తెలంగాణ రాష్ట్రంలో విద్య అనేది సామాజిక హక్కు అన్న ప్రాథమిక సూత్రం కాలరాయబడుతోంది. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా విద్యారంగం పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి వీడటం లేదు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినా, పేద విద్యార్థుల తలరాతలు మాత్రం మారడం లేదు. ఎన్నికల వేళ ‘అభయహస్తం’ పేరిట విద్యారంగానికి వెలుగులు నింపుతామని, విద్యార్థుల కష్టాలు తీరుస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక ప్రయివేటు యాజమాన్యాల ప్రయోజనాలకే పెద్దపీట వేయడం అత్యంత శోచనీయం. విద్యారంగాన్ని ఒక సేవా రంగంగా చూడాల్సిన పాలకులు, దాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చేసి కార్పొరేట్ శక్తులకు దత్తత ఇస్తున్నారు.ప్రస్తుతం ఇంజినీరింగ్, ఫార్మసీ,ఆర్కిటెక్చర్ కోర్సులు ఫీజుల పెంపు నిర్ణయం సామాన్య, మధ్యతరగతి విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 126 ప్రయివేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులను రూ.లక్షల్లోకి పెంచుతూ తీసుకున్న నిర్ణయం, విద్యను కేవలం ధనికులకే పరిమితం చేసే కుట్రలో భాగమే అని స్పష్టమవుతోంది. కొత్త ఫీజు నిర్ణయం ప్రకారం, ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల యాజమాన్యంలోని కళాశాలలో ఫీజులు తగ్గినట్లు కనిపించింది. కానీ, కొన్ని ప్రయివేటు ఇంజనీరింగ్ కళాశాలలకు, ప్రభుత్వం ఫీజులను గణనీయంగా పెంచింది. ఇంకొన్ని బడా విద్యాసంస్థల్లో ఫీజులు రూ.1.80 లక్షల మార్కును చేరడం చూస్తుంటే, అసలు రాష్ట్రంలో ఫీజు నియంత్రణ కమిటీ ఉందా? లేక అది ప్రయివేట్ యాజమాన్యాల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. జీవో నెం.6: ఇది రాష్ట్రంలోని ప్రయివేట్ అన్-ఎయిడెడ్ ఇంజినీరింగ్ (బి.ఇ/బి.టెక్)కళాశాలల ఫీజులను ఖరారు చేస్తూ మార్చి 5, 2026న జారీ చేయబడింది. దీని ప్రకారం 2025-26 నుండి 2027-28 వరకు మూడేళ్ల బ్లాక్ పీరియడ్ కోసం ఫీజులను పెంచారు. ఇందులో గరిష్ఠ ఫీజును రూ.1.83 లక్షలుగా (సిబిఐటి వంటి కళాశాలల్లో) నిర్ణయించారు.
జీవో నెం.10: ఇది బీ-ఫార్మసీ, ఫార్మా-డి, మరియు ఆర్కిటెక్చర్ (బి.ఆర్క్) కోర్సుల ఫీజుల పెంపునకు సంబంధించినది. దీని ప్రకారం గతంలో రూ. 45 వేలుగా ఉన్న కనిష్ట ఫీజును భారీగా పెంచారు. కొన్ని ఫార్మసీ కళాశాలల్లో ఫీజు రూ.1.21 లక్షల మార్కును చేరింది. ఈ ఫీజుల పెంపు కేవలం ఇంజినీరింగ్‌కే పరిమితం కాలేదు. సమాజానికి ఎంతో కీలకమైన ఆరోగ్య రంగంతో ముడిపడి ఉన్న బీ-ఫార్మసీ, ఫార్మా-డి, కోర్సుల్లో కూడా దోపిడీ పరాకాష్టకు చేరింది. గతంలో రూ.45 వేలుగా ఉన్న కనీస ఫీజును ఏకంగా రూ.1.21 లక్షలకు పెంచడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటి? గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద విద్యార్థులు ఈ స్థాయిలో ఫీజులు చెల్లించడం సాధ్యమేనా? అని పాలకులు ఏనాడైనా ఆలోచించారా? నాణ్యమైన విద్య అందిస్తున్నామన్న సాకుతో ప్రయివేటు సంస్థలు తమ ఖర్చులను విద్యార్థుల నెత్తిన రుద్దుతుంటే, ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గుచేటు.
సాధారణంగా ఇంజనీరింగ్ కాలేజీలను మేజారిటీగా ఆడిట్ చేసేది జెఎన్టీయూ యూనివర్సిటీ అధికారులు. వారు కాలేజీలో ఫ్యాకల్టీ ఎంత మంది ఉన్నారు, ఎంత శాతం ఉంది, వారికిచ్చే జీతాలు ఎంత, ఎన్ని ల్యాబ్స్ ఉన్నాయి, ఇతర ఫెసిలిటీస్ ఏమిటి అన్నివి చెక్ చేసి నివేదిక రూపంలో ఇస్తారు. కాలేజీ ఫీజు పెంచాలంటే ఈ ఆడిట్ నివేదికను ప్రామాణికంగా తీసుకుని ఫీజు పెంపు ఉంటుంది. రాష్ట్రంలో 2025-26, 2026-27, 2027-28 విద్యాసంవత్సరానికి బ్లాక్ పీరియడ్‌కు గాను ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులను నిర్ణయించాల్సి ఉంది. దీనికోసం టీఏఎఫ్‌ఆర్సీ కాలేజీలు, ట్రస్టుల నుండి 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబంధించిన కాలేజీల ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్టును, 2021-22 నుండి ఇప్పటివరకు కాలేజీ సాంక్షన్ ఇంటెక్ వివరాలను సేకరించి, ఈ క్రమంలో కాలేజీలో గతంలో ప్రభుత్యం నిర్ణయించిన ఫీజుల వివరాలను, రానున్న మూడెండ్లకు ఎంత ఫీజు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనే డేటాను వారి నుండి తీసుకున్నారు. అయితే మేనేజ్‌మెంట్లు ఇచ్చిన లెక్కల్లో అనేక తప్పులు ఉన్నట్టు లెక్కల సంస్థలు ఆడిట్‌లో గుర్తించాయి.
కొన్ని కాలేజీల్లో సిబ్బందికి జీతం ఎక్కువగా వేసి వారి నుండి మళ్లీ రిటర్న్ తీసుకుంటున్నారు. లైబ్రరీలో పుస్తకాలు, ల్యాబ్‌లలో పరికరాలు కొన్నకుండా కొనుగోలు చేసినట్టు చూపించి కాలేజీలు చేసిన ఖర్చుగా దాని ఆధారంగానే తద్వారా సంవత్సరాలకు ఫీజులు నిర్ణయించుకునే విధంగా వ్యవహారిస్తున్నాయి మేనేజ్‌మెంట్లు. అలాగే లైబరీ, లేబొరేటరీ ఫీజు కింద అదనంగా యేటా రూ.12 వేల వరకు తీసుకోవాలని ప్రభుత్వం గతంలో జీవో ద్వారా పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫీజులో ఎలాంటి మార్పు లేదు.కానీ కొన్ని కాలేజీలు లైబరీ, లేబొరేటరీ ఫీజు కింద గతేడాది రూ.20 వేల వరకు వసూలు చేశాయి. ఈ ఏడాది నుంచి ఈ ఫీజును ఏకంగా రూ.30వేల నుంచి రూ.50 వేల వరకు పెంచాయి. క్యాంపస్ నియామకాలకు శిక్షణ ఇప్పించేందుకు కాలేజీలు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నాయి. యేటా రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారు.
వాస్తవానికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం విద్యార్థికి స్కిల్ నేర్పించడం కాలేజీల బాధ్యత. అవేమీ పట్టించుకోవడం లేదు.అయినా ఇవేమీ పట్టించుకోకుండా ఫీజులను పెంచాలని ఫీజు కమిటీపై తీవ్ర ఒత్తిడి తీసుకుని వచ్చి ఫీజులను నిర్ణయించుకున్నారు. ఇంకా 70పైగా కళాశాలలు తమ ఫీజులు పెంచాలని హైకోర్టుకు వెళ్లారు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలను ఏర్పాటు చేస్తాం” అని కాంగ్రెస్ ఇచ్చిన హామీ నేడు నీటి మూటగా మిగిలిపోయింది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల కొరత వేధిస్తోంది. ప్రభుత్వ రంగంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీలను అభివృద్ధి చేయడంలో, అక్కడ సీట్ల సంఖ్యను పెంచడంలో సర్కార్ ఘోరంగా విఫలమైంది. విద్యార్థులను బలవంతంగా ప్రయివేట్ సంస్థల గడప తొక్కేలా చేస్తోంది. ప్రభుత్వ కాలేజీల్లో కనీస వసతులు కల్పించకపోవడం, ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయకపోవడం ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. ప్రయివేట్ వ్యాపారులకు ‘రెడ్ కార్పెట్’ పరుస్తోంది. ఈ పెంపు వల్ల మధ్యతరగతి, పేద కుటుంబాల విద్యార్థులు చదువు కొనసాగించడం కష్టమవుతుంది.
ఒక ఇంజనీరింగ్ విద్యార్థి నాలుగేళ్ల కోర్సు పూర్తి చేయడానికి కనీసం రూ.6-8 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కోర్సులు కూడా రూ.5-6 లక్షల వరకు వెళ్తాయి. కానీ, మధ్యతరగతి కుటుంబం వార్షిక ఆదాయం రూ.2-3 లక్షలు మాత్రమే. ఈ పరిస్థితిలో పిల్లల చదువు కొనసాగించడం అసాధ్యం. విద్య అనేది హక్కు, వ్యాపారం కాదు. రాజ్యాంగం ఆర్టికల్ 21ఎ ప్రకారం 6-14 ఏళ్ల పిల్లలకు ఉచిత, తప్పనిసరి. ఆర్ట్టికల్ 41, 45, 46 ప్రకారం రాష్ట్రం విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలి. కానీ ప్రయివేట్ కళాశాలల ఫీజుల పెంపు ఈ రాజ్యాంగ హామీలను ఉల్లంఘిస్తోంది.రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కు ప్రకారం, ప్రతి ఒక్కరికీ ఉన్నత విద్య అందుబాటులో ఉండాలి.
కానీ, నేటి పరిస్థితుల్లో ఒక సామాన్య రైతు బిడ్డో, కార్మికుడి బిడ్డో ఇంజినీర్ కావాలంటే లక్షలాది రూపాయల అప్పులు చేయాల్సి వస్తోంది. చదువు పూర్తి కాకముందే అప్పుల ఊబిలో కూరుకుపోతున్న విద్యార్థులు, మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. కేవలం లాభాల వేటలో పడి విద్యాసంస్థలను నడుపుతున్న యాజమాన్యాలకు ప్రభుత్వం కళ్లెం వేయాలి. తక్షణమే అడ్డగోలుగా పెంచిన ఫీజులను రద్దు చేయాలి. ప్రభుత్వ ఇంజినీరింగ్, ఫార్మసీ కాలే జీల సంఖ్యను ప్రతి జిల్లాలో పెంచి, పేదలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, విద్యార్థులపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించాలి. చదువును కొనే శక్తి ఉన్నవారికే విద్యను పరిమితం చేసే కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అప్పుడే విద్యారంగంలో ప్రజాస్వామ్యం, సమానత్వం పరిరక్షించబడతాయి.
టి.నాగరాజు
9490098292



