Friday, May 30, 2025
E-PAPER
Homeమానవిక‌ద‌లలేకున్నా క‌ళ‌ల్లో మేటి

క‌ద‌లలేకున్నా క‌ళ‌ల్లో మేటి

- Advertisement -

అన్నీ సక్రమంగా ఉన్నా ఇంకా దేనికోసమో ఆరాట పడటం మనిషి సహజ గుణం. ఎంత సంపాదించినా అసంతృప్తిగానే ఉంటారు. ఉన్న జీవితాన్ని ఆస్వాదించాలనీ, తామెంటో నిరూపించుకోవాలని తపించేవారు చాలా తక్కువ. కానీ జీవితం ఓ పోరాటంగా మారినా ఆమె నిత్యం నవ్వుతూనే ఉంటారు. అంగవైకల్యంతో నడవలేక చక్రాల కుర్చీకే పరిమితమైనా ఆమె మనసు మాత్రం పరుగులు పెడుతూనే ఉంది. ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిప్రధాతగా నిలుస్తోంది. ఆమె అద్భుత చిత్ర కారిణి, హస్త కళలలో మేటి శ్రద్ధేష్‌ నందిని. మరి ఆమెను గూరించి మనమూ తెలుసుకుందామా?
శ్రద్ధేష్‌ పేరు ఎంత బాగుందో కదా..! ఆమె పూర్వీకులు ఎన్నో తరాల కిందట యు.పి. నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఇంట్లో హిందీ మాట్లాడుతారు. ఆమె మాత్రం తెలుగు, ఆంగ్లం అనర్గళంగా మాట్లాడటమేకాదు రకరకాల చేతిపనుల్లో నిష్ణాతురాలు. అమ్మ నాన్నలు శిరోమణి శ్రీవాస్తవ, ఎస్‌.ఎస్‌.కరణ్‌. అక్క డాక్టర్‌ దుర్గేష్‌ నందిని. ఈమె గురించి గతవారం మనం ఇదే పేజీలో తెలుసుకున్నాం. చెల్లి అవదేష్‌.
బాధ భరించలేక
రకరకాల పూసలతో అలంకరణ సామగ్రి తయారు చేయడం, పూసలల్లటంతో పాటు కవితలు, వ్యాసాలు రాయడం ఆమె హాబీలు. ఉత్సాహంతో తన బాధను మర్చిపోయి ఇతరులతో సరదాగా నవ్వుతూ తుళ్లుతూ గలగల మాట్లాడే ఆమె తన బాల్యం గురించి గుర్తు చేసుకుంటూ ‘నాకు నాలుగు నెలల వయసులో మా అక్క దుర్గేష్‌ (దాదాపు ఒకటిన్నర రెండేళ్ల వయసులో) పోలియో డ్రాప్స్‌, డి.పి.టి.ఇంజక్షన్‌ ఇవ్వడం రియాక్షన్‌తో అక్కకి ఎడమకాలు, నాకు శరీరమంతా చచ్చుబడింది. ఆ సమయంలో నాన్న ఆర్మీలో పని చేస్తూ యుద్ధ భూమిలో ఉన్నారు. అయినా మమ్ములను బాగు చేసుకోవడం కోసం అమ్మ, నాన్నలు ఎంతో కష్టపడ్డారు. ఎంతో మంది డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లారు. పూనే, బెంగుళూరు ఇలా బంధువులు, మిత్రులు ఇచ్చిన సలహాలతో అనే ప్రాంతాలకు మమ్మల్ని తీసుకెళ్లారు. ఇంగ్లీష్‌ వైద్యంతో నయం కాలేదు. చివరకు ఆయుర్వేదం, హోమియో చికిత్సలకు కూడా నేను కోలుకోలేకపోయాను. అయితే అక్కకి దాదాపు నయమై ఆమె మామూలు మనిషి కావటంతో మా అమ్మానాన్నలకు కాస్త ఊరటకలిగించింది. మహావీర్‌ హాస్పిటల్‌లో సర్జరీ చేశారు. హిమాయత్‌ నగర్‌లో ఒక ప్రైవేట్‌ నర్సింగ్‌ హోంలో నాకు ట్రీట్మెంట్‌ ఇప్పించేవారు. రోజూ ఇంటినుంచి నన్ను తీసుకువెళ్లటం కష్టమని అక్కడ ఉంటి నాకోసం ఒక కేర్‌ టేకర్‌ని ఏర్పాటు చేశారు. కానీ భరించలేని బాధ అనుభవించాను. ఎవరికీ చెప్పుకోలేక నాలో నేనే కుమిలిపోయేదాన్ని. అప్పుడు అనుభవించిన బాధ గుర్తుకు వస్తే ఇప్పటికీ గుండెల్లో వణుకు పుడుతుంది’ అంటూ పంచుకున్నారు.
కొట్టి, తిట్టి హింసించేవారు
శ్రద్ధేష్‌ 8-9 ఏండ్ల పాపగా ఉన్నప్పుడు హిమాయత్‌ నగర్‌లో ఒక డాక్టర్‌ ఇంట్లో ట్రీట్మెంట్‌ కోసం ఉంచారు. అక్కడ ఆమెకు సరిగా తిండి పెట్టకుండా కొట్టి, తిట్టి హింసించేవారు ఆయాతో సహా! కానీ శ్రద్ధేష్‌ తల్లి, బంధువులొచ్చినపుడు మాత్రం ఎక్కడ లేని ప్రేమ ఒలకబోసేవారు. అలా ఏడెనిమిది నెలలు చిత్ర హింసలు అనుభవించిన ఆమె ‘ఈ బాధ భరించడం కన్నా వికలాంగురాలిగా ఉంటేనే నయం’ అనుకునేది. ఇప్పటికీ ఆ పాత జ్ఞాపకాలు ఆమెను తొలిచేస్తుంటాయి.
ఇంట్లోనే చదువు
శ్రద్ధేష్‌కి ఇంట్లోనే అమ్మ, అమ్మమ్మ చదువు చెప్పేవారు. పరీక్షలు రాయడానికి మాత్రమే బడికివెళ్లేది. ఎస్‌.ఎస్‌.సి పరీక్షను ప్రిన్సిపాల్‌ రూంలో కూర్చుని రాసారామె. స్పీడ్‌గా రాయడం కష్టమై అన్ని ప్రశ్నలకు జవాబులు రాయలేకపోయినా ఆమె థర్డ్‌ డివిజన్‌లో పాసయ్యారు. కాలేజీలో ఇంటర్మీడియేట్‌ హిందీ మీడియంలో చదవడం ఆమెకు ఓ కొత్త అనుభవం. అమ్మ రోజూ థర్డ్‌ ఫ్లోర్‌లో క్లాసులో దింపేది. నోట్సులు కూడా రాసి ఇచ్చేది. సాయంత్రం రిక్షాలో ఇంటికి వచ్చేది. క్లాస్‌ పిల్లలు, టీచర్లు ఆమెను ఎంతో ప్రోత్సాహించేవారు. గ్రాడ్యుయేషన్‌ ఇంగ్లీష్‌ మీడియంలో చేశారు. ఇక్కడ చెల్లెలు ఆమెకు ఇచ్చిన చేయూత మాటల్లో చెప్పలేనిది. ఉదయం కాలేజీలో దింపి సాయంత్రం ఇంటికి తీసుకువెళ్లేది. విద్యార్థిగా వ్యాసరచన, వక్తృత్వం.. ఇలా అనేక రకాల పోటీల్లో పాల్గొని శ్రద్ధేష్‌ బహుమతులు సాధించారు. ఇదే ఆమెలో ఇంకా ఏదో సాధించాలనే బలమైన కోరికను కలిగించింది. ఉస్మానియా యూనివర్శిటీలో పి.జి.చేశారామె. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చెల్లి ఆమెతోనే ఉండేది.
– అచ్యుతుని రాజ్యశ్రీ
అద్భుతమై కళాకారిణి
శ్రద్దేష్‌ సాయంత్రం ఫిజియోథెరపీ తర్వాత కె.జి.నుంచి పి.జి.వరకు ఆన్లైన్‌ క్లాసులు తీసుకుంటారు. అంతే కాదు కూర్చీలో ఉండే ఆమె అద్భుతమైన పెంటింగ్‌ చేస్తున్నారు. అలాగే పూసలతో అందమైన వస్తువులు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంట్లో తల్లీ, ఇద్దరు తమ్ముళ్లు, మరదలు ఆమెకు అన్ని విధాల హెల్ప్‌ చేస్తున్నారు. ఆమె ఎక్కడికైనా బయటకు వెళ్లాలంటే అక్క కొడుకు చేతులపై ఎత్తుకొని తీసుకువెళతాడు. ఆబాబు దుర్గేష్‌ కొడుకు ఎం.టెక్‌. చదివాడు. తండ్రి స్నేహితుడు, ఆర్టీసీ ఉద్యోగి అయిన సయ్యద్‌ అమీన్‌ మహ్మద్‌ చేసిన సాయం మరువలేనిది అంటారు ఆమె. ఈమె సాధించిన విజయాలు, చూపిన నైపుణ్యానికి గాను అనేక అవార్డులు వెదుక్కుంటూ వచ్చాయి. సూపర్‌ ఉమన్‌, నారీసమ్మేళన్‌ గోల్డెన్‌ నంది, హిందీశిరోమణి, అబ్దుల్‌ కలాం, వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లెర్నింగ్‌, శక్తిసమ్మాన్‌ ఇలా ఎన్నో ఎన్నెన్నో!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -