– సుమారు 70వేల మిర్చీ బస్తాల రాక
– సింగిల్ పట్టి రకం మిర్చీ ధర రూ.42వేలు
నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం ఎరుపెక్కింది. మార్కెట్ యార్డులో ఎటుచూసినా మిర్చి బస్తాలతో నిండిపోయింది. సోమవారం సుమారు 65వేల నుంచి 70వేల బస్తాల మిర్చిని రైతులు అమ్మకానికి తీసుకువచ్చారు. ఈ సీజన్‌లో ఇంత పెద్ద మొత్తంలో మిర్చి రావడం ఇదే మొదటిసారి. మిర్చి ధరలు గతేడాదితో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. సింగిల్ పట్టి రకం మిర్చికి రికార్డు ధర క్వింటాకు రూ.42వేలు పలికింది. ములుగు జిల్లా పోట్లాపూర్ గ్రామానికి చెందిన లింగమూర్తి అనే రైతు 7బస్తాల సింగిల్ పట్టి మిర్చి తీసుకురాగా జీఎంటీ అడ్తి ద్వారా కరానీ స్పైసెస్ ఖరీదుదారు అత్యధిక ధర రూ.42,000 కొనుగోలు చేశారు. మార్కెట్‌లో మంచి నాణ్యత ఉన్న మిర్చికి గరిష్టంగా ధర పలికాయి. తేజ రకం మిర్చి 10వేల బస్తాలు రాగా క్వింటా ధర రూ.19,500, వండర్ హాట్ 6 వేల బస్తాలు రాగా ధర రూ.35,000, యూఎస్ 341 రకం మిర్చి 26వేల బస్తాలు రాగా ధర రూ.21,600, దీపిక 2500 బస్తాలు బాగా ధర రూ.30,000, దేశీ రకం మిర్చి 5వేల బస్తాలు రాగా ధర రూ.41,000, సింగిల్ పట్టి రకంమిర్చి 300 బస్తాలు రాగా గరిష్ట ధర రూ.42,000 పలికింది. తాలు 2500 బస్తాలు రాగా గరిష్ట ధర రూ.12వేలు పడింది.
ఎరుపెక్కిన ఎనుమాముల మార్కెట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



