ఏడాదిన్నరలోనే 80 వేల కొలువులు
రాజకీయ నిరుద్యోగుల బాకీ కార్డుల డ్రామాలు : మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (టీజీఐఆర్‌డీ) ఆడిటోరియంలో డీపీఓ, ఎంపీడీవోల శిక్షణ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. దీనికి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, డైరెక్టర్ సృజన, టీజీఐఆర్‌డీ సీఈఓ నిఖిల పాల్గొన్నారు. గ్రూప్ వన్ పరీక్ష ద్వారా ఎంపికై రెండు వారాలపాటు శిక్షణ పూర్తి చేసుకున్న డీపీఓ, ఎంపీడీవోలకు మంత్రి సీతక్క ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ”ఇంతకాలం మీరు విద్యార్థులు. నేటి నుంచి ఉన్నతాధికారులు. రాష్ట్రంలో మొట్టమొదటి గ్రూప్ వన్ బ్యాచ్ మీది. అందుకే రాష్ట్ర చరిత్రలో మీకు ప్రత్యేక స్థానం ఉంది” అని అభినందించారు. ”పదేండ్ల నిరీక్షణకు ఇప్పుడు ఫలితం దొరికింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మీలాంటి ప్రతిభావంతులకి ఉద్యోగావకాశాలు కల్పించింది. ఏడాదిన్నర కాలంలోనే 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలిగాము. మాది ఉద్యోగ నామ ప్రభుత్వం” అని తెలిపారు. తమ పదవులు కోల్పోయి నిరుద్యోగులుగా మారిన కొందరు రాజకీయ నాయకులు ఇప్పుడు నిరుద్యోగ బాకీ కార్డులు అంటూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. నిరుద్యోగులను నిండా ముంచిన బీఆర్‌ఎస్ నాయకులను నిరుద్యోగులు నిలదీయాలన్నారు. గ్రామీణ అభివృద్ధిలో ఎంపీడీవోల పాత్ర ఎంతో కీలకమనీ, మండల స్థాయిలో అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అభివృద్ధి దిశగా నడిపించాల్సిన బాధ్యత ఎంపీడీవోలదేనని గుర్తు చేశారు. ప్రతి మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పని చేయాలనీ, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటనలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజా ప్రభుత్వానికి వారధులుగా ఎంపీడీవోలు నిలవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, శిక్షణ పొందిన అభ్యర్థులు మంత్రి సీతక్కను ఘనంగా సత్కరించారు.
నిరుద్యోగుల పదేండ్ల నిరీక్షణకు ముగింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



