Thursday, September 25, 2025
E-PAPER
Homeజాతీయంమోడీ అవినీతి పాలనకు ముగింపు

మోడీ అవినీతి పాలనకు ముగింపు

- Advertisement -

– రాబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యం
– నితీశ్‌ను బీజేపీ మానసికంగా రిటైర్‌మెంట్‌ చేసింది : కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో ఖర్గే కీలక వ్యాఖ్యలు
– సమావేశానికి హాజరైన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

పాట్నా : రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కేంద్రంలో మోడీ ప్రభుత్వ అవినీతి పాలన ముగింపునకు నాంది పలుకుతాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే పేర్కొన్నారు. బీహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ను బీజేపీ నాయకత్వం మానసికంగా రిటైర్‌మెంట్‌ చేసిందని ఆరోపించారు. దీన్ని అది బాధ్యతగా భావిస్తుందని వ్యాఖ్యానించారు. పాట్నాలో జరుగుతున్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రారంభోపన్యాసంలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఖర్గే అధ్యక్షతన పాట్నాలోని సదాకత్‌ ఆశ్రమంలో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ భేటీకి లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ముఖ్య నేతలు హాజరయ్యారు. స్వాతంత్య్రం తర్వాత బీహార్‌లో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. అయితే మన ఓటరు జాబితాను అధికారికంగా ట్యాంపింగ్‌ చేస్తున్న వేళ మన రాజ్యాంగాన్ని, ప్రజస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిజ్ఞ చేయాలని ఖర్గే సూచించారు. ఇలాంటి సమయంలో బీహార్‌లో సీడబ్ల్యూసీ సమావేశాన్ని నిర్వహించడం చాలా అవసరమని తెలిపారు.

ఆ హక్కు కల్పించారు!
మోడీ ప్రభుత్వం దౌత్యపరంగా విఫలమవడం వల్లే మన దేశం అంతర్జాతీయంగా సమస్యలు ఎదుర్కొంటున్నదని ఖర్గే దుయ్యబట్టారు. ఎవరినైతే ప్రధాని తన స్నేహితులుగా చెబుతున్నారో వారే ఇప్పుడు భారత్‌ను సమస్యల వలయంలోకి నెట్టారని ఆరోపించారు. సరిగ్గా 85ఏండ్ల కింద రామ్‌గఢ్‌లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో మొదటి రాజ్యాంగ ప్రతిపాదనను ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేసుకున్నారు. మహాత్మా గాంధీ, పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభారు పటేల్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సహా పలువురు కలిసి దేశ పౌరులకు ”ఒక వ్యక్తి, ఒక ఓటు” హక్కును కల్పించారని ఆయన పేర్కొన్నారు.

సమాధానాలకు బదులు అఫిడవిట్లు
ప్రజాస్వామ్యానికి పునాది నిష్పాక్షికమైన, పారదర్శకమైన ఎన్నికలు అని ఖర్గే అన్నారు. కానీ ఎన్నికల కమిషన్‌ నిష్పాక్షికత, పారదర్శకత గురించి నేడు తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి బదులుగా, ఈసీ అఫిడవిట్లను డిమాండ్‌ చేస్తోందని తెలిపారు. లక్షలాది మంది ప్రజల ఓట్లను తొలగించడానికి దేశవ్యాప్తంగా కుట్ర జరుగుతోందని, బీహార్‌లో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌))ఆఫ్‌ ఎలక్టోరల్‌ రోల్స్‌ను ప్రస్తావిస్తూ ఆయన ఆరోపించారు.

రాహుల్‌ గాంధీకి బహిరంగ మద్దతు
ఓటు దొంగతనం అంటే దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, బలహీనులు, పేదలకు చెందిన రేషన్లు, పెన్షన్లు, మందులు, పిల్లల స్కాలర్‌షిప్‌లు, పరీక్ష ఫీజులను దొంగిలించడమేనని ఖర్గే విమర్శించారు. ‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’ బీహార్‌ ప్రజలలో అవగాహన పెంచిందని చెప్పారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి బహిరంగంగా మద్దతుగా నిలిచారని ఆయన అన్నారు.

అప్పుడు మేం చెప్పిందే ఇప్పుడు..
ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, రాజ్యాంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని బలహీనపరచడం వంటి అనేక సమస్యలతో భారత్‌ పోరాడుతోందని ఖర్గే తెలిపారు. ” రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఇంకా నెరవేరలేదు. యువత ఉపాధి లేకుండా తిరుగుతోంది. నోట్ల రద్దు, జీఎస్టీ వ్యవస్థను పట్టాలు తప్పాయి. ఎనిమిది ఏండ్ల తర్వాత, ప్రధాని తన తప్పును గ్రహించారు. ఇప్పుడు, కాంగ్రెస్‌ పార్టీ మొదటి రోజు నుంచి డిమాండ్‌ చేస్తున్న అదే సంస్కరణలను జీఎస్టీలో ప్రవేశపెట్టారు” అని ఖర్గే అన్నారు. ”మోడీజీ ఇపుడు…మహాత్మా గాంధీ 100 ఏండ్ల నాటి ‘స్వదేశీ’ మంత్రాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

దీనిని కాంగ్రెస్‌ పార్టీ బ్రిటీష్‌ వారిని ఓడించడానికి ఉపయోగించింది. అమెరికా దూరమయ్యాక చైనాకు బహిరంగం గా ఎర్రతివాచీలు పరుస్తున్నారు. గత ఐదేండ్లలో చైనా నుంచి మన దిగుమతులు రెట్టింపు అయ్యాయి” అని ఆయన అన్నారు.

డబుల్‌ ఇంజిన్‌ ఖాళీగా..
నితీశ్‌కుమార్‌కు తిరిగి మద్దతు ఇవ్వడం ద్వారా బీజేపీ జనవరి 2024లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఖర్గే అన్నారు. ”నితీశ్‌ ప్రభుత్వం అభివృద్ధి అంటూ హామీ ఇచ్చింది, కానీ బీహార్‌ ఆర్థిక వ్యవస్థ వెనుకబడి ఉంది. కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ లేకుండా ‘డబుల్‌ ఇంజిన్‌’ ఖాళీగా ఉంది. నిరుద్యోగిత రేటు 15 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఏటా లక్షలాది మంది యువత వలస వెళుతున్నారు. నియామకాల కుంభకోణం కారణంగా యువకులు వీధుల్లో నిరసనలు తెలుపుతున్నారు. పోలీసుల లాఠీచార్జీని ఎదుర్కొంటున్నారు” అని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది.

పాట్నాలో సీడబ్ల్యూసీ సమావేశానికి సీఎం
కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌ మంగళవారం పాట్నా వెళ్లారు. దామోదర రాజనర్సింహ కమిటీ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. బీహార్‌ శాసనసభకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కమిటీ సమావేశం వేదికను ఢిల్లీ నుంచి పాట్నాకు మార్చినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. జాతీయ, రాష్ట్రాల రాజకీయాలపై ఈ సమావేశంలో అగ్రనేతలు చర్చిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -