కాలేజీలో విషాద ఛాయలు..
నవతెలంగాణ – నసురుల్లాబాద్
కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ నసురుల్లాబాద్ మండల పరిధిలోని దుర్కి ఎస్ ఆర్ ఎన్ కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న షేక్ అహ్మద్ అనే (50) రికార్డ్ అసిస్టెంట్ కళాశాల రెండంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా తోటి ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. అయ్యో ఎంత కష్టం వచ్చిందో పాపం అంటూ సహాయ ఉద్యోగులు కన్నీరు నీరయ్యారు. శనివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సహాయ ఉద్యోగులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరి మండలం దోమల ఎడ్గి గ్రామానికి చెందిన షేక్ హైమద్ గతంలో గ్రామ రెవెన్యూ వీఆర్ఏగా విధులు నిర్వహిస్తూ.. 2022 ఆగస్టు మాసంలో బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ గా బదిలీపై వచ్చారు.
అప్పటినుంచి బాన్సువాడ పట్టణంలో అద్దెకు ఉంటూ బాన్సువాడ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నారని, గత కొన్ని నెలల క్రితం ఉన్న ఒక్క కొడుకు పెళ్లి ఘనంగా నిర్వహించాడని వివరించారు. గత 15 రోజులుగా వారి కుటుంబ సభ్యుల మధ్య ఏదో సమస్యతో బాధపడేవాడని, రెండు రోజుల నుంచి కళాశాలలో భయంతో విధులు నిర్వహిస్తున్నాడని తెలిపారు. శనివారం కుటుంబ సమస్య పేరుతో బాన్సువాడ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి తన బాధను చెప్పినట్లు సమాచారం. ఏదైనా సమస్య ఉంటే కూర్చుండి మాట్లాడుకోవాలని సహాయ ఉద్యోగులు సలహాలు ఇచ్చారు.
అయితే మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఫోన్ మాట్లాడుకుంటూ భవనం పైకి ఎక్కి ఫోన్ మాట్లాడుతున్నట్లు సహాయ ఉద్యోగులు తెలిపారు. ఫోన్ లో ఆక్రోషం గా మాట్లాడుతూ.. రెండు అంతస్తుల భవనం నుంచి ఒకేసారి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. దీనితో తోటి ఉద్యోగులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించారు. మృతి చెందిన వ్యక్తి గత సంవత్సరం నుండి అనారోగ్య కారణాలతో అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోయే వాడని, కుటుంబ సభ్యులతో ఎలాంటి సమస్యలు లేవని, అనారోగ్య కారణలతో, పాటు ప్రమాదవశత్తు తన భర్త చనిపోయాడని భార్య గౌసియా బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న వివరాలు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



