Wednesday, May 21, 2025
Homeఆటలువిజయంతో ముగింపు

విజయంతో ముగింపు

- Advertisement -

చెన్నైపై రాజస్తాన్‌ రాయల్స్‌ గెలుపు
సూపర్‌కింగ్స్‌ 187/8, రాయల్స్‌ 188/4
నవతెలంగాణ-న్యూఢిల్లీ
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)18ను రాజస్తాన్‌ రాయల్స్‌ విజయంతో ముగించింది. మంగళవారం న్యూఢిల్లీలో చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. సూపర్‌కింగ్స్‌ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని రాయల్స్‌ 17.1 ఓవర్లలోనే ఛేదించింది. యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (36, 19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), వైభవ్‌ సూర్యవంశీ (57, 33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మరోసారి మెరుపు ఆరంభాన్ని అందించగా.. కెప్టెన్‌ సంజు శాంసన్‌ (41, 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌ నమోదు చేశాడు. రియాన్‌ పరాగ్‌ (3) నిష్క్రమణతో రాయల్స్‌ కష్టాల్లో పడేలా కనిపించింది. ఈ సీజన్లో అలవోక ఛేదనలను ఆఖర్లో సంక్లిష్టం చేసుకుని పరాజయాలు చవిచూసిన రాజస్తాన్‌ రాయల్స్‌.. ఆఖరు మ్యాచ్‌లో ఆ పొరపాటు చేయలేదు. ధ్రువ్‌ జురెల్‌ (31 నాటౌట్‌, 12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), షిమ్రోన్‌ హెట్‌మయర్‌ (12 నాటౌట్‌, 5 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) ధనాధన్‌ జోరుతో మరో 17 బంతులు ఉండగానే రాయల్స్‌ లాంఛనం ముగించింది. 14 మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించిన రాయల్స్‌ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలువగా.. 13 మ్యాచుల్లో 3 విజయాలతో సూపర్‌కింగ్స్‌ పదో స్థానంలో ఉంది.
రాణించిన అయుశ్‌, డెవాల్డ్‌ :
తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 187 పరుగులు చేసింది. యువ ఓపెనర్‌ అయుశ్‌ మాత్రె (43, 20 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌), మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ డెవాల్డ్‌ బ్రెవిస్‌ (42, 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. అయుశ్‌ పవర్‌ప్లేలో ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో మెరిసినా.. డెవాన్‌ కాన్వే (10), ఊర్విళ్‌ పటేల్‌ (0), రవిచంద్రన్‌ అశ్విన్‌ (13), రవీంద్ర జడేజా (1) తేలిపోయారు. డెవాల్డ్‌ బ్రెవిస్‌ ఎదురుదాడితో రాయల్స్‌ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. శివం దూబె (39, 32 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆశించిన వేగంతో పరుగులు చేయలేదు. ఎం.ఎస్‌ ధోని (16) మందకోడి ఇన్నింగ్స్‌తో నిరాశపరిచాడు. దీంతో సూపర్‌కింగ్స్‌ 187 పరుగులే చేసింది. రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్లలో యుధ్‌వీర్‌ సింగ్‌ (3/47), ఆకాశ్‌ మద్వాల్‌ (3/29) మూడు వికెట్ల ప్రదర్శనతో రాణించారు. చెన్నై సూపర్‌కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -