ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ.కాశీం
విద్యలో ప్రయివేటీకరణ వల్లనే అంతరాలు : మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
తెలంగాణ పౌర స్పందన వేదిక ఆధ్వర్యంలో.. ‘విద్యలో అంతరాలు (అసమానతలు) పోయేది ఎట్లా” అనే అంశంపై కవి సమ్మేళనం
నవతెలంగాణ-ముషీరాబాద్
విద్యలో అంతరాలు పోవాలని, అందరికీ నాణ్యమైన విద్యకు సమాన అవకాశాలు కల్పించాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం, తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. ఆదివారం తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘విద్యలో అంతరాలు (అసమానతలు) పోయేది ఎట్లా’ అనే అంశంపై హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి ప్రొఫెసర్ కాశీం, తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎం. రాధేశ్యామ్‌తో పాటు ప్రొఫెసర్ కాశీం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖాశీం మాట్లాడుతూ.. తెలంగాణ విద్యా విధానంలో అంతరాలు ఉన్న మాట వాస్తవమని, అవి పోవా లంటే కవులు రచయితలతో పాటు మధ్యతరగతి ప్రజానీకం, మేధావులందరూ దీన్ని ఒక ఉద్యమంగా మలిచేలా కృషి చేయాలని అన్నారు.
కవిత్వం అంటే భావోద్వేగానికి సంబంధిం చిన విషయమని, దాన్ని కవులు తమ కళాదృష్టితో ప్రజలు హత్తుకునేలా చేయగలు గుతారని తెలిపారు. ప్రజాసమస్యల పైన ఆలోచిం పజేసే విధంగా కవులు, రచయితలు, ఉద్వేగ భరిత మైన రచనలు చేయడంతో తెలంగాణ అస్తిత్వం కోసం జరిగిన ఉద్యమం ప్రజల్ని కదిలిం చిందని చెప్పారు. విద్యలో అంతరాలు పోవాలనే అంశాన్ని కూడా కవితలు, గేయాల ద్వారా ప్రజల్లోకి తీసుకు పోవాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో తెలంగాణ పౌర స్పందన వేదికతో కలిసి పనిచేస్తానని తెలిపారు. వేదిక రాష్ట్ర అధ్యక్షులు అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. విద్యలో ప్రయివేటీకరణ మొదలైన తర్వాతే అంతరాలు విపరీతంగా ఏర్పడ్డాయని అన్నారు. ప్రయివేటు బడుల నుంచి యూనివర్సిటీల వరకు అనేక దొంతర్లలో ఫీజులు వసూలు చేస్తున్నారని, దీన్ని క్రమబద్ధీకరించాలని చెప్పారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య లభించినప్పుడే సమాజంలో మెరుగైన మార్పులు వస్తాయని తెలిపారు. కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తే బలహీన వర్గాల పిల్లలకు విద్యపై మక్కువ ఏర్పడుతుందన్నారు.
విద్యలో అంతరాలు తొలగించడానికి తెలంగాణ పౌర స్పందన వేదిక కృషి చేస్తుందన్నారు. వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. రాధేశ్యామ్ మాట్లాడుతూ.. 1980వ దశకం నుంచి విద్య ప్రయివేటీకరణ మొదలై, నేడు సరళీకరణ విధానాల్లో ఒక సరుకుగా మారిందన్నారు. ఎంత ఖర్చు పెడితే అంత నాణ్యమైన విద్య (సరుకు) దొరుకుతుందనే అభిప్రాయాన్ని పాలకులు ప్రజల మనసులో బలంగా నాటగలిగారని చెప్పారు. విద్య తమ పిల్లల హక్కుగా తల్లిదండ్రులు భావించేలా చైతన్యపర్చాలన్నారు. అలాంటి ప్రయత్నంలో కవులు, రచయితలు అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కవి సమ్మేళనంలో కవులు ఏ భూషి నరసింహ, వెన్నెల సత్యం, షేక్ సలీమ, మోహనకృష్ణ, వి.మధుమోహన్, జి.శ్రీనివాస్ గౌడ్, ఎస్.ఎస్.బిగేరా, భువనేశ్వరి, అరుణజ్యోతి, టి.వెంకటి తదితరులు పాల్గొని తమ కవితలు వినిపించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కేఏ మంగ, రాష్ట్ర కార్యదర్శి కె.లక్ష్మణరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు, ఎంఎ సమద్, ఆర్. సుధాకర్, టి.సురేష్ కుమార్, డి.మస్తాన్‌రావు, ఏ.నాగమణి, జి.రాములు తదితరులు పాల్గొన్నారు.