మున్సిపాలిటీల్లో నిర్ణయాత్మక శక్తులుగా ఉద్యోగ ఓటర్లు
గ్రామీణ ప్రాంత మున్సిపాలిటీల్లోనూ వారిదే ఆధిపత్యం
సింగరేణి ప్రాంతాల్లో కార్మిక, ఉద్యోగులు ముఖ్యం
ప్రసన్నం.. కుదరకపోతే భయభ్రాంతులకు గురి చేస్తున్న పార్టీలు
మున్సిపల్ ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లు, వారి కుటుంబ సభ్యుల మద్దతు అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో అత్యంత కీలకంగా మారాయి. క్షేత్రస్థాయిలో ఉద్యోగుల ఓటింగ్ సరళిని ప్రభావితం చేసే అంశాలపై రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఉద్యోగులు, కార్మికుల మద్దతు పొందేందుకు ప్రాధాన్యతనిస్తున్నాయి. సమన్వయకర్తల నియామకం ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నాయి.
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మున్సిపాలిటీ పరిధిలో నివసించే ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉద్యోగుల ఓట్లు, వారి ఓటింగ్ నిర్ణయాలు గెలుపు లో కీలకపాత్ర పోషిస్తాయి. ఉద్యోగుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కూడా వారి నిర్ణయం మేరకు ఓటు వేసే అవకాశం ఉండటంతో, ఇది ఒక పెద్ద ఓటు బ్యాంకుగా మారింది. అభ్యర్థుల ఎంపికలో ఉద్యోగ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సానుకూల ఓటును ఆకర్షించేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఇచ్చి పార్టీలు టికెట్లను కేటాయించడాన్ని బట్టి చూస్తే మున్సిపల్ ఎన్నికల్లో ఉద్యోగుల ఆవశ్యకత తెలుస్తోంది.
గనుల ప్రాంతాల్లో కార్మికుల ఓట్లే కీలకం
సింగరేణి ప్రాంత మున్సిపాలిటీల్లో కార్మికలోకమే కీలకంగా మారనుంది. ప్రస్తుతం సింగరేణి వ్యాప్తంగా 40వేల మంది కార్మికులు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం సగటున దాదాపు 1.6 లక్షల నుంచి 2 లక్షల ఓట్ల వరకు సింగరేణి ఏరియాల్లోని మున్సిపాలిటీల్లో ఉన్నాయి. భూపాలపల్లి, ఇల్లెందు, తదితర పట్టణాల్లో దాదాపు సగం సింగరేణి కార్మికుల కుటుంబ సభ్యుల ఓట్లే ఉండనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని మున్సిపాలిటీలతోపాటు రామగుండం నగరపాలక సంస్థ ఎన్నికల్లోనూ కార్మిక శక్తే గెలుపోటములను నిర్ణయించనుంది.
సింగరేణి కార్మికులు, ఉద్యోగులు ఇతర వర్గాల ఓటర్ల పై కూడా ప్రభావం చూపించే ప్రధాన శక్తిగా ఉండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు వీరిని ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇల్లెందులో 4వేలు, భూపాలపల్లిలో 5,600 మంది కార్మికులు ఉన్నారు. మొత్తం చూస్తే 20 వేల వరకు సింగరేణి కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఓట్లు ఉండనున్నాయి. దాంతో పురపోరులో ఏ పార్టీ గెలవాలన్నా సింగరేణి కార్మికులే ప్రధానం కానున్నారు. సంగారెడ్డి, జహీరాబాద్, ఇస్నాపూర్, గడ్డపోతారం, సదాశివపేట వంటి మున్సిపాలిటీల్లోనూ పారిశ్రామిక కార్మికవర్గం పెద్దసంఖ్యలో ఓటర్లుగా ఉన్నారు.
ఇతర మున్సిపాలిటీల్లోనూ ప్రభావితం చేసే స్థాయిలో..
రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని మున్సిపాలిటీలతోపాటు రామగుండం కార్పొరేషన్లో సింగరేణి కార్మికులు కీలకమయ్యే అవకాశం ఉంది. వీటన్నింటిలో సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. వీరు ప్రభావం చూపించే బంధువుల ఓట్లూ ఉన్నాయి. సింగరేణి ప్రాంతంలోని మణుగూరు, మందమర్రి మున్సిపాలిటీల్లో ఏజెన్సీ వివాదంతో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడగా.. భూపాలపల్లి, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, బెల్లంపల్లి, నస్పూర్, క్యాతన్పల్లి మున్సి పాలిటీలతోపాటు రామగుండం నగరపాలక సంస్థకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటితో పాటు మంచిర్యాల, చెన్నూరు వంటి మున్సిపాలిటీల్లోనూ కొద్దోగొప్పో సింగరేణి కార్మికుల ప్రభావం ఉండనుంది. నామినేషన్ల ఘట్టం ప్రారంభమైనప్పటి నుంచి పట్టణంలోని అన్ని కార్మికవాడల్లో నాయకులు.. ఈ వర్గాన్ని ప్రసన్నం చేసుకుంటున్నారు. బరిలో ఉన్న అభ్యర్థులు తమను పరిచయం చేసుకుంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ముఖ్యంగా పార్టీల నాయకులతోపాటు ఆయా కార్మికసంఘాల నాయకులు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఏదులాపురం మున్సిపాలిటీలో..
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఈటీపీడబ్ల్యూ ఏ) లెక్కల ప్రకారం 32 వార్డుల్లో మొత్తం 45 వేల మందికి పైగా ఓటర్లు ఉండగా వీరిలో 6,374మంది ఉద్యోగస్తుల కుటుంబాల ఓట్లు ఉన్నాయి. వీరుకాక అనేకమంది కాంట్రాక్టు, ప్రయివేటు ఉద్యోగులు ఈ మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్నారు. వీరంతా చుట్టుపక్కల ఉన్న ఓటర్లను ప్రభావితం చేయగలస్థాయిలో ఉన్నారు. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే శక్తులుగా ఉన్న ఉద్యోగ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు తంటాలు పడుతున్నారు.
ఉద్యోగులతో సమావేశాలు
ఉద్యోగులతో సమావేశాలు నిర్వహిస్తూ.. వారికి పలు రకాల హామీలు ఇస్తున్నారు. మౌలిక వసతుల కల్పనతో పాటు కమ్యూనిటీహాల్స్, క్రీడా ప్రాంగణాలు, ఓపెన్ జిమ్ లు, వాకింగ్ ట్రాక్‌లు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, వాటిలో వసతుల కల్పన అనేక హామీలిస్తూ మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నిచోట్ల ప్రధాన పార్టీలు తమకు ఓటేయరని భావించిన ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. లేఅవుట్‌కు విరుద్ధంగా వేసిన వెంచర్లు, అందులో నిర్మించుకున్న ఇండ్లు, కాలువలపై ఎఫ్టీఎల్, బఫర్‌జోన్లలో నివాసాలు, ఇంటి నిర్మాణ అనుమతులు, వాటిలోని లోటుపాట్లు అన్నింటినీ పరిశీలిస్తూ తమకు ఓటు వేయకపోతే తదనంతర పరిణామాలపై హెచ్చరికలు జారీచేస్తూ ఓటర్లను లోబరుచుకునే ప్రయత్నాలు సైతం కొనసాగుతున్నాయనే ఆరోపణలున్నాయి.
నిర్ణయాత్మక శక్తిగా ఉద్యోగుల ఓట్లు
ప్రతి మున్సిపాలిటీలోనూ నిర్ణయాత్మక శక్తిగా ఉద్యోగుల ఓట్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి అనేక మంది వలస వచ్చి పట్టణ ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వీరిలో అత్యధికలు ప్రభుత్వ ఉద్యోగాలుగా ఉండగా.. మరికొందరు ప్రయివేట్ జాబులు చేస్తున్నారు. వీరిలో టీఎన్జీవోస్, నాలుగో తరగతి ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు, పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. దాదాపు ప్రతి మున్సిపాలిటీలోని 1500 ఓట్లు ఉన్న ఒక్క వార్డులో ఇటువంటి ఉద్యోగుల ఓట్లు సింహభాగం ఉన్నాయి. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో సింగరేణి ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల ఓట్ల సంఖ్య భారీగా పెరిగింది. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోనూ ఉద్యోగ ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంది.



