Wednesday, November 12, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంపర్యావరణ దిక్సూచి చైనా

పర్యావరణ దిక్సూచి చైనా

- Advertisement -

కర్బన ఉద్గారాల నియంత్రణలో మేటి
అంతర్జాతీయ మీడియా ప్రశంసలు
బెలెమ్‌ (బ్రెజిల్‌) :
అమెరికా లేకుండానే కాప్‌ 30 వాతావరణ సదస్సు కొనసాగుతోంది. కాగా, ఇప్పుడు చాలా మంది కళ్ళు చైనా వైపు మళ్ళాయి. చైనాలో పునర్వినియోగ ఇంధన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో చైనా సాధించిన పురోగతి పట్ల అంతర్జాతీయ మీడియా ప్రశంసలు కురిపించింది. చైనాలో గత 18మాసాలుగా కర్బన ఉద్గారాలు బాగా క్షీణించాయని గార్డియన్‌లో వచ్చిన ఒక వ్యాసం పేర్కొంది. చైనా నుండి వచ్చిన హరిత సాంకేతిక పరిజ్ఞానం అంతర్జాతీయ వాతావరణ రాజకీయాలను బాగా ప్రభావితం చేస్తోందని న్యూయార్క్‌ టైమ్స్‌ వ్యాఖ్యానించింది. ఈ పురోగతి గ్లోబల్‌ వార్మింగ్‌ను అణచివేయడానికి సరిపోతుందా అని లాస్‌ ఏంజెల్స్‌ టైమ్స్‌ విస్మయం వ్యక్తం చేసింది. మరోవైపు ‘ప్రపంచ ఫ్యాక్టరీ ఫ్లోర్‌’ను ఇది డీ కార్బొనైజ్‌ చేయగలుగుతుందా లేదా అని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ చర్చిస్తోంది. ఇక చైనా పర్యావరణ దిక్సూచిగా ఆవిర్భవిస్తోందని, అంతర్జాతీయ వాతావరణ మార్పులకు సంబంధించి నాయకత్వ పాత్రను పోషించే స్థాయికి చైనా ఎదిగిందని ఆ దేశ సిజిటిఎన్‌ పత్రిక వ్యాఖ్యానించింది.

గత 18మాసాలుగా చైనాలో కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారాలు పూర్తిగా క్షీణించడమో లేదా బాగా తగ్గుతూ రావడమో జరిగిందని విశ్లేషణలో వెల్లడైంది. సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఎనర్జీ అండ్‌ క్లీన్‌ ఎయిర్‌ (సిఆర్‌ఇఎ) ఈ విశ్లేషణ చేపట్టింది. సైన్స్‌ అండ్‌ క్లైమేట్‌ పాలసీ వెబ్‌సైట్‌ కార్బన్‌ బ్రీఫ్‌ కోసం ఈ విశ్లేషణ నిర్వహించారు. దాదాపు ఏడాది కాలంగా చైనాలో కర్బన ఉద్గారాల్లో మార్పు లేదు. దీన్ని బట్టి చూస్తుంటే ప్రపంచంలోనే అతిపెద్ద కాలుష్య కారక శక్తిగా వున్న చైనా షెడ్యూల్‌ కన్నా ముందుగానే తన కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోగలుగుతుందనే ఆశకు ఆధారాలు కనిపిస్తున్నాయి.
చైనాలో సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి అత్యంత వేగంగా పెరిగింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో వరుసగా 46, 11శాతం పెరిగాయి. దీనివల్లే విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతున్నప్పటికీ ఇంధన రంగంలో కర్బన ఉద్గారాల పరిస్థితి తగ్గింది.

ఈ ఏడాది తొలి 9మాసాల కాలంలో అదనంగా 240 గిగా వాట్‌ల సౌర విద్యుత్‌ సామర్ధ్యం పెరిగింది. 61గిగావాట్‌ల మేరకు పవన విద్యుత్‌ సామర్ధ్యం పెరిగింది. గతేడాది మిగిలిన ప్రపంచ దేశాలన్నీ కలిపిన దానికన్నా ఎక్కువగా 333 గిగావాట్‌ల సౌర విద్యుత్‌ సామర్ధ్యాన్ని చైనా ఏర్పాటు చేసింది.
2005తో పోలిస్తే 2030 నాటికి కర్బన ఉధృతిని 65శాతం మేరా తగ్గించాలన్న లక్ష్యాన్ని సాధించాలంటే మరింత ఎక్కువగా కాలుష్యాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం వుంది. ప్రస్తుతం చైనాలో అందరి కండ్లు 15వ పంచవర్ష ప్రణాళికపైనే వున్నాయి. 2026-2030 కాలానికి ప్రభుత్వ ప్రాధాన్యతలు, విధానాలపై ఈ ప్రణాళిక దృష్టి కేంద్రీకరిస్తుంది. వచ్చే ఏడాదికి గాని ఈ ప్రణాళిక పూర్తి సారాంశం ప్రచురితం కాదు. అయితే తక్కువ కాలుష్యం క లిగించే ఇంధన వ్యవస్థలపైనే ఈ ప్రణాళికలో ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -