Tuesday, May 20, 2025
Homeఅంతర్జాతీయంఖాన్‌ యూనిస్‌ను ఖాళీ చేయండి

ఖాన్‌ యూనిస్‌ను ఖాళీ చేయండి

- Advertisement -

ఇజ్రాయిల్‌ మిలటరీ ఆదేశాలు
గాజాలోకి ప్రాధమిక సాయానికి అనుమతి
తాజా దాడుల్లో 103మంది మృతి

గాజా, జెరూసలేం : గాజాలోనే రెండవ అతిపెద్ద నగరమైన ఖాన్‌ యూనిస్‌ను, ఆ చుట్టపక్కల పట్టణాలను ఖాళీ చేయాల్సిందిగా ఇజ్రాయిల్‌ మిలటరీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సైనిక ప్రతినిధి అవిచారు అదారీ సోమవారం సోషల్‌ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. ఇజ్రాయిల్‌ సైనిక కార్యకలాపాలను విస్తరిస్తోందని, అందులో భాగంగా ఇక ఈ ప్రాంతమంతా ప్రమాదకరమైన యుద్ధ జోన్‌గా పరిగణించబడుతుందని ఆ పోస్టులో పేర్కొన్నారు. కొత్త ఆపరేషన్లతో ఇజ్రాయిల్‌ తన యుద్ధాన్ని మరింత ఉధృతం చేస్తున్న నేపథ్యంలో తాజా ఆదేశాలు వెలువడ్డాయి. ఇప్పటికే వేలాదిమంది రిజర్వ్‌ సైనికులను పిలిపించిన ఇజ్రాయిల్‌ మిలటరీ గాజా ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో పదాతి దళ దాడులను మరింతగా విస్తరించాలని భావిస్తోంది.
మరోవైపు గాజాలోకి ప్రాధమికంగా మానవతా సాయాన్ని పంపేందుకు ఇజ్రాయిల్‌ అంగీకరించింది. గాజాలో నెలకొన్న ఆహార సంక్షోభం కారణంగా తమకొత్త మిలటరీ ఆపరేషన్‌ స్తంభించిపోతోందని అందుకే తాము ప్రాధమిక స్థాయిలోనే ఆహార సాయాన్ని గాజాలోకి అనుమతించాలని భావిస్తున్నట్లు ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజామిన్‌ నెతన్యాహు చెప్పారు. ఈమేరకు తమ కేబినెట్‌ నిర్ణయం తీసుకుందన్నారు. దాదాపు మూడు మాసాలుగా గాజాలోకి ఎలాంటి సాయాన్ని వెళ్లనివ్వకుండా ఇజ్రాయిల్‌ ఆంక్షలు విధించింది. దీంతో పెద్ద సంఖ్యలో మందులు, ఆహారం, ఇతర నిత్యావసరాలను తీసుకువచ్చిన ట్రక్కులు గాజా వెలుపలే నిలిచిపోయాయి. అయితే ఎప్పుడు ఆహార సాయం గాజాలోకి ప్రవేశిస్తుందో స్పష్టమైన సమాచారం లేదు. గాజాలో నెలకొన్న కరువు పరిస్థితులపై ఇప్పటికే అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాల్పుల విరమణకు సంబంధించి తమ కొత్త షరతులు అంగీకరించేలా హమాస్‌పై ఒత్తిడి తీసుకురావాలన్నదే ఇజ్రాయిల్‌ లక్ష్యంగా వుంది.
డజన్ల సంఖ్యలో చిన్నారులు మృతి
కాగా గాజా తాజా దాడుల్లో 103మంది మరణించారు. సోమవారం ఉదయం నుండి మొదలైన దాడుల్లో గంట వ్యవధిలో ఒక ప్రాంతంలో 30 వైమానిక దాడులు జరిగాయని, 60మందికి పైగా మరణించారని, వీరిలో డజన్ల సంఖ్యలో చిన్నారులు వున్నారని వైద్య వర్గాలు తెలిపాయి. ఖాన్‌ యూనిస్‌ నగరానికి చుట్టుపక్కల జరిగిన వైమానిక దాడుల్లో 18మంది చిన్నారులు, 13మంది మహిళలతో సహా 48మంది మరణించారని నాజర్‌ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. జాబాలియా శరణార్ధ శిబిరంలోని ఒక ఇంటిపై జరిగిన దాడిలో 9మంది మరణించారు. మరో భవంతిపై జరిగిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 10మంది చనిపోయారు. కాగా ఇజ్రాయిల్‌ మిలటరీ ఈ మృతులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. చివరిసారిగా కాల్పుల విరమణ ఉల్లంఘన చేసి దాడులు ఉధృతం చేసినప్పటి నుండి ఇప్పటివరకు 3వేల మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -