Wednesday, January 21, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఇరకాటంలో ఐరోపా : అమెరికాను ప్రతిఘటిస్తుందా! రాజీ పడుతుందా!!

ఇరకాటంలో ఐరోపా : అమెరికాను ప్రతిఘటిస్తుందా! రాజీ పడుతుందా!!

- Advertisement -

ప్రపంచ పరిణామాలు సామాన్యుల ఊహకంద కుండా మారుతున్నాయి. అనేక దేశాల, దేశాధినేతల బండారాలు బయట పెడుతున్నాయి. కడుపులో చల్ల కదలకుండా కాలు మీద కాలు వేసుకు కూర్చుందామంటే కుదరదు. అదియును సూనృతమే.. ఇదియును సూనృతమే అంటూ రెండు పక్షాలనూ సంతుష్టీకరిం చాలంటే జరిగేది కాదు. భారత్‌ వైఖరి సరిగ్గా అలాగే ఉన్నది. అయితే, ఇక్కడ ప్రస్తుతం అమెరికా బెదిరింపులపై ఐరోపా స్పందన గురించి విశ్లేషించు కుందాం. డోనాల్డ్‌ ట్రంప్‌ 2018లో కమ్యూనిస్టు చైనా మీద పన్ను ఉగ్రవాద దాడులను ప్రారంభించగానే అనేక మంది సంతోషించారు.చైనా వస్తువుల ధరలు పెరిగితే అంతకంటే చౌకగా అమెరికాకు ఎగుమతి చేసి లాభం పొందవచ్చని డాలర్‌ కలలు కన్నారు. ఇప్పుడదే ట్రంప్‌ తన పరబేధాలు లేకుండా బస్తీమే సవాల్‌ అందరి సంగతి చూస్తా అంటూ కొరడా ఝళిపిస్తుంటే దిక్కుతోచక దిక్కులు చూస్తున్నారు.చైనా మూడు చేపల కథలో దీర్ఘదర్శి మాదిరి జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోతున్నది. ప్రస్తుతం ఐరోపా ఇరకాటంలో పడింది. మదురోను కిడ్నాప్‌ చేసి వెనెజులా చమురు సంపదలన్నింటినీ స్వంతం చేసుకుంటా మన్నపుడు దానికి పట్టలేదు. ఇప్పుడు డెన్మార్క్‌లోని స్వయం పాలిత ప్రాంతం గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామనగానే ఐరోపా సమాఖ్యకు గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది. ఆర్కిటిక్‌ సముద్రంలోని ఆ మంచుదీవిని అన్నమాట ప్రకారం స్వాధీనం చేసుకోకపోతే అమెరికన్ల దృష్టిలో ట్రంప్‌ చులకన అవుతాడు. ఆక్రమించుకుంటే ఐరోపా సమాఖ్య అభాసుపాలవుతుంది. ఆపరేషన్‌ ఆర్కిటిక్‌ ఎండ్యూరెన్స్‌(ఆర్కిటిక్‌ ప్రాంతానికి బాసట) పేరుతో పరిమిత వన్యాసాలు జరిపేందుకు గ్రీన్‌లాండ్‌కు మద్దతుగా పన్నెండు దేశాలు మిలిటరీ అధికారులు, సిబ్బందిని పంపేందుకు నిర్ణయించాయి, కొన్ని దేశాల నుంచి ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. నిజంగా అమెరికా దురాగతానికి దిగి బలవంతంగా స్వాధీనానికి పూనుకుంటే వారు చేతులెత్తేయటం తప్ప చేసేదేమీ ఉండదు.
అయితే ఈ మాత్రానికే ఆగ్రహించిన ట్రంప్‌ ధిక్కారమును సైతునా అంటూ ఐరోపా దేశాల వస్తువుల మీద ఫిబ్రవరి ఒకటి నుంచి అదనపు సుంకాలు విధిస్తానని ప్రకటించాడు.


అయితే దీనికి ప్రతిగా తాము కూడా అమెరికా వస్తువులపై 108 బిలియన్‌ డాలర్ల మేర ప్రతి సుంకాలు విధించేందుకు ఆలోచిస్తున్నట్లు ఐరోపా సమాఖ్య ప్రకటించింది. తోటి నాటో దేశాన్ని మరో సభ్య దేశం ఆక్రమించుకోవటం ఏమిటి అని గట్టిగా ఖండించలేక ఆమోదించలేక ఇతర దేశాలు సతమతమవు తున్నాయి. గ్రీన్‌లాండ్‌ మా ఒక్కరి భద్రతకోసమే కాదు, ఐరోపా రక్షణకూ అవసరమే అని, తాము స్వాధీనం చేసుకోకపోతే రష్యా, చైనా ఆక్రమిస్తే మీకు అంగీకారమేనా అంటూ ట్రంప్‌ యంత్రాంగం ఎదురుదాడికి దిగింది. ఐరోపా యూనియన్‌ పరిస్థితిని చూస్తే అమెరికాను ఎదిరించే స్థితిలో లేదు. గత ఎనిమిది దశాబ్దాలుగా ఐరోపా రక్షణ బాధ్యత పేరుతో నాటో ఖర్చులో అధిక భాగం అమెరికా భరించింది. ఆ మేరకు పొదుపు మొత్తాలను పారిశ్రామిక, వాణిజ్య, సేవా రంగాలకు మళ్లించిన ఐరోపా అనేక విధాలుగా రెండు ప్రపంచ యుద్ధ నష్టాల నుంచి కోలుకున్నది. ఐరోపా నుంచి అమెరికా దిగుమతులు ఎక్కువగా చేసుకుంటున్నది. ఉభయుల వాణిజ్యలావాదేవీల విలువ 2024లో 976 బిలియన్‌ డాలర్లు ఉండగా అమెరికా వస్తు ఎగుమతులు 370 బిలియన్‌ డాలర్లు మాత్రమే. అందుకే దిగుమతి పన్ను అదనంగా వేస్తా అని ట్రంప్‌ బెదిరిస్తున్నాడు. ఇది ఐరోపా బలహీనత కాగా అదే పరిస్థితి అమెరికాకూ ఉంది, 2015-19 సంవత్సరాలతో పోలిస్తే 2020-24 నాటికి అమెరికా నుంచి ఐరోపా దేశాలు దిగుమతి చేసుకున్న ఆయుధాలు 28 నుంచి 52శాతానికి పెరిగాయి. ముఖ్యంగా ఉక్రెయిన్‌ సంక్షోభం తరువాత ఇది జరిగింది. అందువలన మాతో తెగేదాకా లాగితే ఆయుధ దిగుమతులు తగ్గిస్తామని ఐరోపా సంకేతాలు పంపుతున్నది. అంతే కాదు చైనాతో లావాదేవీలు పెంచుకోవాల్సి వస్తుందని కూడా చెబుతున్నది. అందుకే దాగుడు మూతలాడు తున్నాయి. చైనా ప్రమాదాన్ని చూపి భారత్‌ను తన బుట్టలో వేసుకొనేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా, అదే ఎత్తుగడతో రష్యాను చూపి ఐరోపాను తన అదుపులో ఉంచుకోవాలని చూస్తున్నది. అందుకే అప్పుడప్పుడు మిత్ర వైరుధ్యాలు తలెత్తినప్పటికీ వాటిని శత్రువుల స్థాయికి తీసుకువెళ్లకుండా రాజీపడుతున్నాయి. ఇది ఎల్లకాలమూ సాధ్యమౌతుందా?

తన ఆర్థిక బలం, మిలిటరీ బలగాలను చూపి గరిష్టంగా లబ్దిపొందేందుకు, ప్రభావాన్ని మరింతగా పెంచుకొనేందుకు అమెరికా పూనుకుంది.అయితే బలహీనమైన అంశాల పట్ల కఠినంగా, బలమైన వాటి పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది ఐరోపా. దాన్లో భాగమే అమెరికా వస్తువులపై పన్ను వేస్తామని హెచ్చరించటంగా చెప్పవచ్చు. అట్లాంటిక్‌ దేశాల మధ్య ఇదొక తీవ్రమైన సంక్షోభానికి గుర్తు అని తాజా పరిణామాల గురించి ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక వ్యాఖ్యానించింది. అంత తేలికగా అమెరికా ఒత్తిడికి ఐరోపా లొంగే అవకాశాలు లేవని కొందరు చెబుతున్నారు. ట్రంప్‌ను సంతుష్టీకరించేందుకు ఇప్పటి వరకు ఐరోపా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్లుగా చెబుతున్నారు. గ్రీన్‌లాండ్‌ కావాల్సిందేనని ఆదివారం నాడు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ మరోసారి చెప్పాడు. ఆ ప్రాంతం అమెరికాలో అంతర్భాగం గాకపోతే రక్షణ అసాధ్యమన్నాడు. రక్షణ పేరుతోనే క్రిమియా ద్వీపాన్ని రష్యా స్వాధీనం చేసుకోవటాన్ని విమర్శించేవారు గ్రీన్‌లాండ్‌ విలీనాన్ని ఎలా సమర్ధించు కుంటారన్న ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా తమ చర్య అందరికీ మం చిదని, యూరోపియన్స్‌ దీన్ని అర్ధం చేసుకుంటారని భావిస్తున్నా అని మాత్రమే బెసెంట్‌ చెప్పాడు. ట్రంప్‌ ఈ విషయంలో వెనక్కు తగ్గకపోతే అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందానికి ఐరోపా పార్లమెంటు ఆమోద ముద్రవేసే అవకాశం లేదని వార్తలు వచ్చాయి. బలవంతంగా ఒప్పించటాన్ని వ్యతిరేకించే సమాఖ్య 2023 నాటి ఆయుధంతో అమెరికాను దెబ్బతీయాలని ఫ్రాన్సు పిలుపునిచ్చింది. ఒకవైపు అమెరికాను అడ్డుకోవాలని అంటున్న ఐరోపా దేశాల మధ్య పూర్తి ఏకాభిప్రాయం లేదు. గ్రీన్‌లాండ్‌ ప్రాంతంలో మిలిటరీ విన్యాసాలకు దూరంగా ఉండాలని జర్మనీ నిర్ణయించింది. శుక్రవారం నాడు వచ్చిన జర్మనీ మిలిటరీ బృందం ఆదివారం నాడు వెనక్కి వెళ్లింది. అమెరికా ఒత్తిడి తప్ప మరొక కారణం లేదు. ఈ మిలిటరీ విన్యాసంలో పాల్గొన్నదేశాల మీద ప్రత్యేకించి పన్నులు విధించాలని ట్రంప్‌ నిర్ణయించినట్లు కూడా వార్తలొచ్చాయి. ఫిబ్రవరి ఒకటి నుంచి అన్నమాట ప్రకారం పన్నులు వేస్తారా లేక బేరసారాల కోసం వాయిదా వేస్తారా అన్నది చూడాల్సి ఉంది.

ఐరోపా ప్రతిపన్ను హెచ్చరిక కూడా ఎత్తుగడలో భాగమే అంటున్నారు. అమెరికాతో తెగతెంపులు చేసుకుంటే ఎనిమిది దశాబ్దాలుగా అనుసరించిన విధానాలన్నింటినీ మార్చుకోవాల్సి ఉంటుంది. అది ఒక్క గ్రీన్‌లాండ్‌తోనే సమసిపోదు. మొత్తం నాటో కూటమి ఉనికి ప్రశ్నార్ధకమవుతుంది. ప్రపంచ బలాబలాల్లో వచ్చే మార్పులు తమకు లాభదాయకమా లేక అమెరికాతో ఉంటేనే మంచిదా అన్న మదింపు జరిగిన తరువాత నిర్ణయాత్మక పరిణామాలు జరుగుతాయి తప్ప ఇప్పటికిప్పుడు జరిగే అవకాశాలు పరిమితం. అసలు గ్రీన్‌లాండ్‌తో నిమిత్తం లేకుండానే ఎప్పటి నుంచో ఐరోపా మీద వత్తిడి తెచ్చేందుకు అమెరికా ఒక వ్యూహం అనుసరిస్తున్నదని చెబుతున్నారు. గతేడాది డిసెంబ రులో జాతీయ భద్రతా వ్యూహం పేరుతో రూపొందించిన పత్రంలో ఐరోపా సమాఖ్యలో రాజకీయ స్వేచ్ఛను బలహీన పరుస్తున్నారని, రాజకీయ వ్యతిరేకతను, భావ ప్రకటనా స్వేచ్చను అణచివేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. మరోవైపు ఐరోపాలో ఇటీవలి కాలంలో తలెత్తిన మితవాద జాతీయోన్మాద శక్తులను అమెరికా ప్రోత్సహిస్తున్నట్లు ఈ విమర్శల మర్మం అంటున్నారు. విద్వేష ప్రసంగాలను అదుపు చేసే చర్యల్లో భాగంగా ఇంటర్నెట్‌లో చొప్పిస్తున్న వాటిని నిరోధించేందుకు చర్యలు తీసుకున్న సాంకేతిక విభాగ ఐరోపా మాజీ కమిషనర్‌ తియెరీ బ్రెటన్‌పై అమెరికా ఆంక్షలు విధించటం కూడా ఒత్తిడిలో భాగమే అంటున్నారు. అమెరికా కంపెనీల పట్ల నిబంధనలను చూసీచూడనట్లు పోవాలని, వాటికి అవకాశాలను పెంచాలని ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఒత్తిడి చేస్తున్నారు. అమెరికాను మరోసారి గొప్పదానిగా చేయాలన్న ట్రంప్‌ ఏలుబడిలో అది మరింతగా బరితెగించినట్లు కనిపిస్తోంది. ఐరోపాను ఒక వలస ప్రాంతంగా చూస్తూ తన నిబంధనలను అక్కడ రుద్దాలని చూస్తోందని, అందుకుగాను ఎంతకైనా తెగిస్తోందని ఐరోపా వర్గాలు భావిస్తున్నాయి.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంతగా గతంలో ఎన్నడూ ఐరోపా పట్ల అమెరికా వ్యతిరేకత వెల్లడి కాలేదేని ఐరోపా విశ్లేషకులు చెబుతున్నారు. తమను నాశనం చేయాలని వాషింగ్టన్‌ చూస్తున్నదని ఇనిస్టిట్యూట్‌ ఇంటర్నేషనల్‌ ఎఫైర్స్‌ డైరెక్టర్‌ నతాలీ టోసీ చెప్పారు. ఉదారవాద ప్రజాస్వామ్యం, ఐరోపా ఒక్కటి కావటం తమకు వ్యతిరేకంగా పరిగణిస్తున్నదని కూడా అన్నారు. నాటో అనుకూల ఐరోపా దేశాల్లో అమెరికా పట్ల పునరాలోచనకు నాంది పడింది. గ్రీన్‌లాండ్‌ గురించి అమెరికా చాలా కాలం క్రితమే తన వాంఛను వెల్లడించింది. డెన్మార్క్‌ మిలిటరీ గూఢచార సేవల విభాగం గత డిసెంబరులో తొలిసారి అమెరికా తమ జాతీయ భద్రతకు పెద్ద ముప్పుగా పరిణమించిందని ఒక నివేదికలో పేర్కొన్నది. తన మిత్రదేశాలను కూడా వదలకుండా అధిక పన్నులతో సహా ఆర్ధిక బలాన్ని వినియోగిస్తున్నదని, చివరికి మిలిటరీ ఫోర్సు వినియోగంలో కూడా వదలటం లేదని దానిలో ప్రస్తావించారు. ఈ పూర్వరంగంలోనే డెన్మార్క్‌ ప్రధాని ఫ్రెడరిక్సన్‌ తోటి నాటో సభ్యదేశంపై అమెరికా దాడికి దిగుతానని చెప్పటాన్ని గర్హించారు. భద్రత గురించి అమెరికా మీద అతిగా ఆధారపడటం మంచిదికాదని కొందరు నిపుణులు హెచ్చరించటం పెరుగుతోంది. ఇలా ఆధారపడిన కారణంగా స్వతంత్ర ఆత్మరక్షణ సామర్ధ్యం మీద ప్రభావం పడుతుందని, ఐరోపా మిలిటరీని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. రష్యా, చైనాల రక్షణ బడ్జెట్ల కంటే ఎక్కువగా 2025 ఐరోపా 447 బిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టినందున స్వతంత్ర మిలిటరీని ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదని ప్రశ్నిస్తున్నారు. అయితే పెద్ద మొత్తంలో యూరోలు ఖర్చు చేస్తే ప్రయోజనం లేదని, కీలకమైన గూఢచర్యం, నిఘా, భౌతిక పరిస్థితి వివరాలపై అమెరికా మీద ఆధారపడక తప్పదని, అనేక రంగాలలో ఐరోపా వెనుకబడి ఉందని మరికొందరు చెబుతున్నారు. అణ్వాయుధాలు తమ దగ్గర మాత్రమే సుర క్షితంగా ఉంటాయని అమెరికన్లు భావిస్తున్నారు. బ్రిటన్‌, ఫ్రాన్సు దగ్గర ఉన్నవి అవాంఛనీయ శక్తుల చేతుల్లో పడకుండా చూసేందుకు గాను మొత్తం ఖండ సాంప్రదాయ రక్షణ సామర్ధ్యాలను 2027 నాటికి తమ అదుపులోకి తెచ్చుకోవాలని వాషింగ్టన్‌ కోరుకుంటున్నదని రాయిటర్స్‌ వార్తలో పేర్కొన్న అంశాలు ఐరోపాలో ఆందోళనకు గురిచేశాయి. మొత్తం మీద ఐరోపాలో అమెరికాతో సంబంధాల గురించి ఒక మధనం ప్రారంభమైంది, అది ఏ పరిణామాలు, పర్యవసానాలకు దారితీస్తుందో, ఏ రూపంలో ఉంటుందో చూడాల్సి ఉంది!

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -