26న 15వేల మంది యువ కమ్యూనిస్టులతో
ఖమ్మంలో జనసేవాదళ్ ర్యాలీ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పేద, ధనిక అంతరాల తొలగింపు సోషలిస్టు వ్యవస్థతోనే సాధ్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నొక్కి చెప్పారు. ప్రజల భవిష్యత్తు, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆర్థిక న్యాయం, తదితరాలు ఆ వ్యవస్థతోనే సాధ్యమన్నారు. ఇప్పుడు యూరప్ దేశాల్లో కమ్యూనిస్టుల గాలి వీస్తున్నదనీ, అది ప్రపంచవ్యాప్తమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నేపాల్‌లోని వామపక్ష పార్టీలు ఐక్యం కావడం రానున్నది సోషలిస్టు వ్యవస్థే అని చెప్పడానికి నిదర్శనమని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో జనసేవా దళ్ రాష్ట్ర సమితి కన్వీనర్ పంజాల రమేష్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ..శ్రీశ్రీ చెప్పినట్టు సోషలిస్టు వ్యవస్థ కోసం నవయుగ దూతలుగా యువత దూసుకురావాలని పిలుపునిచ్చారు. సీపీఐ ఆవిర్భవించి వందేండ్లు అవుతున్న సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామనీ, అదే రోజు ఖమ్మంలో 15 వేల మంది యువ కమ్యూనిస్టులతో జనసేవాదళ్ ర్యాలీ చేపట్టనున్నామని ప్రకటించారు. మన దేశం కార్పొరేట్ శక్తుల ఆధీనంలోకి వెళ్తుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పేదలకు న్యాయం జరగాలంటే, ఉత్పత్తి సాధనాలు ప్రజల చేతుల్లోకి రావాలన్నారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగం ఇచ్చిన హక్కులను అమలు చేయడమే కాకుండా ఆర్థిక సమానత్వం రావాలని ఆకాంక్షించారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, ఎం.బాలనరసింహ, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వల్లివుల్లా ఖాద్రి, ధర్మేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
అంతరాల తొలగింపు సోషలిజంతోనే సాధ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



