రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం, పెద్ద ధన్వాడ వద్ద నిర్మించతలపెట్టిన ఇథనాల్ (ఇథైల్ ఆల్కహాల్) తయారీ పరిశ్రమతో పర్యావరణ, అనారోగ్య సమస్యలొస్తాయని స్థానిక రైతులు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. తుంగభద్ర నది ఒడ్డున ముప్ఫయి ఎకరాల్లో రూ.190 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ, చుట్టుపక్కల పన్నెండు గ్రామాల నివాసితుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున. ఇది ఒక జీవ ఇంధనం అయినప్పటికీ దాన్ని తయారు చేసే విధానం నీటి కాలుష్యానికి, వాయు, నేల, ఇతరత్రా అనేక కాలుష్యాలకు దారితీస్తుంది. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (ఇబిపి) కార్యక్రమంలో పెట్రోల్‌కు కొద్ది పరిమాణంలో దీన్ని కలుపుతారు. ఉదారణకు తొంభై శాతం పెట్రోల్‌లో పదిశాతం ఇథనాల్ కలిపితే దానిని ఇ10 పెట్రోల్ అని, 80శాతం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపితే దాన్ని ఇ20 పెట్రోల్ అని పిలుస్తారు. ప్రత్యామ్నాయ, పర్యావరణ అనుకూల ఇంధనాల వాడకాన్ని ప్రోత్సాహానికంటూ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం జనవరి, 2003లో ప్రారంభించింది.
రవాణారంగంలో మొత్తం చమురు అవసరాల్లో 85 శాతం భారత దేశం దిగుమతి చేసుకుంటున్నది. 98 శాతం శిలాజ ఇంధనాలు వాడుతుండగా కేవలం రెండుశాతం మాత్రమే జీవ ఇంధనాలు వాడబడుతున్నాయి. మనదేశంలో ఇథనాల్ ఉత్పత్తికి ప్రధానంగా చెరకు ప్రాసెసింగ్ ఉప ఉత్పత్తి అయిన మొలాసిస్‌పై ఆధార పడింది. చెరుకు సాగు అధిక మొత్తంలో నీటిని వినియోగించుకోవడం వలన భూగర్భ జలాలు కూడా క్షీణిస్తాయి. అయితే ఈ ఏకైక మార్గం పెట్రోల్‌కు 20శాతం ఇథనాల్(ఇ20 పెట్రోల్) కలిపే లక్ష్యాన్ని సాధించడానికి సరిపోదని నిరూపించబడింది. (వినియోగదారుల వ్యవహారాలు, ఆహార,ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ, 2023). తత్ఫలితంగా, మొక్కజొన్న, దెబ్బతిన్న ఆహార ధాన్యాలు(డిఎఫ్‌జి), భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ)ద్వారా లభించే బియ్యం వంటి ప్రత్యామ్నాయ వనరుల ద్వారా అవసరమైన ఇథనాల్ ఉత్పత్తిని సాధించాలని కేంద్రం నిర్ణయించింది. అందుకు ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమానికి అవసరమైన ఇథనాల్ తయారీ కోసం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ మొక్కజొన్న,ధాన్యం, చెరకు ఆధారిత అనేక ఇథనాల్ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది. తెలంగాణ, ఏపీలోని ప్రతిపాదిత ఇథనాల్ తయారీ పరిశ్రమల్లో ఎక్కువ భాగం ధాన్యం ఆధారితమైనవి.
ఈ పరిశ్రమలు అసిటాల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్, అక్రోలిన్, హెక్సేన్ వంటి ప్రమాద కరమైన వాయు కాలుష్య కారకాలను (హెచ్‌ఎపి/టి) విడుదల చేస్తాయి. నేల, నీరు, గాలిని కలుషితం చేస్తాయి. ఇవి శ్వాసకోశ వ్యాధులు నుండి క్యాన్సర్ వరకు అనేక అనారొగ్య సమస్యలను కలిగి స్తాయని పరిశోధనలో గుర్తించారు. గాలిలోకి ఈ కాలుష్య కారకాలు విడుదల కావటం వలన చుట్టపక్కల గ్రామాల్లోకి ఈవిషవాయువులు ప్రవేశించటమే కాక గ్రామాల్లో వాసనను కలుగచేస్తాయి.అంతర్జాతీయ వర్గీకరణల ప్రకారం, ఎసిటాల్డిహైడ్‌ను, ఫార్మాల్డి హైడ్‌ను, అక్రోలిన్ లను మానవులకు క్యాన్సర్ కారకాలుగా వర్గీకరించారు. హెక్సేన్ వంటి కాలుష్య కారకాలకు గురికావడం వల్ల తిమ్మిరి, జలదరింపు, బలహీనత వంటి తీవ్రమైననాడీ సంబంధిత ప్రభావాలకు గురవుతారు. దేశంలో పర్యావరణ క్లియరెన్స్ నివేదికల నుండి ఈ కాలుష్య కారకాలను తొలగిం చడం వల్ల ఇథనాల్ ప్లాంట్ల సమీపంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీవ్రమైన అనారోగ్యం బారిన పడతారు. అలాగే ఇథనాల్ ఉత్పత్తికి మొక్కజొన్న, బియ్యం,చెరకు వంటి ఆహార పంటలను ఉపయోగించడం ఆహార భద్రతపై కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఆహార ధాన్యాలను ఉపయోగించే ఇథనాల్ పరిశ్రమల వలన గణనీయమైన కాలుష్యం విడుదలయ్యే అవకాశం ఉంది. అందుకే వీటిని రెడ్ కేటగిరీ పరిశ్రమలుగా గుర్తించారు. అంటే ఇవి అరవై, అంతకంటే ఎక్కువ కాలుష్య సూచిక స్కోరు కలిగిన పారిశ్రామిక రంగాలు.
ఇథనాల్ ఉత్పత్తి చేయడానికి ఆహార ధాన్యాలకు డిమాండ్ పెరగడం వల్ల వ్యవసాయ పద్ధతులు మారిపోయి పంటపొలాలు నిస్సారవంతంగా మారిపోతాయి. ఇథనాల్ ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఒకే పంటను తరచూ పండించటం వలన నేలలో సేంద్రీయ పదార్థాల పరిమాణం, కార్బన్ నిల్వచేసే సామర్థ్యం తగ్గి పోతుంది. ఇథనాల్ ఉత్పత్తి కోసం పంట అవశేషాలను (గడ్డి వంటివి) తొలగించడం వలన నేల కోతకు గురవుతుంది. ఇథనాల్ పరిశ్రమల నుండి వెలువడే కలుషిత నీరు, భూగర్భ జలాలను, చెరువులు వంటి ఉపరితల నీటి వ్యవస్థలను కాలుష్య జలముగా మార్చివేయటం వలన గ్రామాల్లో నీటి కొరత ఏర్పడుతుంది. ఈ నీటిని తాగిన జంతువులు చనిపోతాయి. నారాయణపేట జిల్లాలోని, చిత్తనూర్ గ్రామంలో ఇథనాల్ పరిశ్రమ ద్వారా విడుదలయ్యే వ్యర్థ జలాల్లో ఆమ్లాలు, భారీ లోహాలు కలిగిఉండి చుట్టుపక్కల గ్రామాలకు సరఫరా చేసే ప్రధాన నీటి వనరుల్లో చేరాయి.దీంతో గ్రామస్తులకు చర్మవ్యాధులు సంభవించాయి. అందుకే గద్వాల రైతులు ఈ పరిశ్రమను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ముప్పు తెచ్చే పరిశ్రమలను అనుమతించకూడదు.
శ్రీధరాల రాము 9441184667