2029 ఎన్నికల్లో పోటీకి సిద్ధం
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం
తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత
యాదాద్రి భువనగిరిలో స్వర్ణకారులను కలిసిన ఎమ్మెల్సీ
నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్
”నేను ఎవరూ వదిలిన బాణాన్ని కాదు.. ప్రజలు వదిలిన బాణాన్ని.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తా.. నన్ను మళ్లీ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా పార్టీలోకి రావాలని పిలిచినా వెళ్లేది లేదు.. కారణం చెప్పకుండా.. నేను చేసిన తప్పేమిటో చెప్పకుండా సస్పెండ్ చేసి బయటకు గెంటేశారు..” అని తెలంగాణ జాగృతి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
అన్నారు. తనను ఆపరేట్ చేసే అంత సీన్ ఎవరికీ లేదన్నారు. 2029 ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ చేస్తానని ప్రకటించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్వర్ణకార వృత్తిదారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జాగృతి ‘జనం బాట’ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని వివేరా హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇప్పటివరకు 16 జిల్లాలను పర్యటించి ప్రజా సమస్యలను అధ్యయనం చేస్తూ, వాటిపై పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా నీరు అందలేదని చెప్పారు. పెద్దల భూములను కాపాడేందుకు ట్రిపుల్ ఆర్ కోసం పేదల భూములను బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. రీజనల్ రింగ్ రోడ్ నిర్వాసిత రైతుల పక్షాన తాను పోరాటం చేస్తానని అన్నారు. రాయగిరి, బిఎన్ తిమ్మాపురం, బస్వాపూర్ వంటి ప్రాంతాల రైతులతో మాట్లాడానని, బస్వాపు రం ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో రైతుల భూములు లాగేసుకున్నారని ఆరోపించారు. భూములు, ఇండ్లు కోల్పోయిన బాధలో రైతులు ఉంటే.. వారికి రావాల్సిన పరిహారం ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌లను కొన్నిచోట్ల మూడుసార్లు మార్చినా అంగీకరించబోమని ఆమె చెప్పారు. ఈ విషయమై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై ఇద్దరు మంత్రుల పనితీరును ప్రశ్నించారు. పేద విద్యార్థులకు వెంటనే బోధనా రుసుములు విడుదల చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
స్వర్ణకారులను కలిసి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్సీ
స్వర్ణకార వీధిలో స్వర్ణకారులను కవిత కలిశారు. స్వర్ణకారులే పుస్తె, మెట్టెలు చేసే జీవో రావాలి అని భువనగిరి స్వర్ణకార సంఘం అధ్యక్షులు ఇటిల దేవేందర్ చారి కవిత దృష్టికి తీసుకొచ్చారు. దానికి ఆమె.. తాము అధికారంలోకి వచ్చాక.. పుస్తె, మెట్టెలు షోరూంలలో అమ్మకుండా జీవో తీసుకొచ్చి తన మొదటి సంతకం పెడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి బీసీ సెల్ అధ్యక్షులు తంగళ్లపల్లి శ్రీకాంత్, వెల్దుర్తి విక్కీ జిల్లా అధ్యక్షులు కొండపర్తి బాల చారి, మాజీ కౌన్సిలర్ వెల్దుర్తి రఘునాథ్, ఆల్ ఇండియా సిసి నెంబర్ కీసరీ శ్రీకాంత్ చారి, జిల్లా సలహాదారులు సొల్లేటి గోవర్ధన చారి, నర్సింగ్, రోజు సంతోష్, ప్రధాన కార్యదర్శి తంగళ్లపల్లి శ్రీనివాస్‌చారి, పట్టణ కోశాధికారి మునిగటి సాయి కాంత్, జిల్లా కోశాధికారి తంగళ్లపల్లి గిరిధర పాల్గొన్నారు.



