20 సూత్రాల శాంతి ప్రణాళికకు ఇజ్రాయిల్ ఓకే
హమాస్ అంగీకారమే కీలకం
ఒప్పుకోకపోతే ముప్పు తప్పదని ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్ : గాజాలో సుమారు రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు ఉద్దేశించిన 20 సూత్రాల ప్రణాళికను అమెరికా అధ్యక్ష భవనం విడుదల చేసింది. తద్వారా దీనిపై చెలరేగుతున్న ఊహాగా నాలకు తెర దించింది. గాజాలో యుద్ధాన్ని అంతమొందించడంతో పాటు హమాస్ వద్ద బందీలుగా ఉన్న వారిని విడిపించేందుకు, భవిష్యత్తులో పాలస్తీనా అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం ఈ ప్రణాళికను ప్రతిపాదించింది. ఇజ్రాయిల్, హమాస్ మధ్య తక్షణమే ఘర్షణ ఆగిపోవాలని, గాజా పాలనలో హమాస్‌కు ఎలాంటి పాత్ర ఉండరాదని అమెరికా సూచించింది. ఈ షరతులకు రెండు పక్షాలు అంగీకరిస్తే పోరు ఆగిపోతుంది. హమాస్ వద్ద సజీవంగా ఉన్న ఇజ్రాయిల్ బందీలందరూ విడుదల అవుతారు. ఒకవేల వారు చనిపోయి ఉంటే మృతదేహాలను అప్పగిస్తారు.
బందీల విడుదల ఇలా…
హమాస్ తన వద్ద ఉన్న బందీలను విడుదల చేస్తే దానికి బదులుగా ఇజ్రాయిల్ కూడా 250 మంది పాలస్తీనియన్లను విడిచిపెడుతుంది. వీరు ఇజ్రాయిల్‌లో యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్నారు. అంతేకాక 2023 అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి తన నిర్బంధంలో ఉన్న 1,700 మంది పాలస్తీనియన్లను కూడా ఇజ్రాయిల్ వదిలేస్తుంది. హమాస్ ఒక బందీని వదిలేస్తే దానికి బదులుగా ఇజ్రాయిల్ పదిహేను మంది పాలస్తీనా ప్రజలను విడుదల చేస్తుంది.
దీర్ఘకాలంలో పాలస్తీనాకు రాజ్య హోదా
ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక దశలో పాలస్తీనాకు రాజ్య హోదా ఇవ్వాలని ప్రణాళిక సూచించింది. అయితే ఇది దీర్ఘకాలిక లక్ష్యమే. ప్రస్తుతానికి రెండు లక్షల మంది ప్రజలు నివసిస్తున్న గాజా నగరం అంతర్జాతీయ సమాజం అధీనంలో ఉంటుంది. అంతర్జాతీయ భద్రతా దళం అక్కడి భద్రతా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ట్రంప్‌తో పాటు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ నేతృత్వంలో ‘శాంతి బోర్డు’ను ఏర్పాటు చేస్తారు. ఇది పాలనా వ్యవహారాలను, పునర్నిర్మాణ పనులను చూస్తుంటుంది. ఇజ్రాయిల్ దళాలు ఆ ప్రాంత పరిసరాలలో మోహరిస్తాయి. కాగా ఈ ప్రణాళికపై తమకు అంగీకారం కుదిరిందని ట్రంప్, నెతన్యాహూ ధృవీకరించారు. అయితే నెతన్యాహూ వైఖరితో ప్రణాళికలోని ఓ భాగం విభేదించింది. గాజాపై అధికారం చివరికి పాలస్తీనా అథారిటీదేనని ప్రణాళిక తేల్చి చెప్పింది. నెతన్యాహూ, ఆయన ప్రభుత్వం పాలస్తీనాకు రాజ్య హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆ నిబంధనను అంగీకార పత్రంలో చేర్చారు.
కీలక అంశాలు ఇవే
హమాస్ ఆయుధాలను అప్పగించిన తర్వాత మాత్రమే ఇజ్రాయిల్ దళాలు గాజా నుంచి వైదొలుగుతాయి. ఇజ్రాయిల్ దళాలు ఖాళీ చేసిన ప్రాంతాలను అంతర్జాతీయ భద్రతా దళం తన అధీనంలోకి తీసుకుంటుంది. గాజా పరిపాలన విషయంలో హమాస్‌కు ఎలాంటి పాత్ర ఉండదు. దాని స్థావరాలన్నింటినీ ధ్వంసం చేస్తారు. అక్కడ ఉండాలని అనుకున్న వారు ఉండిపోవచ్చు. గాజాను విడిచి వెళ్లాలని అనుకుంటే అందుకు అనుమతిస్తారు. గాజాకు పెద్ద ఎత్తున మానవతా సాయాన్ని అందజేస్తారు. ఈ పంపిణీని తటస్థ అంతర్జాతీయ సంస్థలు పర్యవేక్షిస్తాయి. పాలస్తీనియన్లను గాజా నుంచి బహిష్కరించరు. రోజువారీ పాలనా వ్యవహారాలను పాలస్తీనా సాంకేతిక నిపుణులు నిర్వహిస్తారు. తాత్కాలిక ఏర్పాటు కింద పాలస్తీనా అథారిటీని పునర్వ్యవస్థీకరిస్తారు. తద్వారా అది తర్వాతి కాలంలో గాజా పాలనా బాధ్యతలను చేపడుతుంది.
లొంగిపోకుంటే సర్వనాశనం చేస్తాం
శ్వేతసౌధంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూతో సోమవారం చర్చలు జరిపిన అనంతరం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రణాళిక శాంతి స్థాపనకు దోహదపడుతుందని, ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ఒకవేళ హమాస్ కనుక ఈ ప్రణాళికను తిరస్కరిస్తే దానిని నామరూపాలు లేకుండా తుడిచిపెట్టే విషయంలో నెతన్యాహూకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ ప్రతిపాదనను హమాస్ తోసిపుచ్చినా లేక అంగీకరించకపోయినా ‘మేము పని పూర్తిచేస్తాం’ అని నెతన్యాహూ చెప్పారు. ట్రంప్ ప్రతిపాదన ప్రకారం…యుద్ధానికి ముగింపు పలికినందుకు, మానవతా సాయాన్ని అందించినందుకు, పునర్నిర్మాణానికి హామీ ఇచ్చినందుకు ప్రతిగా హమాస్ లొంగిపోవాలి. తన వద్ద ఉన్న ఆయుధాలను అప్పగించాలి. లేదా ఒప్పందాన్ని తిరస్కరించి సైనిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.