– చైనాలోని గ్వాంగ్‌డాంగ్ నమూనానే ఆదర్శం
– తెలంగాణ రైజింగ్ నిరంతర ప్రక్రియ
– ఈ ప్రయాణంలో భాగస్వాములు కండి
– అందరి సలహాలు, సూచనలు స్వీకరిస్తాం
– సేవా, తయారీ, వ్యవసాయ రంగాల్లో సమున్నత అభివృద్ధే లక్ష్యం : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
– దూరదృష్టితోనే అభివృద్ధి సాధ్యం : గవర్నర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘రాష్ట్ర ప్రభుత్వం సాధించాలనుకుంటున్న విజన్ డాక్యుమెంట్ లక్ష్యం కష్టమే కావచ్చు… కానీ అసాధ్యమేం కాదు’ అని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేండ్లు పూర్తవుతుందనీ, ఆ క్రమంలో తెలంగాణ మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. అందుకోసం తమ ప్రయాణంలో భాగస్వాములు కావాలని జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. సేవా, తయారీ, వ్యవసాయ రంగాల్లో సమున్నత అభివృద్ధే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దానికోసం చైనాలోని అన్ని ప్రావిన్స్‌లలో అత్యధికంగా పెట్టుబడుల ను ఆకర్షించి, వృద్ధిరేటును సాధించిన గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ నమూనాను అనుసరిస్తామని స్పష్టం చేశారు. కేవలం 20 ఏండ్లలోనే గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ ప్రపంచం లోనే అత్యధిక పెట్టుబడులు, వృద్ధి రేటును సాధించిందని గుర్తుచేశారు. ఆర్థికాభివృద్ధిలో చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల నుంచి ప్రేరణ పొందామని తెలిపారు. ఇప్పుడు ఆ దేశాలతోనే తాము పోటీపడబోతున్నామని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండేండ్లు పూర్తవుతున్న సందర్భంగా రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేట్‌లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025ను సోమవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి కె.రామకృష్ణారావు స్వాగతోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్‌ల నుంచి తాము స్ఫూర్తి పొందామన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన ఆనాటి నాయకులు భారత రాజ్యాంగాన్ని రూపొందించి భవిష్యత్తు కోసం రోడ్‌మ్యాప్ వేశారని తెలిపారు. రాజ్యాంగంలో సార్వభౌమత్వం, సెక్యులరిజం పదాలు చేర్చి, భారత్‌ను రిపబ్లిక్ దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించారని వివరించారు. తాము కూడా అదేబాటలో రోడ్‌మ్యాప్ రూపొందించుకున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం దశాబ్దాలపాటు ఉద్యమం సాగిందనీ, సోనియాగాంధీ, ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్ నాయకత్వంలో తెలంగాణ స్వరాష్ట్ర కల సాకారమైందన్నారు. పదేండ్ల తర్వాత తాము తెలంగాణను దేశంలోనే ఆర్థికంగా బలంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. 2047 నాటికి ఏం సాధించాలనే దానికి తగిన సలహాలు ఇవ్వాలని ఆయన నిపుణులను కోరారు. ప్రపంచంలోనే ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చేసే ప్రయత్నంలో ”తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ -2047”కు బీజం పడిందని తెలిపారు. అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నిటి ఆయోగ్ నిపుణుల సహాయం తీసుకున్నామన్నారు. తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించడంలో సహకరించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. గ్లోబల్ సమ్మిట్‌కు అన్ని రంగాల ప్రతినిధులు రావడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. వ్యాపార వేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు, నిపుణులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమ్మిట్‌లో అందరి సూచనలు, సలహాలు, అభిప్రాయాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణలో అపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్రంలో మంచి సానుకూల వాతావరణం ఉందని తెలిపారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని సంకల్పంగా పెట్టుకున్నట్టు చెప్పారు. దేశంలో తెలంగాణ జనాభా దాదాపు 2.9 శాతం ఉండగా, దేశ జీడీపీలో రాష్ట్రం నుంచి దాదాపు 5 శాతం వాటాను అందిస్తున్నామన్నారు. ఆ జీడీపీలో 2047 నాటికి 10 శాతం వాటాను సాధించే లక్ష్యసాధన కోసం రాష్ట్రాన్ని సేవారంగం, తయారీ రంగం, వ్యవసాయ రంగం కోసం మూడు భాగాలుగా విభజించుకున్నామని తెలిపారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్), పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (రేర్) అనే మోడళ్లను నిర్దేశించుకున్నామన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు అందరూ సంపూర్ణ మద్ధతు ఇవ్వాలని కోరారు. మునపటి కంటే ప్రస్తుతం తానెంతో విశ్వాసంతో ఉన్నానని ధీమా వ్యక్తం చేశారు. నిన్నటి కల, నేడు ప్రణాళికగా మారిందనీ, దానిలో అందరూ భాగస్వాములుగా చేరారని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రైజింగ్ నిరంతర ప్రక్రియ అని ఆయన స్పష్టం చేశారు.
దూరదృష్టితోనే అభివృద్ధి సాధ్యం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో ముందుకెళ్తున్నదని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. సోమవారం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మట్లాడారు. వికసిత్ భారత్ -2047లో తెలంగాణ రైజింగ్ కూడా ఒక భాగమని తెలిపారు. ఆ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ అడుగులు వేస్తున్నదని చెప్పారు. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణ ఎదగాలని ఆకాంక్షించారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుందని చెప్పారు. మహిళల సాధికారత దిశగా బస్సుల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించారని తెలిపారు. తెలంగాణలో స్థిరమైన, పారదర్శక ప్రభుత్వం ఆవిష్కరణలతో అన్ని రాష్ట్రాలకంటే ముందున్నదని తెలిపారు. విమానాశ్రయాలు, రైల్వేలు, రోడ్ల విస్తరణ దిశగా చర్యలు తీసుకుంటున్నదని కితాబిచ్చారు.. అన్ని రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ, సమ్మిళిత అభివృద్ధి దిశగా వెళుతుందని తెలిపారు. మహిళా సంఘాలకు సోలార్ ప్రాజెక్టులను అప్పగించారని గుర్తుచేశారు. విద్యరంగాన్ని బలోపేతం చేసే క్రమంలో సమాజాన్ని భాగస్వాములను చేశారనీ, పారదర్శకత, జవాబుదారీతనం, వ్యూహాత్మక ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. పర్యావరణాన్ని, చెరువులను కాపాడుతూ మహిళా సంఘాల జీవనోపాధికి ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు నేడు మనం చేసే పనిపై ఆధారపడి ఉంటుందనీ, ఆ దిశగా మౌలిక సదుపాయాల కల్పనను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిందని గవర్నర్ వివరించారు. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక పాలసీని తెచ్చిందని చెప్పారు. నైపుణ్యం కలిగిన కార్మికులు, మానవ వనరుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుందని తెలిపారు. ప్రధాని వికసిత్ భారత్ -2047 కోసం గట్టి దార్శనికత, లక్ష్యాలను నిర్దేశించుకుని, స్పష్టమైన ప్రణాళిక, కార్యాచరణతో ముందుకెళ్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా ముందుకెళ్తోందని చెప్పారు. భవిష్యత్ నిర్మాణం కోసం, గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలని గవర్నర్ సూచించారు.



