– తహశీల్దారుకు పి.ఆర్.టి.యు నాయకుల వినతి
నవతెగాణ – అశ్వారావుపేట
మండలంలో చేపట్టనున్న జనగణన కార్యక్రమానికి గణాంక కుల (ఎన్యూమరేటర్ల) నియామకాన్ని పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని పి.ఆర్.టి.యు మండల శాఖ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం అశ్వారావుపేట తహశీల్దారు సీహెచ్వీ రామక్రిష్ణ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
జనగణన విధుల్లో భాగంగా ఉపాధ్యాయులను వివిధ హోదాల్లో నియమించాల్సి ఉన్న నేపథ్యంలో మండల విద్యాశాఖ కార్యాలయం నుండి ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను సేకరించి, అదే ప్రాతిపదికగా నియామకాలు చేపట్టాలని వారు కోరారు. ముఖ్యంగా సీనియర్ ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
గణాంకకుల నియామకాల విషయంలో పైరవీలు జరుగుతున్నాయనే సమాచారం తమ దృష్టికి వచ్చిందని, అలాంటి ఆరోపణలకు తావులేకుండా మండల విద్యాధికారి ధృవీకరించిన సీనియారిటీ జాబితా ప్రకారం నియామకాలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా పి.ఆర్.టి.యు మండల శాఖ అధ్యక్షుడు రామినేని రాంప్రసాద్, కార్యదర్శి బి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ జనగణన వంటి కీలక కార్యక్రమాల్లో పారదర్శకత అత్యంత అవసరమని, అర్హత మరియు సీనియారిటీ ఆధారంగా నియామకాలు జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పి.ఆర్.టి.యు నాయకులు ఉమామహేశ్వరరావు, భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.



