Saturday, July 5, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఅరపైసే..అయినా..?

అరపైసే..అయినా..?

- Advertisement -

కొద్దిరోజులుగా రైల్వేఛార్జీలను పెంచుతారని వస్తున్న ఊహాజనిత వార్తల్ని కేంద్రం నిజం చేసింది. ఆర్డినరీ, సెకండ్‌ క్లాస్‌, స్లీపర్‌, ఫస్ట్‌ క్లాస్‌తో పాటు అన్ని ఏసీ బోగీల టికెట్‌ ధరల్ని పెంచింది. ఈ ఛార్జీలను జూన్‌ 30 అర్ధరాత్రి నుంచే రైల్వేశాఖ అమల్లోకి తీసుకొచ్చింది. తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌కు ఆధార్‌కార్డు తప్పనిసరిచేస్తూ జోన్‌ల మేనేజర్లందరికీ సర్క్యులర్‌ జారీచేసింది. కిలోమీటర్‌కు అరపైసా చొప్పున పెంచినా అది రూపాయల్లో లెక్కిస్తే ప్రయాణాన్ని బట్టి ఒక్కొక్కరికి సగటున రూ.5 నుంచి 15 వరకు జేబుకు అదనంగా చిల్లుపడుతున్నది. కేంద్రం మాత్రం ఛార్జీల పెంపును సమర్థించుకుంది. పెంచింది స్వల్ఫమేనని, ఇది ప్రయాణికులకు ఏమాత్రం భారం కాదని పేర్కొంది. కానీ పెంపు ప్రభావం ప్రయాణికులపై తీవ్రంగానే పడనుంది. 2013, 2020లలో ఛార్జీల సవరణ పేరుతో పెంపుదల చేసిన సర్కార్‌, నిర్వహణ, వ్యయాల సాకును చూపెట్టి ఈ ఏడాది ప్రయాణికులపై మరోసారి భారాన్ని మోపింది.
దూర ప్రాంత ప్రయాణాలు చేసే ప్రజలకు రైలు అత్యంత సౌకర్యమైనది. సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలోనూ పేరెన్నికగలది. అందుకే దీన్ని పేదోళ్ల గరీబ్‌రథ్‌గా పిలుస్తారు. అలాంటి రైలు ప్రయాణం రోజురోజుకూ గగనమవ్వడం ప్రయాణికులను ఒకింతా ఆందోళనకు గురిచేస్తున్నది. సాధారణంగా బస్సుఛార్జీలు పెంచే ముందు పాలకులు చెప్పే మాటల్ని గుర్తుచేసుకుంటే గనుక పెట్రోల్‌, డీజిల్‌ ధరల భారాన్ని ఆర్టీసీ మీద పడకుండా ఉండేందుకు టిక్కెట్ల ధరలు పెంచుతున్నామని చిలక పలుకులు పలుకుతారు. లేదంటే సంస్థ తీవ్రంగా నష్టాల్లో ఉందని, ఉద్యోగులకు జీతాలివ్వడమే కష్టమవుతున్నదని చెబుతుంటారు. కానీ ఇక్కడ రైల్వేను చూస్తే ప్రయాణికులతో నిత్యం కిటకిటలాడుతుంది. పండగ వేళల్లో ఈ రద్దీ రెట్టింపవుతుంది. భారతీయ రైల్వేచరిత్రలో ఇప్పటివరకు ఈ రంగం నష్టాల్లో ఉందనే వార్త కూడా వినలేదు. అయినా ఛార్జీలను పెంచి దానికి కుంటిసాకులు వెతుకుతున్నది. ఆధునిక వసతులు, ట్రెయినింగ్‌ వెహికిల్స్‌, హైజీనిక్‌ ఫెసిలిటీల కోసమేనంటూ చెబు తున్నది. ఇది ఏ రకంగా చూసినా ప్రయాణికులను మోసగించడమే.వాస్తవానికి, ప్రజలెన్నుకున్న పాలకులే ప్రభుత్వ రంగాలకు బడ్జెట్‌ పెంచి అభివృద్ధి చేయాలి. కానీ, ప్రజలపై భారాల్ని మోపుతూ కాదు!
ప్రస్తుత టికెట్‌ ధరల్ని చూస్తే సాధారణ, సెకండ్‌ క్లాస్‌ రైలు ప్రయాణం 500 కి.మీ.లోపు పాత ఛార్జీలే ఉంచి వ్యతిరేకత రాకుండా కేంద్రం జాగ్రత్త తీసుకున్నట్టు కనిపిస్తున్నది. ఆర్డినరీ స్లీపర్‌ క్లాస్‌, ఫస్ట్‌క్లాస్‌ ఆర్డినరీ టికెట్ల ధరలు కి.మీ. అరపైసా చొప్పున, అలాగే నాన్‌ ఏసీ ఫస్ట్‌ క్లాస్‌, సెకండ్‌ క్లాస్‌, స్లీపర్‌ క్లాస్‌ టికెట్లపై కి.మీ. ఒక పైసా చొప్పున పెంచింది. వీటిల్లో ఎక్కువమంది పేదలు, మధ్య తరగతి ప్రజలు వెళ్తుంటారు. అందులో ఐదువందల కి.మీలోపు ప్రయాణించే వారు చాలా తక్కువ. ఎందుకంటే, ప్రత్యేకంగా కార్లు, విమానాల్లో తిరిగే ఆర్థిక స్థోమత వీరికుండదు. రైల్లోనే దూరప్రాంతాలకు వెళ్లొస్తుంటారు. ఇంకా చెప్పాలంటే నిలబడి, అది కుదరకపోతే వేలాడుతూ అయినా ఏదో విధంగా గమ్యానికి చేరుకునే వారు కోకొల్లలు. అలా ప్రమాదాల్లో చనిపోయినవారు కూడా అనేకం. ప్రభుత్వానికి ఛార్జీల పెంపుపై ఉన్న శ్రద్ధ, మౌలిక వసతుల కల్పన, ప్రయాణికుల భద్రతపై లేకపోవడం శోచనీయం. ఉన్న ఊళ్లో ఉపాధి లేక ముంబాయి, భీవండి, సూరత్‌, షోలాపూర్‌లాంటి ప్రాంతాల్లో వలస కార్మికులు పనులు చేస్తుంటారు. హైదరాబాద్‌ నుంచి సూరత్‌కు సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరానికి లెక్కేసినా 500 కిలోమీటర్ల అదనపు ప్రయాణానికి రూ.5, నెలకో లక్ష మంది ప్రయాణిస్తే రూ.5లక్షలు, ఏడాదికి 60లక్షలు. ఇది సామాన్యులకు భారమే కదా! ఇక్కడ చెప్పుకునేది ఒక రూటుకు మాత్రమే. అలాంటిది దేశంలో ప్రతిరోజు కొన్ని లక్షల మంది వేల కి.మీ. ప్రయాణిస్తారు.
ఏసీ కోచ్‌ రైళ్లపైనా కి.మీ.కు 2 పైసలు చొప్పున పెంచారు. మోడీ గొప్పగా చెప్పుకునే వందేభారత్‌ కూడా ఇందులోకే వస్తుంది. తేజస్‌, రాజధాని, శతాబ్ది, దురంతో, హమ్‌ సఫర్‌, అమృత్‌భారత్‌, గతిమాన్‌, మహామన, జన శతాబ్ది, యువ ఎక్స్‌ప్రెస్‌, అంత్యోదయ, విస్టాడోమ్‌ కోచ్‌ వంటి అన్ని ప్రీమియం, స్పెషల్‌ సర్వీసులపైనా ఛార్జీలను వడ్డించారు. దేశంలో నేడు పేదలకు పూట గడవడమే కష్టంగా మారింది. ఎంతోకొంత చదువుకున్న కుటుంబాల్లో కూడా ఇద్దరు, ముగ్గురు పనిచేస్తే తప్ప ముద్దచేతికి రాని పరిస్థితి ఉంది. మోడీ అధికారంలోకి వచ్చిన ఈ పదకొండేండ్ల కాలంగా నిత్యావసరాలు, పెట్రోధరలు, విద్యా, వైద్య ఖర్చులు, ఈఎంఐలు, లోన్లు ఇలా సవాలక్ష సమస్యల మధ్య సామాన్యులు బతుకు లీడుస్తున్న దుస్థితి నెలకొంది. పైగా పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటివి ఐదేండ్లుగా ప్రజల్ని నిత్యం వెంటాడుతూనే ఉన్నవి. ఈ నేపథ్యంలో వీలైతే ప్రజలపై భారాల్ని తగ్గించాలి. కానీ, మరిన్ని రుద్దడం సబబు కాదు. పెంచిన ఛార్జీలపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో కేంద్రం పున:పరిశీలించాలి, వెంటనే ఉపసంహరించుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -