Friday, October 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరుణాలు చెల్లించినా.. మళ్లీ చెల్లించాలని ఒత్తిడి

రుణాలు చెల్లించినా.. మళ్లీ చెల్లించాలని ఒత్తిడి

- Advertisement -

పురుగుమందు డబ్బాలతో మహిళల నిరసన
వేములవాడ యూనియన్‌ బ్యాంకు ఎదుట ఆగ్రహం


నవతెలంగాణ – వేములవాడ
రుణాలు చెల్లించినా.. మళ్లీ చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ పలువురు మహిళలు పురుగుల మందు డబ్బాలతో వేములవాడలోని యూనియన్‌ బ్యాంక్‌ ఎదుట గురువారం నిరసన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్‌ మండలం కోనాయపల్లి గ్రామానికి చెందిన మహిళలు.. తమ రుణాలను ఇప్పటికే చెల్లించినప్పటికీ, బ్యాంకు అధికారులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల 14న ‘శ్రీనిధి సొమ్ములు స్వాహా’ అనే ప్రత్యేక కథనం నవతెలంగాణలో ప్రచురితమైన విషయం తెలిసిందే. ఆ కథనం వెలువడిన అనంతరం జిల్లా అధికారులు విచారణ ప్రారంభించారు.

ఈ క్రమంలో కొంత మంది మహిళలు గ్రూప్‌ లీడర్లు, ఆర్పీలకు రుణాల డబ్బు చెల్లించినప్పటికీ, వారు ఆ సొమ్మును బ్యాంకులో జమ చేయకుండా తమ అవసరాలకు వాడుకున్నట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారులు సంబంధిత సంఘాల సభ్యులకు నోటీసులు పంపించారు. కోనాయపల్లి మహిళలు ఉదయం బ్యాంకు ఎదుట పురుగుమందు డబ్బాలతో నిరసన చేపట్టారు. తమవద్ద మెప్మా ప్రతినిధులకు చెల్లించిన రసీదులు, ఆధారాలు ఉన్నప్పటికీ, బ్యాంకు అధికారులు బకాయిలు ఉన్నట్టు చూపుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన ఆడిట్‌ తనిఖీల్లో కూడా కొన్ని ఆర్థిక లోపాలు బయటపడ్డట్టు సమాచారం. ఆడిట్‌ అనంతరం బకాయి మొత్తాన్ని చెల్లించాలని అధికారులు సూచించగా, మహిళలు దీన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -