Wednesday, July 30, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపర్యావరణానికే తొలి ప్రాధాన్యత

పర్యావరణానికే తొలి ప్రాధాన్యత

- Advertisement -

– ఓఆర్‌ఆర్‌ వెలుపలకు కాలుష్యకారక పరిశ్రమలు
– మూసీ అభివృద్ధి పనుల్ని వేగవంతం చేయండి
– ‘మెట్రోరైల్‌’ వేగంగా పూర్తికావాలి
– జూపార్క్‌ వద్ద పర్యాటకుల కోసం టవర్ల నిర్మాణం
– పురపాలకశాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

పర్యావరణ పరిరక్షణకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలనీ, ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి పనిలోనూ ఇది కనిపించాలని సీఎం ఏ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై మంగళవారంనాడిక్కడి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌ సిటీలో కాలుష్య నివారణా చర్యల్ని చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. ఢిల్లీ, ముంబయి, చెన్నై వంటి నగరాల్లో ప్రజలు కాలుష్యంతో పడుతున్న ఇబ్బందుల్ని వివరించారు. కోర్‌ సిటీలోని కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) బయటకు తరలించాలని ఆదేశించారు. వచ్చే 25 ఏండ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. దీనికోసం ఢిల్లీ, ముంబయి, చెన్నై వంటి నగరాల్లోని సమస్యలపై అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వాలని కోరారు. అండర్‌గ్రౌండ్‌ డ్రయినేజీ, అండర్‌గ్రౌండ్‌ కేబులింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. దీనికోసం ఆయా శాఖలు సమగ్ర డీపీఆర్‌లు తయారు చేయాలని సూచించారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించాలనీ, నిర్మాణ రంగ వ్యర్థాలను నగరాల్లో ఎక్కడపడితే అక్కడ డంప్‌ చేయకుండా చూడాలని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా అలాంటి పనులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఓఆర్‌ఆర్‌ పరిధిలోని వారసత్వ కట్టడాల సంరక్షణ, వాటిని పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకుగానూ కులీకుతుబ్‌ షాహీ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) మార్గదర్శకాలను సవరించి, దాన్ని విస్తరింపచేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌ పాతబస్తీలో మెట్రోరైల్‌ పనుల పురోగతిని కూడా ఆయన సమీక్షించారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం అవసరమైన నిధుల్ని ఇప్పటికే విడుదల చేసినందున పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. మెట్రో ఇతర ఫేజ్‌ల అనుమతులు, తదితర విషయాల్లో జాప్యాన్ని సహించేదిలేదని హెచ్చరించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పనుల్ని పూర్తిచేయాలని చెప్పారు. సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌ వరకు ఎలివేటేడ్‌ కారిడార్‌ పనుల్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్ట్‌లో హిమాయత్‌సాగర్‌ నుంచి గాంధీసరోవర్‌ వరకు పనుల్ని వేగవంతం చేయాలని చెప్పారు. అలాగే ఓఆర్‌ఆర్‌ నుంచి మూసీ వైపు వచ్చే క్రమంలో కొత్వాల్‌గూడ జంక్షన్‌లో మూసీ రివర్‌ ఫ్రంట్‌కు ప్రతీకగా ఇండియా గేట్‌, గేట్‌ వే ఆఫ్‌ ఇండియా, చార్మినార్‌ వంటి ఓ ల్యాండ్‌ మార్క్‌ను నిర్మించాలని సీఎం సూచించారు. మూసీపైన బ్రిడ్జి కమ్‌ బ్యారేజీలకు ప్రణాళికలు రూపొందించాలనీ, అనుమతులు, నిబంధనల విషయంలో తగు జాగ్రత్తలు వహించాలని చెప్పారు. నెహ్రూ జూ పార్క్‌, మీరాలం ట్యాంక్‌ అభివృద్ధి పనుల పురోగతిపైనా సమీక్షించారు.
మీరాలం ట్యాంక్‌ ఎదుట ఏర్పాటు చేసిన సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు (ఎస్టీపీ) వాటి సామర్థ్యానికి అనుగుణంగా పని చేసేలా చూడాలని చెప్పారు. జూ పార్క్‌, మీరాలం ట్యాంక్‌ సమీపంలో పర్యాటకులు బస చేసేందుకు వీలుగా అధునాతన వసతులతో హౌటల్‌ నిర్మించాలనీ, అక్కడి నుంచి చూస్తే హైదరాబాద్‌ నగరం మొత్తం కనిపించేలా ఉండేలా టవర్ల తరహా నిర్మాణాలు చేపట్టాలని ప్రతిపాదించారు. దీని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్‌, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్‌రాజ్‌, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది (హెచ్‌ఎండీఏ) కార్యదర్శులు ఇలంబర్తి, టి.కె.శ్రీదేవి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌, ఎఫ్‌సీడీఏ కమిషనర్‌ కే.శశాంక, వాటర్‌బోర్డు ఎమ్‌డీ అశోక్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌, మెట్రో రైలు ఎమ్‌డీ ఎన్వీఎస్‌ రెడ్డి, ఎమ్‌ఆర్‌డీసీఎల్‌ ఎమ్‌డీ ఈవీ నరసింహారెడ్డి, జేఎండీ గౌతమి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -