– కార్పొరేట్, ప్రయివేటీకరణతో విద్యలో అసమానతలు: ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు టి.సాగర్
– అట్టహాసంగా ఎస్‌ఎఫ్‌ఐ స్టేట్ గర్ల్స్ కన్వెన్షన్ ప్రారంభం
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
‘కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఒక వైపు ‘భేటీ బచావో.. భేటి పడావో’ నినాదం ఇస్తూ మరో వైపు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోంది. విద్యాసంస్థల్లో నియామకాలు చేపట్టకుండా, నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తూ.. మరో వైపు ప్రయివేటు విద్యాసంస్థలను ప్రోత్సహిస్తోంది. అంతరాలు లేకుండా అందరికీ సమాన విద్యావకాశాలు కల్పించాలి’ అని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు టి.సాగర్ కోరారు. మూడ్రోజుల పాటు నిర్వహించనున్న స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఎఫ్‌ఐ) స్టేట్ గర్ల్స్ కన్వెన్షన్ బుధవారం నిజామా బాద్ జిల్లా కేంద్రంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ముందుగా విద్యార్థి అమర వీరులకు నివాళి అర్పించారు. కన్వెన్షన్ కన్వీనర్ పూజ అధ్యక్షత వహించగా.. టి.సాగర్ ప్రారంభోపన్యాసం ఇచ్చారు. విద్యారంగం ప్రయివేటీకరణ వల్ల చదువుకునే అవకాశం కోల్పోయేది ముందుగా అమ్మాయిలే అని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక వైపు బాలికలు చదువుకోవాలని నినాదాలు ఇస్తూ..మరో వైపు సామాన్య పేద ప్రజలకు విద్య అందుబాటులో లేకుండా చేస్తోం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా నాణ్యమైన విద్య ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రయివేటు స్కూళ్లల్లో నర్సరీ చదువులకే లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారని, నర్సరీని ప్రభుత్వ స్కూళ్లల్లో ప్రారంభించేందుకు మాత్రం వెనుకాడుతున్నారని అన్నారు.
రాష్ట్రంలో 8 వేల కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలున్నాయని, దీని వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మూడునాలుగేండ్లు కష్టపడి చదవితే చివరకు సర్టిఫికేట్‌లు చేతికొచ్చే పరిస్థితి లేకుండా పోతోందని అన్నారు. విద్యారంగాన్ని విస్మరిస్తే చరిత్రలో నిలబడలేరని స్పష్టం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా పూర్వ కార్యదర్శి రమేశ్‌బాబు మాట్లాడుతూ.. చదువుతో పాటు పరిజ్ఞానం ముఖ్యమని, శాస్త్రీయంగా ఉండాల్సిన విద్యను మూఢనమ్మకాలు పెంచేలా, మతాన్ని జొప్పిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు రజినీకాంత్, ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత, పీఎన్‌ఎం జిల్లా కార్యదర్శి సిర్పలింగం, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి విఘ్నేష్, అధ్యక్షులు దీపిక, రాష్ట్ర కమిటీ సభ్యులు హేమలత, శ్రీహిజ, సంజన, మానస, మేఘన, వీణ, వివిధ జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.
అందరికీ సమాన విద్యావకాశాలు కల్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



