ఫ్యాషన్‌కు పర్యావరణాన్ని జోడించాలి
దానికోసం యువత, మహిళలకు ప్రత్యేక శిక్షణ
పెట్టుబడిదారులు టెక్స్‌టైల్‌రంగంపై దృష్టిపెట్టాలి : ఏషియన్ టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో గ్రీన్ టెక్స్‌టైల్ హబ్‌లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. ఫ్యాషన్‌ను పర్యావరణానికి జోడిస్తూ అద్భుతాలు సృష్టించొచ్చనీ, దానికోసం యువత, మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. సంప్రదాయ ఆలోచనలకు ఆధునిక టూల్స్‌తో కలిపి డిజైన్, కటింగ్, స్టిచ్చింగ్‌లో ఉపయోగించేలా ఈ శిక్షణా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. తెలంగాణలో టెక్స్‌టైల్‌రంగం కేవలం వ్యాపారం మాత్రమే కాదనీ, అది ఇక్కడి ప్రజల జీవన విధానం, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని చెప్పారు. శుక్రవారంనాడిక్కడి హెచ్‌ఐసీసీలో 13వ ఏషియన్ టెక్స్‌టైల్ కాన్ఫరెన్స్- 2026 లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ తదితరులతో కలిసి అక్కడ ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. స్టాల్స్ మొత్తం కలియతిరిగారు.
నిర్వాహకులతో మాట్లాడారు. ఆయా డిజైన్ల రూపకల్పన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాన్ఫరెన్స్‌ను ప్రారంభించిన ఆయన రాష్ట్రంలో ఏఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయో వాటి వివరాలు వెల్లడించారు. టెక్స్‌టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.భారతదేశానికి అత్యుత్తమ వస్త్రాలను తయారు చేసిన గొప్ప చరిత్ర ఉందనీ, శతాబ్దాలుగా కళలు, సంస్కృతి , సంప్రదాయాలను టెక్స్‌టైల్ రంగంలో పరిపూర్ణంగా తీర్చిదిద్దడం అనవాయితీగా వస్తున్నదని వివరించారు. ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా సంప్రదాయంలో భాగంగానే ముఖ్యమంత్రి హోదాలో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి పట్టు వస్త్రాలు సమర్పించామని చెప్పారు.
తెలంగాణ ప్రజల డీఎన్‌ఏలోనే చేనేతరంగం ముడిపడి ఉందనీ, ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపారులు హైదరాబాద్‌కు వచ్చి వస్త్రాలు, ముత్యాలు కొనుగోలు చేస్తారని తెలిపారు. టెక్స్‌టైల్ రంగాన్ని తాము పరిశ్రమగా చూడబోమనీ, దాన్ని ఇక్కడి ప్రజల జీవనాధారంగా పరిగణిస్తామన్నారు. పోచంపల్లి ఇక్కత్ నుంచి గద్వాల్ చీరలు, వరంగల్ దుర్రీస్ నుండి నారాయణపేట చేనేత వరకు అనేక ఉత్పత్తులు ఇక్కడ ఉన్నాయని చెప్పారు. దీనికి అనేక చారిత్రక కారణాలు కూడా ఉన్నాయని వివరించారు. దేశం మొత్తం మీద తెలంగాణలో నాణ్యమైన పత్తి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉందనీ, అందువల్లే ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉందన్నారు. రాష్ట్రంలో పండిన పత్తి లండన్, న్యూయార్క్, పారిస్, మిలాన్, టోక్యో, దుబాయ్ ఫ్యాషన్ షోల వరకు భాగస్వామిగా ఉందన్నారు.
వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో నైపుణ్యంతోపాటు ప్రజల్లో సంకల్పం కూడా ఉందనీ, దానికి ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఆధునిక సాంకేతికతతో పాటు డీప్ టెక్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్, ఎనర్జీ వంటి పలు రంగాల్లో రాష్ట్రం ముందంజలో ఉందని వివరించారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌లోని అంశాలను ప్రస్తావించారు. 2047 నాటికి తెలంగాణను దక్షిణ ఆసియాలో టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. దానిలో భాగంగానే ప్రభుత్వం తరఫున మౌలిక సదుపాయాలు, భూమి, విద్యుత్, నీరు, ప్రోత్సాహకాల్లో వేగవంతమైన అనుమతులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి టాలివుడ్, బాలివుడ్‌తో పాటు కొత్తగా హాలీవుడ్ కూడా వచ్చేసిందనీ, ఇటీవలే ఆ స్టూడియోలను ప్రారంభించామని గుర్తుచేశారు. సినిమా రంగం తమ ఫ్యాషన్‌ను తెలంగాణ ప్రారంభించేలా ప్రోత్సహిస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధికి విజయవంతమైన భాగస్వాములతో కలిసి సరికొత్త భవిష్యత్‌ను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.



