహణకు సహకరించాలని పలు పార్టీలు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వం అధిక నిధులు కేటాయించకపోవడంతో సాగునీటి ప్రాజెక్టు లు పూర్తి కావడం లేదు. దాంతోపాటు విద్యుత్‌ బిల్లులకు ప్రత్యేక నిధులేమీ ఇవ్వడం లేదు. దాంతో బకాయి లు భారీగా పేరుకుపోతున్నాయి. ప్రధానంగా కల్వకుర్తి, పాలమూరు -రంగారెడ్డి, ఎస్‌ఎల్బీసీ పనులపై దృష్టి పెట్టి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి.

ప్రాజెక్టుల బడ్జెట్‌ నుంచే విద్యుత్‌ బకాయిలు నరసింహారెడ్డి, ఎస్సీ- నాగర్‌కర్నూల్‌ జిల్లా
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేటా కేటాయించే బడ్జెట్‌ నుండే విద్యుత్‌ బకాయిలను చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు వివిధ తాగు సాగునీటి ప్రాజెక్టులకు రూ.4,564 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉంది. ప్రతినెలా పెనాల్టీ కింద రూ.23 కోట్లు ప్రభుత్వం అదనంగా చెల్లించాల్సి వస్తోంది.

బకాయిలు ఇలా..
మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీంలో ఉన్న ఎల్లూరు లిఫ్టుకు రూ.2,160,00,36,346 కోట్ల విద్యుత్‌ బకాయిలు చెల్లించాల్సి ఉంది. జొన్నల బొగుడకు రూ.1,479,88,85,094 కోట్లు, నార్లాపూర్‌కు రూ.67,65,39,468 కోట్లు, కుమ్మెరకు రూ.47,04,27,803 కోట్లు, శాయిన్‌పల్లి రూ.1,69,76,532 కోట్లు, మంచాలకట్ట(వి) రూ.73,02,345 కోట్లు, తీగలపల్లి-కోడేరులో రూ.1,895,37,480 కోట్లు, పసుపుల(వి) రూ.9,72,30,726 కోట్లు, కల్వకుర్తిలో రూ.23,55,30,730 కోట్లు, రంగాపూర్‌ రూ.3,71,14,777 కోట్లు, మన్ననూరు రూ.2,56,52,486 కోట్లు, ఎల్లూరు(వి) రూ.748,51,72,948 కోట్ల విద్యుత్‌ బకాయిలున్నాయి. మొత్తం రూ.4564,04,06,734 కోట్ల బకాయిలు ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -