Sunday, March 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపుట్టెడు దు:ఖంలోనూ

పుట్టెడు దు:ఖంలోనూ

- Advertisement -

తండ్రి మృతి చెందినా..
పది పరీక్షలకు హాజరైన తనయులు
మహబూబాబాద్‌లో హత్యకు గురైన తల్లిదండ్రులు.. పరీక్ష రాసిన కూతురు
యాదాద్రి, ఖమ్మం, మెదక్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో హృదయ విదారక ఘటనలు

నవతెలంగాణ-మోత్కూర్‌/శివ్వంపేట/గూడూరు/కల్లూరు
వివిధ రకాల కారణాలతో ఇంటి పెద్ద మృతి చెందగా , ఆ దు:ఖాన్ని దిగమింగుతూనే తనయులు పది పరీక్షలకు హాజరయ్యారు. ఈ హృదయ విదారక ఘటనలు యాదాద్రి, ఖమ్మం, మెదక్‌ జిల్లాలో శనివారం చోటు చేసుకున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం గాంధీనగర్‌కాలనీకి చెందిన కూరేళ్ల ఎల్లయ్య(50) గుండాల మండలం వస్తాకొండూరు ఎంపీపీ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున తన ఇంటి వద్ద గుండెనొప్పి రావడంతో నల్లగొండలోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుని సాయంత్రం ఇంటికి వచ్చాడు. శనివారం తన కొడుకు హర్షవర్ధన్‌కు టెన్త్‌ ఎగ్జామ్‌ ముగిసిన తర్వాత హైదరాబాద్‌లోని ఆస్పత్రికి వెళ్లి చూయించుకుంటానని కుటుంబసభ్యులకు చెప్పాడు.

ఇంతలోనే శుక్రవారం అర్ధరాత్రి మళ్లీ గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన భువనగిరి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. టీచర్‌ ఎల్లయ్య మృతి చెందాడని తెలియడంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం పదోతరగతి పరీక్షలు ప్రారంభం కాగా తండ్రి మృతి చెందిన విషయం తెలిసీ దుఃఖాన్ని దిగమింగుతూనే కొడుకు హర్షవర్ధన్‌ పరీక్షకు హాజరయ్యాడు. మృతునికి భార్య, కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఎల్లయ్య మృతదేహానికి పలువురు పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షులు పైళ్ల సోమిరెడ్డి, జిల్లా నాయకులు గుర్రం లక్ష్మీనరసింహారెడ్డి, అవిశెట్టి అవిలిమల్లు, ఉపాధ్యాయులు, పీఆర్టీయూ నాయకులు పాల్గొన్నారు.

పాంబండలో హృదయ విదారకరం
అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి అకాల మరణం చెందడంతో కొడుకు తండ్రి మృతదేహాన్ని వదిలి పుట్టెడు దుఃఖంతో పది పరీక్షలకు హాజరైన హృదయ విదారకర సంఘటన మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలంలోని పాంబండ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పాంబండ గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజు (45) వృత్తిరీత్యా మేస్త్రీ పనులు చేస్తుండగా అతని భార్య అంజమ్మ కూలీ పనులు చేస్తుంటుంది. నాగరాజు దంపతులకు ముగ్గురు మగ సంతానం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామంలో బంధువుల దశ దినకర్మకు శుక్రవారం అంజమ్మ వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తున్న క్రమంలో ఆమెను భర్త నాగరాజు తన బైక్‌ పై ఎక్కించుకొని స్వగ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో ఉసిరికపల్లి కొట్టాల వద్ద బైక్‌ అదుపుతప్పడంతో కింద పడిన నాగరాజు అక్కడికక్కడే మరణించారు. శనివారం నాగరాజు అంత్యక్రియలు జరగాల్సి ఉండగా అతని రెండో కొడుకు ధనుష్‌ పది పరీక్షలకు వెళ్లాల్సి వచ్చింది.

అనారోగ్యంతో తండ్రి మృతి…
తండ్రి మరణాన్ని దిగమింగి ఓ విద్యార్థి పదో తరగతి వార్షిక పరీక్ష రాసిన హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని బత్తులపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న గండేపల్లి మణికంఠ శనివారం వార్షిక పరీక్షలు రాయాల్సి ఉంది. శుక్రవారం తెల్లవారు జామున తన తండ్రి గండేపల్లి కొండలరావు అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో పరిస్థితి విషమించి మృతిచెందాడు. తండ్రి మరణాన్ని దిగమింగుకొని పదో తరగతి పరీక్షకు హాజరు కావడం తోటి విద్యార్థులు, గ్రామస్తుల హృదయాలను కలచివేసింది. కుటుంబ పెద్ద అర్థాంతరంగా మరణించడంతో ఆ కుటుంబ పరిస్థితి దిక్కు తోచని స్థితిలో ఉంది.

తల్లిదండ్రుల హత్య.. గూడూరులో కూతురు పరీక్షకు..
బతుకుదెరువు కోసం పట్నం వెళ్లి గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో తల్లిదండ్రులు శుక్రవారం రాత్రి దారుణహత్యకు గురి కాగా.. ఆ వార్త తెలియని కూతురు గూడురులో పరీక్షకు హాజరైంది. మృతి వార్తను తండాపెద్దలు, బంధువులు వారి కుమార్తెకు తెలియనీయకుండా దాచిపెట్టారు. వారి కుమార్తె హాస్టల్‌లో ఉంటూ పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతోంది. శనివారం మొదటి పరీక్ష ముగిసిన తరువాత హాస్టల్‌ బాధ్యులు వసంతకు తల్లిదండ్రులు హత్యకు గురైన విషయాన్ని సమాచారం ఇచ్చారు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలోని గన్యచక్రతండాలో చోటుచేసుకుంది. శనివారం తెలుగు పరీక్షకు హాజరై తిరిగి హాస్టల్‌కు చేరుకున్నాక తల్లిదండ్రులు లేరన్న విషయం తెలవడంతో గుండెలవిసేలా రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

తాత మరణించిన దుఃఖంతో పరీక్షకు మనవడు
నారాయణపేట మండలంలోని జలాల్‌ పూర్‌ గ్రామానికి చెందిన అరవింద్‌ పట్టణంలోని శ్రీ హంసవాహిని ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. శనివారం పరీక్షలకు వెళ్లడానికి సిద్ధమవుతుండగా తాత భీంశప్ప (70) తెల్లవారుజామున 5.30 గంటలకు గుండెపోటుతో మృతి చెందారు. బాధతో పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల కేంద్రంలో తెలుగు పరీక్షకు హాజరై మధ్యాహ్నం అంత్యక్రియలకు వెళ్లాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -