Saturday, September 20, 2025
E-PAPER
Homeజాతీయంజీఎస్టీ శ్లాబులు తగ్గించినా కేంద్రానికి లాభమే

జీఎస్టీ శ్లాబులు తగ్గించినా కేంద్రానికి లాభమే

- Advertisement -

పెరగనున్న వినియోగం
పన్ను వసూళ్లకు మద్దతు : క్రిసిల్‌ రిపోర్ట్‌

న్యూఢిల్లీ : వస్తు సేవల పన్ను (జీఎస్టీ) శ్లాబులను తగ్గించడం ద్వారా ప్రభుత్వానికి పెద్ద నష్టమేమి లేదని రేటింగ్‌ ఎజెన్సీ క్రిసిల్‌ పేర్కొంది. జీఎస్టీ రేటు తగ్గింపు ప్రభుత్వ ఖజానాపై తక్కువ ప్రభావమే చూపనుందని విశ్లేషించింది. వినియోగాన్ని పెంచి, పన్ను ఆదాయాన్ని విస్తరించనుందని పేర్కొంది. జీఎస్టీ శ్లాబులను 5, 18 శాతాలకు పరిమితం చేస్తూ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కొత్త రేట్లు సెప్టెంబర్‌ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.48,000 నష్టం వాటిల్లనుందని.. అయినా కేంద్రం భరించడానికి సిద్దంగా ఉందని బీజేపీ నేతలు పదేపదే ప్రకటనలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే నూతన జీఎస్టీ శ్లాబులతో పెద్ద నష్టమేమీ జరగదని ఇటీవల నిపుణులు, ఏజెన్సీలు పేర్కొనడం విశేషం. ”నూతన రేట్ల వల్ల స్వల్ప కాలంలో రూ.48,000 కోట్ల నష్టం జరగొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం 2024-25లో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.10.6 లక్షల కోట్లుగా ఉన్న నేపథ్యంలో ఆదాయ నష్టం పెద్దగా ఉండదు.” అని క్రిసిల్‌ తన రిపోర్ట్‌లో పేర్కొంది.

కొత్త శ్లాబులతో అనేక ఉత్పత్తులు, సేవల ధరలు తగ్గే అవకాశం ఉందని.. దీంతో పన్నులు విస్తరించడం ద్వారా మధ్యస్థ కాలంలో రాబడి పెరగనుందని క్రిసిల్‌ విశ్లేషించింది. జీఎస్టీ నూతన శ్లాబులకు ముందు ఆదాయంలో 70-75 శాతం అత్యధిక భాగం 18 శాతం శ్లాబు నుంచే వచ్చేదని గుర్తు చేసింది. 12 శాతం శ్లాబులో కేవలం 5-6 శాతం మాత్రమే రాబడి ఉందని పేర్కొంది. 28 శాతం శ్లాబులో 13-15 శాతం పన్ను రాబడులు నమోదయ్యాయి. గతంలో 12 శాతం పన్ను విధించబడిన వస్తువులపై రేట్లు తగ్గించడం వల్ల పెద్దగా ఆదాయ నష్టం ఉండదని క్రిసిల్‌ వెల్లడించింది. మొబైల్‌ టారిఫ్‌ల వంటి అనేక అధిక వృద్ధి కలిగిన సేవల రేట్లలో మార్పులు లేకుండా ఉన్నాయని తెలిపింది. ఈ-కామర్స్‌ డెలివరీ వంటి కొత్త వర్గాలను 18 శాతం రేటు పరిధిలోకి తీసుకొచ్చారని తెలిపింది. పెద్ద ఎత్తున వినియోగించే వస్తువులపై ప్రయోజనాలు, ఆదాయాన్ని మరింత పెంచి, డిమాండ్‌, వసూళ్లను ప్రోత్సహించవచ్చని క్రిసిల్‌ పేర్కొంది. ఉత్పత్తిదారులు పన్ను మార్పులను వినియోగదారులకు బదిలీ చేయడం అత్యంత కీలకమని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -