కేంద్రబడ్జెట్ సందర్భంగా బుధవారం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేసిన ప్రసంగం వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్నది. వికసిత్ భారత్ చుట్టూ ‘అభివృద్ధి’ని అమర్చి అసలు విషయాలను పక్కనపెట్టింది. గత పదేళ్లలో దేశంలోని సుమారు ఇరవై ఐదు కోట్ల ప్రజలు పేదరికం నుంచి బయపడ్డారన్నది ఆమె ఉపన్యాసంలోని ప్రధానమైన అంశం. దీన్ని ఏ విధంగా లెక్కించారో చెప్పలేదు. ఒకపక్క ప్రపంచ ఆకలి సూచీ ప్రకారం ఆకలిగొన్న జనాభా అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత దేశం ఎగబాకింది. ఇప్పుడది నూట పదిహేను దేశాలకు గాను వందవ స్థానానికి చేరింది. కానీ, మన దేశంలో పేదరికం దాదాపు అదృశ్యం అయిపోయినట్టు లెక్కలు చూపడం ఆందోళనకరం. గణాంకాల ఆధారంగా చెప్పబడే పేదరికం సామాజిక వాస్తవాలను సాక్షాత్కరించదు.
ఆరోగ్యం, విద్య, మంచి నీరు, ఆహారం, ఆర్థిక భద్రత వంటి అంశాలను కలిపి పేదరికాన్ని నిర్వచించాలి. నేటికీ ప్రజానీకంలో అత్యధిక శాతం నెలనెలా వచ్చే ఐదుకిలోల ఉచిత బియ్యం కోసం ఎదురు చూడటం దేశంలోని వాస్తవ పరిస్థితులకు ప్రతిబింబం. దేశంలోని తొంభై శాతం ప్రజల సంపదంతా పదిశాతం కుబేరుల వద్ద పోగై ఉన్నది. ఇంత తీవ్రమైన అస మానతలకు కారణం పెట్టుబడిదారి ప్రయోజనాల్ని పాలకులు నెరవేర్చిన ఫలితం! ఇంకా.. జలజీవన్ కింద ప్రజలందరికీ తాగునీరందిస్తున్నామని చెప్పారు. మారుమూల పల్లెలే కాదు, స్వచ్ఛమైన నీరందని పట్టణాలు, నగరాలు కూడా దేశంలో ఉన్నాయి. ఇటీవల నీరు కలుషితమై మధ్యప్రదేశ్‌లో పదిహేను మందికిపైగా మరణించారు. మహారాష్ట్రలో కొంతమంది ఆస్పత్రిపాలయ్యారు. ఈ రెండు రాష్ట్రాలను పాలించేది ‘డబులింజన్’ సర్కార్‌లే. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే వాటిని కప్పిపుచ్చడం సమంజసమేనా? దేశంలో పదికోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్టు చెప్పారు. మరి గ్యాస్ ధర ఎందుకు పెంచారు? బీజేపీ అధికారంలోకి రాక ముందు రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర తాజాగా రూ. వెయ్యికి ఎకబాగింది. దీని గురించి మాట్లాడకుండా గ్యాస్ కనెక్షన్ల గురించి మాట్లాడం హాస్యాస్పదం. పెరిగిన నిత్యాసవరాల ధరలు సామాన్యులకుముచ్చెమటలు పట్టిస్తున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. ”ఏం కొనేటట్టు లేదు..ఏం తినేటట్టు లేద’న్న పాట ప్రజల జీవితంలో భాగమైపోయింది. దీని గురించి ఎవరూ మాట్లాడరేం? గమ్మత్తయిన విషయమేమంటే? జీఎస్టీ స్లాబుల తగ్గింపుతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని చెప్పుకొచ్చారు. జీఎస్టీని తీసుకొచ్చింది కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టేందుకు. ఉత్పత్తి చేసిన వస్తువులు అమ్ముడుపోక మళ్లీ సవరణలు చేసింది కూడా వారి కోరిక మేరకే! దాన్ని కొనుగోలుశక్తి పెరగడంగా చూపితే ఇంతకన్నా మోసకారితనం వేరే ఉండదు! అయినా ఆ స్లాబులు కూడా సామాన్యుల దరిచేరేవి కావు, అందులోనూ ధనవంతులకే ఉపయోగాలెక్కువ. ధాన్యం ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉన్నామని చెప్పారు. దేశ, విదేశాల నుంచి దిగుమతులు చేసుకుంటున్న ఉత్తత్తుల మాటేమిటి? ట్రంప్ టారిఫ్‌లతో వ్యవసాయానికి ముప్పు ముంచుకొస్తున్న మోడీ మౌనముద్ర వీడలేదు. పైగా ఆకలిచావులు ఆగడం లేదు. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. వారికి ఇస్తామన్న కనీస మద్దతు ధర హామీ ఏమైనట్టు? పంటభూమిలోనే నిలువెత్తు గోయితీసి కప్పిపెట్టారు! అలాగే రాష్ట్రపతి ప్రసంగంలో 2047 నాటికి వికసిత్ భారత్‌గా దేశం రూపుదిద్దుకుంటుందని, ఆ లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.
మరోపక్క దేశాన్ని పట్టిపీడిస్తున్న నిరుద్యోగం ఊసే ఎత్తలేదు. ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ ఎప్పుడో అటకెక్కింది. టీలు, పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమే అన్న వారికి నిరుద్యోగం ఏం కనిపిస్తుంది? పొరుగున ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో పోల్చిన మనదేశంలోనే నిరుద్యోగం ఎక్కువ. ఎనభైమూడు శాతం ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఉద్యోగాలు లేవని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నవి. సెంటర్‌ఫర్ మానిటరింగ్ ఎకానమీ నివేదిక దేశంలో 7.2శాతం నిరుద్యోగం ఉన్నట్టు వెల్లడించింది. వీటన్నింటిని దాచి ఆత్మనిర్భర్ భారత్‌ను వల్లెవేయడం ప్రజల్ని ఏమార్చడమే.
మరీ అన్యాయమైన విషయం ఏమిటంటే? గ్రామీణ ఉపాధి కల్పన కోసం వీబీ జీ రామ్ జీ తీసుకొచ్చినట్టు చెప్పారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి దానిస్థానంలో ఉపాధికి గ్యారంటీలేని పథకాన్ని రూపొందించారు. ఒక హక్కుగా ఉన్న ఉపాధి, పాలకుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేలా చేయడం, దాన్ని గొప్పగా ప్రకటించుకోవడం మోడీ సర్కార్‌కే చెల్లింది. రాష్ట్రపతి ప్రసంగమంతా వికసిత్ భారత్, అభివృద్ధి, భారత్ విజయం, అనే ‘కథనంగా’ సాగింది. సమాజ వ్యధల, ప్రధాన ఆర్థిక సవాళ్లపై సమగ్ర విశ్లేషణ ఇవ్వలేదు. అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ చుట్టూ అధికార ఎజెండాను ప్రతిబింబించింది. సామాజిక సంక్షేమం, నిరుద్యోగం, ఉపాధి అంశాల ప్రాధాన్యతను విస్మరించింది.
వొట్టిమాటలు..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



