- 41-44 హెచ్‌పీ కేటగిరీ మార్కెట్‌లో ‘కుబోటా’ బ్రాండ్
- కుబోటా MU4501, MU5502 ట్రాక్టర్ల అప్‌గ్రేడ్ వెర్షన్
ఎస్కార్ట్స్ కుబోటా తన కుబోటా బ్రాండ్ కింద నూతన ట్రాక్టర్ ‘కుబోటా MU4201’ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది భారతదేశంలో 41-44 హెచ్‌పీ కేటగిరీ మార్కెట్‌లోకి బ్రాండ్ ప్రవేశాన్ని సూచిస్తుంది. కంపెనీ ఫామ్‌ట్రాక్, పవర్‌ట్రాక్, కుబోటా పేరిట మూడు బ్రాండ్ల ట్రాక్టర్లను విక్రయిస్తోంది. నూతన కుబోటా ట్రాక్టర్, రవాణాతో సహా విభిన్న వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. ఇది రోటేవేటర్, డిస్క్ హారో వంటి పలు పనిముట్లను వినియోగించేందుకు అత్యంత అనుకూలంగా ఉంటుంది.
జపాన్ దేశ ఇంజనీర్లు రూపొందించిన ఈ కొత్త ట్రాక్టర్ 45-55 హెచ్‌పీ కేటగిరీ పరిధిలో ఇప్పటికే ఉన్న కుబోటా ట్రాక్టర్‌లలో అందించే అన్ని ప్రీమియం లక్షణాలను కలిగి ఉంది. వీటిలో ఫ్లాట్ డెక్, సస్పెండ్ విధానంలో అమర్చిన పెడల్స్, బ్యాలెన్సర్ షాఫ్ట్, సింక్రోమెష్ ట్రాన్స్‌మిషన్, డ్యూయల్ క్లచ్ ఉన్నాయి.
కంపెనీ తన కుబోటా MU4501, కుబోటా MU5502 ట్రాక్టర్ల అప్‌గ్రేడ్ వెర్షన్‌ను కూడా విడుదల చేసింది. ఈ ట్రాక్టర్లలో కొత్త ‘పోంపా లిఫ్ట్’ను ప్రవేశపెట్టింది. అధిక-నాణ్యత జపనీస్ లిఫ్ట్ టెక్నాలజీతో, 1640-2100 కిలోల బరువును ఎత్తగల సామర్థ్యం, 455 మిమీ కేటగిరీ లిఫ్ట్ హైట్‌లో అత్యుత్తమమైనది.
ఈ ఆవిష్కరణ గురించి ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ నిఖిల్ నందా మాట్లాడుతూ, ‘‘మా ఉత్పత్తి సమర్పణలలో ఇంజనీరింగ్ నైపుణ్యం, అత్యాధునిక సాంకేతికత, అధిక-నాణ్యత లక్షణాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా దేశీయ ట్రాక్టర్ మార్కెట్లో దృఢమైన స్థానాన్ని దక్కించుకుని, స్థిరపడాలనే మా ముందు చూపుకు అనుగుణంగా నూతన ఉత్పత్తిని తయారు చేసి విడుదల చేశాము. కొత్త కుబోటా MU-4201, కుబోటా MU-4501, MU-5502 అప్‌గ్రేడ్ వెర్షన్‌లు ఫామ్‌ట్రాగ్, పవర్‌ట్రాక్ బ్రాండ్ కింద మా ప్రస్తుత ఆఫరింగ్‌లను ఉన్నతీకరణ చేస్తాయి. అవి భారతదేశంలో 41-50 హెచ్‌పీ మార్కెట్ విభాగంలో మా స్థానాన్ని మరింత బలోపేతం చేస్తూ, పదిలం చేస్తాయి’’ అని ధీమా వ్యక్తం చేశారు.
డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అకిరా కటో వీటి గురించి మాట్లాడుతూ, ‘‘కొత్త ఉత్పత్తులు భారతదేశంలోని 41-50 హెచ్‌పీ విభాగాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. ఇది నేడు మొత్తం దేశీయ మార్కెట్‌లో 60-64% శాతం వాటాను కలిగి ఉంది. నూతన MU-4201 రవాణాతో పాటు విభిన్న వ్యవసాయ అవసరాలకు ప్రీమియం లక్షణాలను కోరుకునే రైతుల కోసం రూపొందించాము’’ అని వివరించారు.
మార్కెట్ వ్యూహాన్ని వివరిస్తూ, ట్రాక్టర్ బిజినెస్ డివిజన్ సీఓ జీఎస్ గ్రేవాల్ మాట్లాడుతూ, “నూతన కుబోటా MU4201 ట్రాక్టర్ 35 హెచ్‌పీ నుంచి 41-50 హెచ్‌పీ విభాగానికి అప్‌గ్రేడ్ చేసుకోవాలని కోరుకుంటున్న రైతుకు అధిక-నాణ్యత ఉత్పత్తిని అందిస్తుంది. భారతదేశం వ్యాప్తంగా, ట్రాక్టర్‌ను పరిచయం చేయాలని, ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానాలలో మా ప్రస్తుత మార్కెట్ స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు ప్రణాళిక రూపొందించుకున్నాము. దీనితో పాటు అప్‌గ్రేడ్ చేసిన కుబోటా MU4501, MU5502 ఇప్పుడు వాటి ప్రస్తుత ప్రీమియం లక్షణాలతో పాటు, అత్యుత్తమ తరగతి హైడ్రాలిక్ లిఫ్ట్‌ను అందిస్తున్నాయి’’ అని వివరించారు.