మున్సిపల్ భవనానికి స్థలం సేకరించండి…
కమీషనర్ నాగరాజు కు సూచించిన ఎమ్మెల్యే జారే..
నవతెలంగాణ – అశ్వారావుపేట : మున్సిపాల్టీ పరిధిలోని ఖాలీ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని,పరిపాలనా భవనానికి కావాల్సిన స్థలం ను సేకరించాలని మున్సిపల్ కమీషనర్ బీ.నాగరాజు ను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదేశించారు. గురువారం ఆయన మండల పరిషత్ పూర్వ కార్యాలయం,సామాజిక ఆరోగ్య కేంద్రం,డబుల్ బెడ్ రూం ల ప్రాంగణాలు ను సందర్శించారు. మండల పరిషత్ పూర్వ కార్యాలయం ప్రాంగణంలో మున్సిపాల్టీ పరిపాలనా కార్యాలయం నిర్మించడానికి ఉన్నతాధికారుల నుండి ఆమోదం పొందాలని కమీషనర్ నాగరాజు కు సూచించారు.
పూర్వ సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో వ్యాపార సముదాయం నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని,నందమూరి నగర్ లో ఉన్న డబుల్ బెడ్ రూం లు పంపిణీకి కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో రూ.6 కోట్ల రూపాయల ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను అందజేయడం జరిగిందన్నారు.నియోజకవర్గంలో సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు గా వివరించారు. అదేవిధంగా పెదవాగు ప్రాజెక్టు రింగు బండ నిర్మాణ పనులను పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
రూ. 19 కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.ప్రాజెక్టుకు వచ్చే ఫ్లడ్ ను అంచనా వేస్తూ ఎగువ ప్రాంతాల్లో ఉన్న చెరువుల మరమ్మతుల ను కూడా చేపడుతున్నట్లు గా ఆయన తెలిపారు. ప్రాజెక్టుకు ఉన్న ఎడమ, కుడి కాలువల మరమ్మతులు చేపడుతూ రైతాంగానికి సాగునీరు అందిస్తామన్నారు. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో పూర్తిస్థాయి మరమ్మత్తుల కు కొంత మేర జాప్యం జరుగుతుందన్నారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం రానుందని పేర్కొన్నారు.
హైదరాబాద్ సభను విజయవంతం చేయండి:
హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో గ్రామస్థాయి నాయకులతో నిర్వహించబోయే సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రామకృష్ణ, చైర్మన్ చిన్నంశెట్టి సత్యనారాయణ, నాయకులు జూపల్లి రమేష్, చెన్నకేశవరావు, ప్రమోద్, నిండా హరిబాబు తదితరులు పాల్గొన్నారు.