Thursday, March 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమూడో విద్యుత్‌ డిస్కం ఏర్పాటు

మూడో విద్యుత్‌ డిస్కం ఏర్పాటు

- Advertisement -

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
టీజీఆర్‌పీడీసీఎల్‌గా నామకరణం
సీఎండీగా ముషారఫ్‌ అలీ ఫరూఖీ నియామకం
కొత్త డిస్కం పరిధిలోకి వ్యవసాయ, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ తదితర ప్రభుత్వ సేవలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణలో మూడో విద్యుత్‌ డిస్కంను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇందన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త సంస్థకు తెలంగాణ రైతు పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (టీజీఆర్‌పీడీసీఎల్‌)గా నామకరణం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు విద్యుత్‌ పంపిణీ సంస్థలున్నాయి. దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్‌) 15 జిల్లాలకు, ఉత్తర ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్‌) 18 జిల్లాలకు సేవలందిస్తోంది.

కొత్త డిస్కం అన్ని జిల్లాలకు సేవలందించనుంది. రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాలు(ఎల్‌ఐఎస్‌), కాంపోసిట్‌ ప్రొటెక్టెడ్‌ వాటర్‌ స్కీమ్స్‌ (సీపీడబ్ల్యూఎస్‌), మిషన్‌ భగీరథ నీటి సరఫరా వ్యవస్థలు, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై సీవరేజ్‌ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ) పరిధిలోని కనెక్షన్లు, డీటీఆర్‌ కేటగిరీ పరిధిలోని మున్సిపల్‌ నీటి సరఫరా కనెక్షన్లు కొత్త సంస్థ పరిధిలోకి రానున్నాయి. విద్యుత్‌ సరఫరా విస్తరణ, కేటాయించిన పీపీఏ వాటా ప్రకారం విద్యుత్‌ కొనుగోలు నిర్వహణ, కొత్త వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల బోర్డింగ్‌ ప్రక్రియ నిర్వహణ, టీజీఆర్‌పీడీసీఎల్‌ పరిధిలోని ఆస్తుల (డీటీఆర్‌, ఎల్టీ లైన్లు) నిర్వహణ, మెయింటనెన్స్‌ను కొత్త డిస్కం పర్యవేక్షిస్తుంది.

ప్రభుత్వ పథకాల వినియోగ విద్యుత్‌ను డీటీఆర్‌ మీటరింగ్‌ ద్వారా అకౌంటింగ్‌ చేయడం, అవసరమైన రెగ్యులేటరీ ఫైలింగ్స్‌ వంటి ముఖ్య కార్యకలాపాలు నిర్వహిస్తుంది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ముషారఫ్‌ అలీ ఫరూఖీని కొత్త డిస్కం సీఎండీగా ఇప్పటికే నియమించారు. ఆయనతో పాటు సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు మరో నలుగురు డైరెక్టర్లను నియమించింది. దక్షిణ, ఉత్తర తెలంగాణ పంపిణీ సంస్థల్లో డైరెక్టర్లుగా పనిచేస్తున్న వి.తిరుపతిరెడ్డి, పి.కృష్ణారెడ్డి, వి.మోహన్‌రావు ఎన్‌.నరసింహులు సంస్థ పాలక మండలి సభ్యులుగా వ్యవహరించనున్నారు. వ్యవసాయ రంగానికి విద్యుత్‌ సరఫరా నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం, రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.

2 వేల మంది ఉద్యోగు కేటాయింపు
కొత్త డిస్కం నిర్వహణ కోసం రెండు డిస్కంల పరిధిలో ఉన్న విద్యుత్‌ సిబ్బందిని విభజించి 2వేల మందిని కొత్త డిస్కంకు కేటాయిస్తారు. ఇందులో 660 మంది ఇంజనీర్లు, 1,000 మంది ఆపరేషన్‌, మెయింటెనెన్స్‌ సిబ్బంది, 340 మంది పాలనాపరమైన సిబ్బంది ఉంటారు. రెండు డిస్కంల నుంచి కేటాయించిన సిబ్బందితో పాటు సంస్థ నిర్వహణకు అవసరమైన అధికారులు, సిబ్బందిని ప్రత్యక్ష నియామకాలు లేదా అవుట్‌సోర్సింగ్‌ విధానం ద్వారా సమకూర్చుకోవాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -