Sunday, June 1, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఅవమానకరంగా వైదొలిగిన ఎలన్‌ మస్క్‌ !

అవమానకరంగా వైదొలిగిన ఎలన్‌ మస్క్‌ !

- Advertisement -

ఎలన్‌మస్క్‌, ప్రపంచ కుబేరుడు, అమెరికా అధినేత ట్రంప్‌ మానసపుత్రుడు, స్వల్పకాలమే అయినా అసాధారణ అధికారాలను వెలగబెట్టిన అత్యంత వివాదాస్పద వ్యక్తి. తన 130 రోజుల నియామక వ్యవధి కంటే రెండు రోజులు ముందుగా పదవి నుంచి తప్పుకున్నాడు. గడువుకంటే ముందా వెనుకా అన్నది కాదు తప్పుకున్న తీరే అత్యంత అవమానకరంగా జరిగిందన్నదే చర్చ. మితవాద భావజాల పరంగా ఇతరంగా ట్రంప్‌ను ఆకాశానికి ఎత్తటమే కాదు, రిపబ్లికన్‌ పార్టీ విజయానికి 30 కోట్ల డాలర్లకు పైగా నిధులు ఇచ్చిన మస్క్‌ రాజీనామా చేసే ముందు కనీసం ట్రంప్‌తో కూడా చెప్పలేదని వార్తలు. ఇది రాసిన సమయానికి అసలైన కారణాలు ఇంకా తెలియలేదు. ప్రభుత్వశాఖల్లో అసమర్దత, అనవసరపు ఖర్చును తగ్గించేందుకు ఏర్పాటు చేసిన శాఖ ”డోజ్‌ ” సలహాదారుగా మస్క్‌ తీసుకున్న చర్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అంతా సజావుగా ఉంటే అదే పదవిలో లేదా మరొకదానిలో ఎలన్‌ మస్క్‌ను ట్రంప్‌ కొనసాగించి ఉండేవాడు. ప్రారంభం నుంచి దూకుడుతో వ్యవహరించి సాధించిందేమీ లేకపోగా ఉద్యోగులు, సాధారణ పౌరుల నుంచి తీవ్ర అసంతృప్తి, కొందరు మంత్రులు, ఉన్నతాధికారులతో దెబ్బలాటలు చివరికి ఈ తలనొప్పి ఏమిటిరా బాబూ అని రిపబికన్‌ పార్టీ నేతలు తలలు పట్టుకొనేంతగా రెచ్చిపోయాడంటే అతిశయోక్తి కాదు. పేనుకు పెత్తనమిస్తే ఏం జరుగుతుందో తెలిసినప్పటికీ ఇలాంటి వారికి అధికారమిస్తే ఏవిధంగా వ్యవహరిస్తారో ఒక్క అమెరికాకే కాదు, ప్రపంచ దేశాలన్నింటికీ ఒక గుణపాఠం నేర్పాడు.
రెండులక్షల కోట్ల డాలర్లకు పైగా బడ్జెట్‌లోటును తగ్గిస్తామని ఎన్నికల్లో చెప్పిన ట్రంప్‌ ఐదు నెలలు కూడా గడవక ముందే 2.3లక్షల కోట్ల అదనపులోటుకు దారితీసే పన్నుల బిల్లును ప్రతిపాదించాడు. దాన్ని బహిరంగంగా తూర్పారపట్టిన మరుసటి రోజే ఎలన్‌ మస్క్‌ తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. లేకపోతే ట్రంపే తొలగించి ఉండేవాడేమో ! పొదుపు పేరుతో అనేక సంక్షేమ పధకాలకు కోత ప్రకటించాడు. బెదిరించి, కొందరిని పొమ్మనకుండానే పొగబెట్టి, మరి కొంత మందికి పాకేజ్‌లు ఇచ్చి ఇరవైమూడు లక్షల మంది ఫెడరల్‌ ఉద్యోగుల్లో 2.6లక్షల మందిని ఇంటికి పంపించాడు. 1930దశకంలో తలెత్తిన మహా ఆర్థిక సంక్షోభంలో సర్వం కోల్పోయిన జనం వీధుల్లో గుడారాలు వేసుకొని తలదాచుకున్నారు, వాటిని నాటి అధ్యక్షుడు హౌవర్‌ పేరుతో వ్యంగ్యంగా పిలిచినట్లే, మస్క్‌ దెబ్బకు వీధులపాలనై వారు కూడా అదే మాదిరి నిరసన తెలుపుతూ వేసిన గుడారాలకు మస్క్‌ పేరు పెట్టారు. ట్రంప్‌-మస్క్‌ విధానాలను నిరసిస్తూ ఏప్రిల్‌ నెలలో లక్షలాది మంది కార్మికులు దేశమంతటా ప్రదర్శనలు జరిపారు. మస్క్‌ టెస్లా కంపెనీ కార్యాలయాలు, ఫ్యాక్టరీల ముందు నిరసన ప్రదర్శనలు చేశారు. వ్రతం చెడ్డా ఫలం దక్కిందా అంటే కెేవలం 17,500 కోట్లు మాత్రమే తగ్గించగలిగినట్లు వార్తలు. తాను పొదుపు చేస్తుంటే అధ్యక్షుడు ట్రంప్‌ 2.3లక్షల కోట్ల డాలర్ల లోటును పెంచే పన్నుల బిల్లును తెచ్చినట్లు ఒక టీవీలో బహిరంగంగా మస్క్‌ తూర్పారబట్టాడు.
నిజానికి మస్క్‌ గత కొద్ది వారాలుగా వ్యవహరించిన తీరు, పెట్టిన ఎక్స్‌ పోస్టులు, మీడియాలో స్పందనలను చూస్తే పదవిలో నిలిచేరకం కాదని అనేక మంది భావించారు. ఊరంతా కావమ్మ మొగుడు అంటే నేను కూడా కామోసు కామోసు అనుకొని కాపురం చేశాను, ఇప్పుడు కాదంటున్నారు గనుక నా కర్రా బుర్రా ఇస్తే నా దారిన నేపోతా అన్న ఒక సన్యాసి కథ తెలిసిందే. ఎలన్‌ మస్క్‌ను కూడా అమెరికా ఆర్థిక ఇబ్బందులను పాదుపు, సామర్ధ్యంతో గట్టెక్కించే దూత అని భావించారు. అయితే ఎలన్‌ మస్క్‌ సన్యాసి కాదు గనుక తన టెస్లా, స్టార్‌లింక్‌, స్పేస్‌ఎక్స్‌ వంటి కంపెనీలను చూసుకుంటా రోజంతా అక్కడే ఉంటా అవసరమైతే రాత్రుళ్లు కూడా అక్కడే పడుకుంటానంటూ ముందుగానే వెల్లడించాడు. మస్క్‌ చివరికి తన గాంగ్‌ నుంచి ఇలా నిష్క్రమిస్తాడని ట్రంప్‌ కూడా ఊహించి ఉండడు. ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకొనే వస్తువుల మీద ప్రతికూల పన్నులు వేసి జనాల జేబులను గుల్లచేసే ట్రంప్‌ విధానాలకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నది. ప్రకటించిన పన్నులను అమలు చేస్తే జనంలో వ్యతిరేకత, తోకముడిస్తే ప్రపంచంలో చులకన. డోనాల్డ్‌ ట్రంప్‌ ఇరకాటంగా ఇది కనిపించినప్పటికీ అమెరికా పెట్టుబడిదారీ విధానం ఎదుర్కొంటున్న సంక్షోభంలో ఒక అంశంగా మస్క్‌ ఉదంతాన్ని చూడవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -