– చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి
– మృతదేహంతో డెయిరీ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
నవతెలంగాణ -హయత్ నగర్
నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ (నార్ముల్-మదర్ డెయిరీ) హయత్‌నగర్ ప్లాంట్‌లో విధుల్లో ఉంటూ ఉద్యోగి కుప్పకూలి చనిపోయిన సంఘటన శనివారం జరిగింది. ఈ ఘటనతో మృతుడి బంధువులు డెయిరీ ఎదుట ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం తులసిగారి బాల నర్సింహ్మ (46) నార్ముల్ మదర్ డెయిరీలో ప్లాంట్ ఆపరేటర్ విభాగంలోని ప్రీ-ప్యాక్ సెక్షన్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం విధుల్లో ఉండగా అకస్మాత్తుగా కుప్పకూలి పడిపోయాడు. గమనించిన తోటి ఉద్యోగులు వెంటనే వనస్థలిపురంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మలక్‌పేటలోని యశోద ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు తీవ్రమైన బ్రెయిన్ స్ట్రోక్‌తో పరిస్థితి సీరియస్‌గా ఉందని, వెంటనే ఆపరేషన్ చేయాలని భారీగా ఖర్చు అవుతుందని తెలిపారు. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించాలని సూచించగా… అక్కడ నర్సింహ్మ చికిత్స పొందుతూ శనివారం ఉదయం చనిపోయారు.
జీతాలందక ఆర్థిక ఒత్తిళ్లతో సతమతమయ్యాడు : కుటుంబ సభ్యులు
మృతుడి బంధువులు గాంధీ ఆస్పత్రి నుంచి మృతదేహంతో డెయిరీ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. గత కొన్ని నెలలుగా నార్ముల్ మదర్ డెయిరీలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం వల్ల ఉద్యోగులకు వేతనాలు ఆపేశారని, నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కుటుంబ పోషణ భారమై ఆర్థిక ఒత్తిడికి గురై బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. బాల నర్సింహ్మ మృతికి డెయిరీ యాజమాన్యమే కారణమని ఆరోపించారు. ఆయన కుటుంబానికి న్యాయం చేసే వరకు కదిలేది లేదని భీష్మించారు. డెయిరీ లోపలికి వెళ్లడానికి గేట్లు తోసుకుని వెళ్లేందుకు కుటుంబసభ్యులు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆర్థిక ఒత్తిడి తట్టుకోలేకనే ఆయన బ్రెయిన్‌స్ట్రోక్ కు గురయ్యారని, యాజమాన్యం తన భర్తను బలితీసుకుందని మృతుడి భార్య ఆవేదన వ్యక్తం చేశారు.
చైర్మెన్ హామీ మేరకు ఆందోళన విరమణ
బాధిత కుటుంబ సభ్యులు డెయిరీ ముందు ఆందోళన చేస్తున్న సమయంలో చైర్మెన్ మధుసూదన్ రెడ్డి వారికి తక్షణ సాయం కింద రూ.50 వేలు అందజేశారు. అలాగే సోమవారం జరిగే బోర్డు మీటింగ్‌లో బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామని, అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామన్న హామీ మేరకు వారు ఆందోళన విరమించారు.
నార్ముల్ డెయిరీలో విధుల్లోనే కుప్పకూలిన ఉద్యోగి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



