భారత్‌లో అరగంటకో మిలియనీర్ కుటుంబం
2021లో ఈ కుటుంబాల సంఖ్య 4.58 లక్షలు
2025లో 8.71 లక్షలకు పెరిగిన వైనం
గత నాలుగేండ్లలో ఇదీ పరిస్థితి
ముంబయిలో అత్యధికంగా 1.42 లక్షల కుటుంబాలు
ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, బెంగళూరు : హురున్ ఇండియా వెల్త్ రిపోర్ట్
ముంబయి : మోడీ పాలనలో భారత్‌లో సంపన్న కుటుంబాల సంఖ్య ఏటికేడూ పెరిగిపోతున్నది. గత నాలుగేండ్లలలో డాలర్ మిలియనీర్ (రూ.8.5 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నవి) కుటుంబాల సంఖ్య దాదాపు రెట్టింపైంది. సగటున ప్రతి 30 నిమిషాలకు కుటుంబం ఈ స్థాయికి చేరుకున్నది. భారత్‌లో ఇలాంటి కుటుంబాల సంఖ్య 2021లో 4.58 లక్షలుగా ఉంటే.. 2025లో అది కాస్తా 8.71 లక్షలకు చేరుకున్నది. ఈ డాలర్ మిలియనీర్ కుటుంబాల ఆస్తులు కనీసం రూ.8.5 కోట్లుగా (అంటే 1 మిలియన్ యూఎస్ డాలర్) ఉంటాయి. గత దశాబ్ద కాలంలో దేశంలో క్రమంగా పెరుగుతోన్న ఆదాయ అసమానతల గురించి ఈ సంఖ్య తెలియజేస్తున్నది. మెర్సిడెస్ బెంజ్-హురున్ ఇండియా వెల్త్ రిపోర్ట్ 2025 ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక సమాచారం ప్రకారం.. భారత్‌లో ఈ సంపన్న కుటుంబాలు లేదా ఇండ్ల సంఖ్య 0.31 శాతంగా ఉన్నది. దేశంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న మహారాష్ట్రలో కోటీశ్వరులైన ఇలాంటి కుటుంబాల సంఖ్య అధికంగా ఉన్నది. ఇక్కడ మొత్తం 1,78,600 మిలియనీర్ కుటుంబాలు ఉన్నాయి. 2021 నుంచి 194 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఒక్క ముంబయిలోనే ఈ కుటుంబాల సంఖ్య 1,42,000గా ఉండటం గమనార్హం. ఇక ఢిల్లీ 79,800 కుటుంబాలతో రెండో స్థానంలో ఉన్నది. కర్నాటక రాజధాని బెంగళూరు 31,600 కుటుంబాలతో మూడో స్థానంలో ఉన్నది. ఇలాంటి సంపన్న కుటుంబాలున్న అత్యధికంగా ఉన్న నగరాల జాబితాలో అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నై, పూణే, హైదరాబాద్ వంటి నగరాలు ఉన్నాయి.
ఈ కుటుంబాల సంఖ్య 20 లక్షలకు చేరొచ్చు
ఈ నివేదికను రూపొందించటంలో సహకరించిన మెర్సిడెస్-బెంజ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంతోశ్ అయ్యర్ మాట్లాడుతూ.. హురున్ గణాంకాలు దేశ సంపద సృష్టి, విలాసవంతమైన వినియోగ విధానాల నాడిని ప్రతిబింబిస్తాయని చెప్పారు. కాగా బలమైన ఈక్విటీ మార్కెట్లు, పెరుగుతున్న బంగారం ధరలు, లగ్జరీ వినియోగం కారణంగా కోటీశ్వరులైన కుటుంబాల పెరుగుదలకు దోహదపడుతున్నది. 2021-25 మధ్య నిఫ్టీ 70 శాతం పెరిగింది. బంగారం ధరలు రెండింతలయ్యాయి. ఇక రాబోయే దశాబ్ద కాలంలో దేశంలో మిలియనీర్ కుటుంబాల సంఖ్య 20 లక్షలకు చేరుకోగలదని నివేదిక అంచనాగా హురున్ ఇండియా వ్యవస్థాపకులు, ప్రధాన పరిశోధకులు అనాస్ రెహమాన్ జునైద్ తెలిపారు.