Monday, January 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాకు ఈయూ షాక్‌

అమెరికాకు ఈయూ షాక్‌

- Advertisement -

వాణిజ్య ఒప్పందానికి పార్లమెంట్‌ బ్రేక్‌
ట్రంప్‌ చర్యను నిరసించిన సభ్యులు

బ్రస్సెల్స్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గ్రీన్‌లాండ్‌తో ముడిపడిన సుంకాలు విధించిన నేపథ్యంలో ఆ దేశంతో గతంలో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని ధృవీకరించేందుకు యూరోపియన్‌ పార్లమెంట్‌ ససేమిరా అంది. జీరో-టారిఫ్‌ ఒప్పందాన్ని ముందుకు తీసుకొని వెళ్లడం సాధ్యపడదని, ప్రతి చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంటామని పార్లమెంట్‌ సభ్యులు హెచ్చరించారు. డెన్మార్క్‌ అధీనంలో ఉన్న గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి ఈయూ దేశాలపై ట్రంప్‌ సుంకాలు విధించారు. దీనిపై ఆగ్రహించిన ఈయూ పార్లమెంట్‌… అమెరికాతో గతంలో కుదుర్చుకున్న చారిత్రక ట్రాన్స్‌ అట్లాంటిక్‌ వాణిజ్య ఒప్పందానికి ఆమోదం తెలపకుండా పక్కన పెట్టింది. దీంతో గత సంవత్సరం కుదిరిన ఈ ఒప్పందం భవిష్యత్తు గందరగోళంలో పడింది. యూరోపియన్‌ పార్లమెంటులో వివిధ రాజకీయ పక్షాలు అమెరికా చర్యను నిరసించాయి. ట్రంప్‌ బెదిరింపులకు పాల్పడుతున్నందున ఒప్పందాన్ని ధృవీకరించవద్దని యూరోపియన్‌ పీపుల్స్‌ పార్టీ అధ్యక్షుడు మాన్‌ఫ్రెడ్‌ వెబర్‌ సభ్యులను కోరారు.

గత సంవత్సరం జూలైలో ఈయూ-అమెరికా ఒప్పందంపై ట్రంప్‌, యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డర్‌ లెయాన్‌ సంతకాలు చేశారు. వాణిజ్య సంబంధాలను స్థిరంగా ఉంచే ఉద్దేశంతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈయూ వస్తువులపై అమరికా సుంకాలు పదిహేను శాతం మాత్రమే ఉండేలా ఈ ఒప్పందంలో నిర్దేశించారు. అదే విధంగా అమెరికా ఎగుమతులపై ఈయూ సుంకాలేవీ విధించదు. కాగా గ్రీన్‌లాండ్‌ విషయంలో యూరప్‌పై అమెరికా ఒత్తిడి పెంచడంతో సంబంధాలకు విఘాతం ఏర్పడింది. అట్లాంటిక్‌ దీవి అయిన గ్రీన్‌లాండ్‌లో యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు తమ దళాలను స్వల్పంగా మోహరించిన నేపథ్యంలో ఆయా దేశాలపై ట్రంప్‌ పది శాతం అదనపు సుంకాన్ని విధించారు. జూన్‌ 1వ తేదీన ఈ టారిఫ్‌ పాతిక శాతానికి పెరుగుతుందని చెప్పారు. గ్రీన్‌లాండ్‌ను పూర్తిగా హస్తగతం చేసుకునే వరకూ ఈ సుంకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అయితే ఉత్తర అట్లాంటిక్‌లో రష్యా, చైనా దేశాల కార్యకలాపాలు పెరుగుతున్నాయంటూ ట్రంప్‌ హెచ్చరించినందునే తమ సైన్యాన్ని పంపామని, అంతేకానీ వాషింగ్టన్‌ను రెచ్చగొట్టడానికి కాదని యూరోపియన్‌ నేతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -